ప్రకాశవంతమైన రాత్రి
చీకటి రంగు దాల్చిన కనుల మీద జారుతుంది
వేంచేసిన వెన్నెల
కలలను కవ్విస్తూ.. ప్రసరిస్తూ.. కమనీయ కవనంలా...
అలసట ఆవిరవుతూ..
పవనాల పయనాలు పవళింపుని పరామర్శిస్తాయి
కురులను పురి విప్పిస్తాయి
కిటికీ చువ్వలు
కాలి మువ్వలతో
పాదం కలుపుతాయి
సంయమనంగా
నిశ్శబ్ద నిషావరణం లో
సజావు సంభాషణ
ఏ రెండు చెవుల్ని తాకదు
ఒక మదిని మోగుతుంది మౌనంగా..
రాత్రికి రాత్రే అంకె ఒకటి విరిగిపోతుంది
ఇంకొక కొత్త కల ఒకటి కళ్ళ మీద పరుచుకుంటుంది
రాతిరి
కల మేల్కొంటుంది
మెలకువ నిద్రిస్తుంది
ఇదే రాత్రి చేప పిల్ల ఒకటి సముద్రమంత కలను
కళ్ళు మూసి కంటుంది
- బొప్పెన వెంకటేష్
Advertisement