నిద్రమంపు వదలదు
లేవాలనిపించదు
ఐనా లేచితీరాలగదా!
ఇంటిడ్యూటీలన్నీ
విడవకుండా ముగించి
రేపటి కార్యక్రమాలకు
సరంజామా సిద్ధంచేసి
పిల్లలను మంచమెక్కించి
నిద్రపుచ్చి
నిద్రమత్తులోనే ఆక్రమించుకునే మగదూకుడుకు
సమాధానపత్రాన్నిలిఖించి
అలాకన్నుమూసేసరికి
అర్ధరాత్రిదాటుతుంది !
తప్పించుకోలేనిమర్నాటి
పని వత్తిళ్ళు
తట్టితట్టి లేపుతున్నా
నిద్రమంపు వదలదు, లేవాలనిపించదు,
ఐనా లేచితీరాలగదా!
పిల్లల స్నానాలూపానాలూ
టైంప్రకారంఅమరిపోవాల్సిన కాఫీలూటిఫిన్లూ
సర్ది పెట్టాల్సిన లంచిబాక్సులూస్కూలుబ్యాగులూ
సొంతవొంటికోసం
కొంతసమయందొంగిలించుకొని
ఆలస్యంకాకుండా
బస్టాపుచేరాల్సివున్నా
నిద్రమంపు వదలదు! లేవాలనిపించదు!
ఐనా లేచితీరాలగదా!
బస్సులో మగకక్కుర్తుల
రోత వత్తుకోళ్ళూ
పురుషోద్యోగులుకార్చుకునే
సొంగలూ
అధికారమదం వినిపించే
ద్వ్యర్థికావ్యాల కవిహృదయాలూ
మబ్బుల్లోంచి కనిపించే కొమ్ములరాక్షసుడిమొహంలాగా
మగత నిద్దర్లో గూడా
మాగన్నుగా కనిపిస్తుంటే
నిద్రమంపు వదలదు! లేవాలనిపించదు!
ఐనా లేచితీరాలగదా!
ఇంటికి రాగానే
అమ్మా అని కరుచుకునే
పిల్లలకోసమూ
మరోదారికిమళ్ళించలేని
సంసారశకటం
సజావుగా సాగటంకోసమూ
నిద్రమంపైనాసరే లేవాలనిపించకపోయినాసరే
ఆడదాన్ని గాబట్టి
నేనే లేచితీరాలగదా!
ఆకాశంలో సగం నేనేనట!
ఐనా కారుమబ్బులన్నీ
నాసగంలోనే
ముసురుకుంటాయేమిటో!
ఐనా నేనే లేచితీరాలగదా!
- బృందావన రావు
(అహమ్మదాబాద్)