నమ్మబుద్ధి కావడం లేదు
మనిషి లేడని,
మనిషి ఇక రాడని అంటున్నారు
ఉన్నప్పుడు మనిషిని మనిషిలా చూసిన జాడేది లేదు
వచ్చేవాళ్ళు పోయే వాళ్ళ మధ్య మనిషి అసలు ఆశను తవ్వి తడతీసే
వాళ్ళెవరూ లేరు
నమ్మబుద్ధి కావడం లేదు
దూరమున్న వాళ్లంతా దూసుకొచ్చారు
తాకిడి పెరిగేకొద్ది
ఏడుపు రెట్టిస్తున్నారు
ఏడ్చేవాళ్ళు తూడ్చేవాళ్ళ మధ్య అసలు విధి ఎందుకిలా అవతరించిందో
ఒక్కరికైనా తెలిసి ఉండవచ్చు
నమ్మ బుద్ధి కావడం లేదు
మద్యపానం
మౌనంగా గొంతులు జారుతుంటే
ఆడవాళ్ల ఆకలి గురించి
ఎవరూ మాట్లాడటం లేదు
ఉన్నది ఎంత ఊడ్చింది ఎంత లెక్కల్లో
మనిషిని శూన్యంగా మిగిల్చారు
నమ్మబుద్ధి కావడం లేదు
మందు బాబులు చిందే కళను మూసిన కళ్లారా చూసి
టపాసు శబ్దాల హోరును దాటి
దింపుడు కళ్లెంలో దిగాక
తాత చెప్పిన రెండు పిల్లుల కథ మొదలవుతుంది
నమ్మబుద్ధి కావడం లేదు
మంటల్లా వ్యాపిస్తున్న
దుఃఖం ముందు
కడకు మిగిలిన కంకెడు మట్టిని ఎవరి మొహాన కొట్టాలో అర్థo కాదు
చావకముందు నరకాన్ని చూసిన మనిషి గురించి
మీలో ఏ కొందరికైనా
తెలిసి ఉండవచ్చు
- బొప్పన వెంకటేష్