భావన..సమాజంలో మనం ఒకరం

Advertisement
Update:2023-07-17 23:01 IST

త్యాగం, ఆదర్శం లోపిస్తే వ్యక్తులకు ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత సంపద ఉన్నా అవి మానవాళికి నిష్పయ్రోజనంగా పరిణమిస్తాయి.

ఉత్తముడు తన జీవితంలోకి చెడు రానివ్వడు. స్వీకరించిన పనిని నిజాయతీగా చేసే వ్యక్తుల జీవన విధానాల్లో ఆదర్శం, త్యాగం మిళితమై ఉంటాయి. ‘మనం వేరు, సమాజం వేరు’ అనే భావన అహంకారానికి దారితీస్తుంది. మనలాంటివారే మన చుట్టుపక్క ఉన్నవారూ అనే భావన ధైర్యాన్నిస్తుంది.

మన సమాజంలో చాలామందికి ‘నేను ఒక్కణ్నే కష్టాలు పడుతున్నాను’ అనే భావన ఏర్పడుతూ ఉంటుంది. ‘కాదు కాదు… నాలాంటివారు ఎందరో ఉన్నారు’ అని గ్రహిస్తే ధైర్యం కలుగుతుంది.

అహంకారంతో నలుగురికీ దూరమైతే బిక్కుబిక్కుమంటూ భయంతో బతకాల్సి వస్తుంది.

ఈశ్వరుడు తప్ప సర్వజ్ఞులెవరూ ఉండరు. తమకు అన్నీ తెలుసునని ఎవరైనా అహంకరిస్తే వాళ్లకు ఏమీ తెలియదని అర్థం! అందరితో కలిసి మెలిసి జీవించడానికి అహంకారం అడ్డువస్తుంది. అహంకారికి లోకం తెలియదు. అందరిలో తానూ ఒకడనే సంగతి గ్రహించినవాడే ధన్యుడు.

విజ్ఞులైనవారు కష్టకాలాన్ని సద్వినియోగ పరచుకుంటారు. అస్త్ర శస్త్ర పరీక్షల్లో ఉత్తముడిగా అర్జునుడు నెగ్గాడు. ఆ తరవాతా అర్జునుడు విద్యాభ్యాసం కొనసాగించాడు. విద్యార్థికి అహంకారం కూడదు. అర్జునుడు నిత్య విద్యార్థి, వినయశీలి. సామాన్యులతో కలిసిమెలిసి జీవించాడు. పన్నెండు సంవత్సరాల అరణ్యవాస కాలంలో వినయంతో గురువులను ఆశ్రయించి ఎన్నో విధాలైన విలువిద్యలను, సిద్దులను సాధించాడు.

కష్టాలను స్వయంగా రుచి చూసినవాళ్లు ఇతరుల కష్టాలకు వెంటనే స్పందిస్తారు. కుంతీదేవి సుఖాలకంటే కష్టాలే ఎక్కువగా అనుభవించింది. ఇంటి పక్కవాళ్లు శోకిస్తుంటే వెంటనే స్వయంగా వెళ్లి, కారణం అడిగి తెలుసు కున్నది. ఒక రాక్షసుడికి ఆహా రంగా ఇంటివారి కుమారుణ్ని పంపవలసి వచ్చిందని తెలుసుకొని చలించిపోయింది. అతడికి బదులుగా తన కుమారుణ్ని పంపుతానంది! ఒకరికోసం ఒకరు నిస్వార్థంగా జీవితాలు సైతం అర్పించడానికి సిద్ధపడటంకంటే గొప్ప త్యాగం ఉండదు!

అహంకారి ఒక హద్దుకు పరిమితమై ఉంటాడు. గిరిగీసుకొని దాంట్లో తనను తాను బంధించుకుంటాడు. అదే సర్వలోకం, సర్వస్వం అంటాడు. మొండిగా, మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. సమాజ సమగ్ర స్వరూపం, సత్యం తెలుసుకోవడం అతడికి అసాధ్యమవుతుంది. అలాంటివాళ్లకు జ్ఞానప్రాప్తి కలగాలంటే వివేకం అవసరం.

వ్యాసుడు మహాజ్ఞాని. శుకమహర్షి బ్రహ్మజ్ఞానం సంపాదించాలని ఆయన కోరిక.తనకు అన్నీ తెలిసినప్పటికీ శుకుణ్ని జనకుడి వద్దకు పంపాడు. ఆశ్రమవాసంలో బ్రహ్మసూత్రాలను నేర్చుకున్నా, జనకుడు కుటుంబ బాధ్యతల మధ్య వాటిని ఆచరిస్తాడు. జ్ఞాన పరిపూర్తికోసం, జ్ఞాన పూర్ణత్వంగల వ్యాసుడంతటి మహనీయుడు శుకుణ్ని జనకుడి వద్దకు పంపాడు. ఇతరుల గొప్పతనం గుర్తించడంలోనే గొప్పతనం ఉంది.

వ్యాసుడు శుకుడికి ఇచ్చిన ఆదేశం, ఎప్పటికీ సందేశాత్మకం… ‘సమాజంలో ఎప్పుడూ మనకంటే గొప్పవాడు ఉంటాడని గ్రహించడం అవసరం’. అది జ్ఞానుల లక్షణం.

- సి. భారతి

Tags:    
Advertisement

Similar News