యుద్ధం వెనుక

Advertisement
Update: 2023-09-13 11:47 GMT

యుద్ధాలకు ముగింపు పలికేదీ లేదు.

చితులను పేర్చడం ఆపిందీ లేదు

తరిగిపోతున్న కొండలు మంచుబిందువుల్లా కరిగిపోతున్నా

డబ్ డబ్ డబ్ మని చేసే బూట్ల శబ్దం ఆగిందీ లేదు!

యుద్ధం అసలు ఎందుకొస్తుందో ఎందుకు పోతుందో

పూర్తిగా అర్ధం చేసుకున్నదీ లేదు!.

నష్టం మొత్తం గుట్టలు గుట్టలుగా పోగేసుకున్నాక

కన్నీరు మున్నీరుగా ఏడవడం తప్ప చేసేదేమీ లేదు!

యుద్ధం నీకా నాకా అన్నది కాదు

మరణం ఎవరికా అన్నదే ఎక్కుపెట్టబడిన గురి

మృత్యువు ఎటువైపన్నది కాదు-

యుద్ధం మధ్యలో మృత్యువు ఎప్పుడూ

రెండు వర్గాల మధ్య గీతలో దాగుండే సంకేత గీతం!

రెండువర్గాల జెండాల్లో

తలరాతల్ని చెరిపేసే

విషాద గాత్రం !!

యుద్ధ నష్టం దేశాల మధ్యనే కాదు-

నడిరోడ్డుపై పడే ఓ కుటుంబ

ఛిద్ర రూపం!

ఒంట్లో ఏదో ఒక ప్రధాన అంగాన్ని

కోల్పోయిన విషాద స్వరూపం!

యుద్ధం

శవయాత్రలో కార్చే కన్నీటి బొట్లే కాదు..

సమాధి స్థలాన్ని సిద్ధం చేసే

కనిపించని

యంత్రం!

యుద్ధం ఒకరోజుది కాదు.

ఒక సంవత్సర కాలానిది కాదు.

యుద్ధం

కోల్పోయిన ఒక జీవిత కాలానిది..

దాని వెనుక కనిపించక

కాచుకు కూర్చున్న

అనేక మానవతా నీడలది .

- చలపాక ప్రకాశ్ (విజయవాడ)

Tags:    
Advertisement

Similar News