బాగా పొద్దోయింది. అయినా ఆకలెయ్యడం లేదు భూపతికి. లోలోపల ఇదీ అని చెప్పలేనిదేదో అట్టుడికి పోతోంది. ఒక దగ్గర ఉండలేకపోతున్నా డు . అటూ ఇటూ ఇంట్లోకి , బయటికి తిరిగేస్తున్నాడు.
మెడ మీదకి కండువా విసిరేసుకుని బయటికి వచ్చాడు.వీధి దీపాలు వెలిగిపోతున్నాయి. జనం రోడ్డుమీదే తిరుగాడుతున్నారు. 'ఒకప్పుడు కరెంటు లేక ఊరంతా పొద్దు గూకగానే చీకట్లు కమ్మేసి ఊరికినే నిద్ర ఎలిపోవొచ్చేది. ఇప్పుడో? అందరూ వీధుల్లోనే తగలడుతున్నారు!'ఒళ్ళు మండి పోతుంటే విసవిసా నడుస్తున్నాడు.
గుమ్మరేగడి పాలెం ఆ ఊరి పేరు. భూపతి ఊరి పెద్ద.భూపతి మాటంటే మాటే. ఇప్పటి వరకు తనకి ఎదురులేదు. అయినా సరే గొప్ప ఇదిగా ఉంది. నడుస్తూ నడుస్తూ పొలం వేపు అడుగులేస్తున్నాడు.
" బోయినం సేసావురా భూపతీ! ఇంత సీకట్లో ఏడకి పోతున్నావ్?" అడుగుతూఎదురొచ్చాడు సాంబ.
లేదని అడ్డంగా తల ఊపాడు భూపతి.
"ఈ రాతిరికేనా?"అన్నాడుసాంబ.
"ఏటిదదీ?"గతుక్కుమన్నాడు భూపతి.
లోలోపల 'ఈడీకెలా తెలిసిపోయింది?' అనుకున్నాడు.
'ఒద్దురా భూపతీ. అన్నాయంగా ఆడి పొలం మంటెట్టకు!"సాంబ బతిమి లాడాడు.తిక్కెక్కిపోయింది భూపతికి.
"ఎవుడ్రా నేను మంట పెట్టిస్తున్నానని కూసింది?"గట్టిగా అరుస్తూ లాగి లెంపకాయిచ్చుకున్నాడు భూపతి.
"కొడితే కొట్టావు గానీ అంతపని సెయ్యమాకురా.. నీకు అసలు ఇసయం తెల్ దు!"అన్నాడు సాంబ.
"థూ!.. నీ కడుపు కాలా!ఎవుడ్రా నీతో పేలింది? అరిచాడు భూపతి
"నిజం సెప్పితే నీ అదుప్పోయిన కోపం ఇన్న ఓళ్లని కూడా కాల్చేస్తది. నే సెప్పలేను. నిన్నాపలేను!"గట్టిగా ఏడుపు అందుకున్నాడు సాంబ.
అప్పుడే ఆ వయిపున సీతమ్మ ఆవుల్ని ఇంటికి తోలుకెళ్తోంది. ఓ యావు తప్పడి పోయి ముప్పు తిప్పలు పెట్టింది. అందుకే బాగా సీకటి అయిపోయాక అవుల్ని తోలుకుని పోతోంది.ఇద్దరూ ఆయమ్మను చూసి ఒక్క మాట మాట్టాడకుండా భూమి కేసి, ఆకాశం కేసి చూస్తున్నారు. ఇదే సీతమ్మ కి గొప్ప విచిత్రంగా ఉంది.
'తోవనెల్లీవొళ్ళని పిలిచి ఇంత హస్కు ఏసీ ఆళ్ల పని గూడ సెడగొట్టే నాయాల్లు ఇంత ఉలుకు పలుకు లేకంట ఉన్నారంటే ఏదో ఎదవ పని సెత్తన్నారన్నమాట.'అనుకుని అక్కడే గట్టు మీనకూర్చుండిపోయింది. కాస్సేపయింది.సీతమ్మకీ విషయం తెలిసే పోయింది.
"నాకూ సాయంత్రానికి తెలిసిపోనాదిలే. నువ్వింత మొండిఘటం ఏంట్ర భూపతీ... నీకు బొడ్డూడిదగ్గర్నుంచి రామినాయుడు నీతోనే ఉన్నాడు.
మీ అయ్య కూడా ఒక్కనాడూ ఆడిని పేదోడని చిన్నచూపు చూడలేదు. నిమ్మళంగా వాడినీ తన కాళ్ళ మీద నిలబడేట్టు చేసి ఊర్లో అందరికి ఓ మాట చెవినేసి ఆడు కొనగలిగే రేటు కి తగ్గించి ఆ పొలం కొనిపించి ఓ తీరుకి తెచ్చాడు. ఇప్పుడు దాన్ని మంటేట్టించేస్తావా?" నిలదీసి అడిగింది.
ఆ మాటల్ని విని అంతెత్తున ఎగిరి పడ్డట్టు ఉలిక్కిపడ్డాడుభూపతి.
"ఎవురు నా మీద ఇటువంటి అభాండాలు ఎస్తన్నారో సెప్పు సీతమ్మక్కా!అని అడిగాడు.
లోలోపల రగిలిపోతున్నా పైకి నవ్వుతున్నాడు. "ఆ.. సెప్తారు.ఎవుర్రా పులి నోట్లో తలెడతారు. నీ మంచి కోసం సెప్తన్న. అసలు ఇసయం తెలీక గెంతుతున్నావ్.ఆపేయ్.సిలక్కి సెప్పినట్టు సెప్తున్న నా మాటిను"అనేసి సీతమ్మక్క వెళ్ళిపోయింది. సాంబ ఆళ్ళిద్దరూ మాట్టాడుకుంటున్నప్పుడే జారుకున్నాడు.భూపతి ఇంటిదారి పట్టాడు. సాంబ మాట గుర్తుకు వచ్చింది.
'ఏంటి ఆ అసలు ఇసయం?
ఏటయిఉంటుంది?'ఆలోచనలో పడ్డాడు.
అలాగే ఇంటికొచ్చి ఇంత తిని పక్కెక్కాడు. నిద్ర రావట్లేదు. పెద్ద పెద్ద చప్పుళ్ళు అవుతున్నాయి.'ఎవుడ్రా అది?' గట్టిగా అరిచాడు.
"అయ్యా.. నేను.కిట్టిని. పండుగ రెండు రోజుల్లోకి వచ్చిసిందని అమ్మగోరు కబురెడితే వచ్చి ఇల్లు, వాకిళ్లకి శుభ్రం చేసి బంతిపూలు కడుతున్న!"అన్నాడు.
"పండగొచ్చేసిందన్నమాట. "
వద్దన్నా పాతజ్ఞాపకాలు బుర్ర గెలికేస్తున్నాయ్. రామినాయుడు నవ్వు ఇనపడింది చెవిలో. 'వెంటాడుతున్నాడు ఎదవ'అనుకున్నాడు. తన్నేమని పిలుస్తాడు? 'సిన్న దొరా'అని కదా?'
తనకి పెద్ద సింమాసనం ఎక్కినట్టు భారీ అంబారీ మీద ఊరేగుతున్నట్టు ఉండేది.పైకి మాత్రం"ఒద్దులేర ! పేరెట్టే పిలువ్!"అని చెప్పలేదూ? అయినా పిలిచీవోడు కాదు. క్రితం సంవత్సరం సంకురాతిరి పండక్కి కోళ్ళపందెంలో కూడా తన్నే గెలిపించాలని ఆడి వేపు బలం తక్కువున్న కోడినే ఎట్టాడు. తను గెలిచాక సంబరాలు చేయించి గెంతులు వేసాడు.మరో రెండురోజులు పోయాకే ఎద్దుబండిల పోటీలు.తనకంటే ముందుకెళ్లి గెలిచి నవ్వాడు.
తనకంటే ముందుకెళ్లి. పళ్ళు పటపట లాడించాడు భూపతి.వాడికి తెగులు ఎలిపోవచ్చింది. పంట కూడా తన కంటే ఎక్కువపండించాడు.అప్పుడేటన్నాడు...
"ఓరి భూపతీ! ఈ సారి పంట గొప్పగా దిగిందిరా!"తలగరేస్తూ అన్నాడుకదా?
తన్ని 'ఒరే!'అన్నాడు. సిన్నప్పటికాడి నుంచి "ఒరే"అనమని ఎంత బతిమాలిన అననోడు పంట పండాక అన్నాడు. పైగా తలాఎగరేశాడు.అందుకే కదా ఆడి పొలం మంటగలిపీమని ఊళ్లోని చెత్త నాయాళ్ళ కి పురామయించాడు. అనుకుని కళ్ళు మూసుకున్నాడు.
కళ్ల నిండా రామినాయుడు నవ్వే.
"వాడు ఏడుస్తుంటే ఎలాగుంటుంది? " అనుకున్నాడు. కొరడాతో చెళ్లున కొట్టినట్టయి పక్కకి తిరిగి పడుకున్నాడు.
గతం మోకాలుతో మొహం మీద ఈడ్చితన్నినట్టు గతం లో కి తీసుకెలిపోయింది మనసు.
★★★★★★
ఆ రోజు తనకి నూట అయిదు జొరం వచ్చిందని తెలిసి ఏసుకోబోతున్న చొక్కా చేత్తో పుచ్చుకుని రోడ్డంట లగెట్టుకుని వచ్చేసాడు. అప్పటికే తన కళ్ళు మూతలు పడిపోతున్నాయి. అప్పుడు ఏడ్చాడు వెక్కి వెక్కి."సిన్న దొరా! నీకేం కాదు"అని అరుస్తుంటే నిద్రలోకి పోయాడుతను. ఇరవై రోజులు సేవ చేస్తూ చేస్తూ ఏడుస్తూనే ఉన్నాడని అమ్మ చెప్తే బాగుపడ్డాక అందరికి చెప్పుకుని చెప్పుకుని సంతోష పడ్డాడుకదా? తనకోసం ప్రాణం ఇచ్చే తన చెలికాడు రామినాయుడు
'వాడెంత మంచోడు'అనుకున్నాడు.
మరి ఎందుకు ఆడు రెండు తప్పులు చేసాడు?
"ఆడి ఎద్దుల బండి తన బండికంటే ముందుకు తీసుకెళ్తాడా? తనని పేరెట్టి పిలుస్తాడా?" అహం చెలరేగిపోయింది. పొలం మంట గలిసిపోతే వాడికి తెలిసి వస్తుంది.కసిగా అనుకున్నాడు.
దీపాల పండగ వచ్చీసిందని కుర్రకారు జువ్వలు, చిచ్చుబుడ్లు, మరీ ముక్యంగా వెలమకాయలు దట్టించి పారేస్తున్నారు.
పండగ సంబరాలు జోరుగా సాగుతున్నాయి. ఊరిపెద్ద , మోతుబరి అయిన భూపతి రాయుణ్ణి దర్శించుకోడానికి జనం వచ్చి ఒంగి ఒంగి దండాలు పెడుతుంటే రామినాయుడు ఎగరేసిన తల మరిచిపోయి పూర్వపు ఉత్సాహంతో వెలిగిపోయాడు.అప్పుడొచ్చారు డబ్బులకోసం గడ్డి తినే బాచ్ పొలం సెదర గొట్టడానికి ముహూర్తం పెట్టుకుని.
దాన్లో ఒకడన్నాడు." దొరా! మీరిద్దరూ సిన్నప్పటి కాడి నుంచి దోస్తులట. అసలువిషయం తెలుసా?"అన్నాడు.
"ఎంటదిరా?"అన్నాడు .
"పొలం మీ పేర్ని రాయించేసినాడు. పండగెళ్లాక ఎల్లొచ్చు కదా అంటే 'మా దొర నన్ను వదిలేసాక నాకు పండగేటి?'అని ఊరొదిలి పోతున్నాడని అంటున్నారు. మీరే కాదంటే ఈ ఊళ్ళోనే కాదు...ఈ లోకంలో తనకేటీ అక్కర్లేదని అన్నాడట. ఇప్పుడది మీ పొలమే. మీది మీరే తగలెత్తుకుంటే ఎలా?"అన్నాడు.
"ఏంటీ?"గతుక్కుమన్నాడు భూపతి. విస్తుపోయాడు. గుండె చెరువై పోయింది.కట్ట తెంచుకుని కళ్ళవెంట నీళ్లు కారిపోతున్నాయి.
చిన్నప్పుడు చదివిన పద్యం గుర్తుకొస్తోంది. "కూరిమి కల దినములలో నెరములెన్నడు కలుగనేరవు.
మరి ఆకూరిమి విరసంబయిన నేరములే తోచుచుండు. నిక్కము సుమతీ...!
సరిగ్గా బుర్ర మీద ఒక్క చరుపు చరిచినట్టు మెదడులో జేగంట మోగింది భూపతికి .మాష్టారు మాటలు గుర్తొచ్చాయి.
"ఇలా ఎందుకు అవుతుందంటే
మనo వక్రంగా చూడబట్టి.అవును. తనే ఎన్నిసార్లు "సిన్నదొరా అనొద్దని హాయిగా పెరెట్టి పిలవమని అడగలేదు. రామినాయుడు మొహమాటం, సిగ్గు తో.. 'ఒద్దులే దొరా'అనేవాడు. కానీ ఎంతకాలం పట్టింది.. 'ఒరే 'అనడానికి . తను ఆ చనువుకి ఎగిరిగెంతేయ్యాల్సింది పోయి అహం తో వాడి నాశనమే కోరుకున్నాడు. వాడు అంతకంతకూ ఆకాశమంత ఎదిగిపోతుంటే తను అహంకారంతో కుంచించుకు పోతున్నాడు. స్నేహానికి వాడిచ్చే విలువకి వెల కట్టడం అసాధ్యం. తిరిగి తానేమివ్వగలడు? ఇప్పుడు వాడు కదా 'దొర"!!
అందులో ఒకడన్నాడు."మావూ ఉండబట్టలేక మాలో
మేమనేసుకుంటుంటే సాంబడుకి తెలిసిపోయింది దొరా... ఆడికి తెలిస్తే గ్రామంలో చాటింపే కదా? " అని నవ్వాడు.
రెండు నిముషాలు అలాగే కూర్చుని టక్కున లేచి నిలబడి కూతుర్ని కేకేశాడు భూపతి.
"అమ్మీ ! రామినాయుడు మామయ్య ఇంటికి పోతున్న. అందరూ అక్కడికే వచ్చెయ్యండి. దీపావళి పండుగ అక్కడే!"కండువా భుజం మీదేసుకుని పరుగుట్టాడు.
అలనాడు విష్ణుమూర్తి ఎనకమల్లి అన్నీ పరుగులు పెట్టినట్టు భూపతి వెనకాల తాళం తప్పెట్లు, బాజాభజంత్రీలు, జనమూ కూడా.
ఊరంతా పండగ మొదలయిపోయింది.
- బులుసు సరోజినీదేవి