మానని గాయాల్ని
మోస్తున్న మట్టికి
మడమ తిప్పి
మర్ల పడటం నేర్పింది
పసుపు తాడమ్మి
పానం దాటి వెలుతున్న
పైలం పాటకు గొంతెత్తి
యెర్రని రాగాలు
తీయటం నేర్పింది
ముళ్ళను ముద్దాడుతూ
పిల్లతొవ్వలై నడిచిన
పిడికిళ్ళకు రాజమార్గం
వేయటం నేర్పింది
గొంతెండిన దుక్కికి
తడి వాక్యమై అలుగులు
పారటం నేర్పింది
ఏళ్ల పోరాటాల
మసి రాజ్యంలో
ఎన్నీలలై ఎలుగులు
పూయటం నేర్పింది
పేరు దక్కని ఊరుకు
చరిత్రలో కొత్త పేజీలు
రాయటం నేర్పింది
ఆయుధాలు దాచిన
జమ్మి చెట్లకు
గుండెను గుండెతో మిళాయించి అలాయ్ బలాయ్ నేర్పింది
వేలాది మందారాలు రాలిన
ఈ మట్టిలోనే బతుకును కొత్తగా మొలిపించు కోవటం నేర్పింది
పజ్జొన్న కంకి మీద
పాలపిట్టలా వాలి
బతుకు మెతుకు మీది
బాధలు తుడిచి తెలంగాణా అని
పేరు రాసుకుంది
- బొప్పెన వెంకటేష్
Advertisement