నీళ్లు నములుతున్న నాగరికపు
నాసి వీచికలు
ప్రళయావృత మవుతున్నాయి
వర్ణాన్ని వీడనిసొత్తుగా
వక్ర భాష్యాలు వల్లిస్తున్నాయి
వివక్షలు మాదకద్రవ్యాల్లా మూగుతున్నాయి
ఎల్లలు లేకుండా ఎదుగుతూ
మనుషుల మధ్య మాటు వేస్తూ
మనిషితనానికి మానవత్వానికి సరిహద్దు రేఖలు గీస్తున్నాయి !
అండగా నిలవాల్సిన చోట
రంగో రూపో
అడ్దుకట్టలేస్తున్నాయి !
నామోషి పడాల్సిన చోట
తారతమ్యాలను తరాజు వేసి
వేడుక చూస్తుంది
విధ్వంసాలు సృష్టించడం
వర్ణంతో పెట్టిన విద్య
విద్వేషాలు తను విసిరిన ఉచ్చుకి ఉదాహరణ
వేరుపోయటంలో ఏ వివక్షా చూపదు
స్వార్థం చంకలెగిరేసినపుడు
సమగ్రతావనంలో
గంజాయి చల్లుతుంది
కులపు ముళ్ళతో కంచెను
కల్లోలాలను అల్లుతుంది
ఐదేళ్లకోసారి నిష్టగా నీళ్లు పోసి నమ్మిస్తుంది
వేదికలమీది మాటలు
గారడీ కరెన్సీలా మురిపిస్తాయి
ఎండమావితోనూ పోటీపడతాయి
సౌభ్రాతృత్వం ఊతపదంలా ఉటంకిస్తుంది
సామరస్యతను
దూరంగా వెలివేసి
నాగరికతకు
కులపు నలుపు రాసి
నవీనత్వమని తలపోస్తుంది
అనాదిగా అంటరానితనంలో
మాసిన మా కడగొట్టు బట్టల కంటే
ఇస్త్రీ నలగని మీ తెల్లబట్టలే ఇపుడు
ఎక్కువ కంపు కొడుతున్నాయి
హక్కుల అస్త్రంతో అదిలించి
తప్పెట తడి చప్పుళ్ళతో వివక్షను ఎండగట్టిన్నాడే
మళ్లీ ఒక వేకువ వెలుగును చూస్తుంది
భేషజాలెరుగని పొద్దు
అంతా సమంగా నవంగా హత్తుకుంటుంది
- బొప్పన వెంకటేష్