విధిలిఖితం

Advertisement
Update:2023-10-22 23:04 IST

అంతా రాసిపెట్టే ఉంటుంది

అంటాడు పనిదొంగ.

ఎంతకష్టపడ్డా ప్రయోజనంలేదండీ

అంటాడు మరొక సోమరి.

తెకతేరగా కంచంలోకి

అన్నం వచ్చి పడాలనుకునేవాడే ప్రతివాడూ!

ఏమాత్రమూ కష్టపడకుండానే

ఏ ప్రయత్నమూ చేయకుండానే

నిరాశలో క్రుంగి పోతూ

కనిపించనిదేన్నో తిడుతూ

వీళ్ళుబ్రతుకీడుస్తుంటారు!

అకర్మణ్యులు వీళ్ళు.

వీళ్ళకు వర్తమానం లేదు

భవిష్యత్తు అసలే ఉండదు!

నాగలినో బాడిసనో

సమ్మెటనో గొడ్డలినో

భుజాన వేసుకుని

ముందడుగు వేసే

వాడి అడుగులను

ప్రేమగా ముద్దాడుతుంది భూదేవి!

శ్రమించి కొండలను పిండిచేసేవాడి దేహం మీద

చెమటచుక్కలు మల్లెపూలై

విరుస్తాయి!

దేశంనిండా పరిమళాన్ని

పరుస్తాయి!

రైతు శ్రమిస్తూ

ఆశల్ని నాటుకుంటాడు.

బ్రతుకు పెదాలమీద

చిరునవ్వులను

మొలిపించుకుంటాడు!

శ్రమైక జీవనసరస్సులో

ఈదుకుంటూకార్మికుడు

భుజించే హక్కును

ఆర్జించుకుంటాడు.

ఆర్జితాన్ని ఆలుబిడ్డలతో పంచుకుంటాడు!

అనాది నుంచీ శ్రమకూ సంపదకూ

అవినాభావ సంబంధం.

శ్రమించి సృష్టించలేనివాడికి

అనుభవించే అర్హత ఉండదు!

విధిలిఖితం అనేది

చేతకానివాడి నినాదం.

చెమట చిందించి శ్రమించే వాడు వీరుడు

వాడు తలరాతలను మారుస్తాడు!

విధిలిఖితాన్ని హతమారుస్తాడు!

- సి.హెచ్.వి.బృందావనరావు

Tags:    
Advertisement

Similar News