నేను చదివిన పుస్తకం - హాలికుడు (చలమచర్ల రంగాచార్యులు గారి నాటకం ) -రాజేశ్వరి దివాకర్ల (బెంగళూరు)
శిరోమణి చలమచెర్ల రంగాచార్యులు గారు (1912-1972 ) సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు, అధ్యాపకులు, రచయిత. శ్రీ చలమచెర్ల రంగాచార్యులు గారు రచించిన స్వతంత్ర రచనలలో "హాలికుడు"నాటకం ప్రముఖమైనది కవిజీవితాన్ని వస్తువుగా స్వీకరించి వ్రాసిన నాటకాలలోఇది" మొట్టమొదటిది". హాలికుడు ' అను పేరులోనే నాటక ప్రధానలక్ష్యం ధ్వనించింది.
పోతన జీవితాదర్శాలు కవి గారినెంతో ఆకర్షించాయి. అత్యంత నూతనం గా వెలువడిన ఈ నాటక రచనను కావించిన కవి కృషి అనన్యం.
సత్కవుల్ హాలికులైననేమి, కందమూల గౌద్ధాలికులైననేమి అంటూ సగర్వంగా హాలిక వృత్తిని అవలంబించిన కవి- పోతన. ఆయన రచించిన ఆంధ్ర మహాభాగవతం ఎంత ప్రఖ్యాతమో, తన కృతిని భగవంతునికి తప్ప మనుజేశ్వరాధములకు ఇవ్వనని పట్టిన పట్టూ అంతే ప్రసిద్ధం.
హైదరాబాదు నగరంలోని శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం వారు 'పోతన సప్తాహము 'సందర్భంగా ప్రదర్శించడానికి మిత్రులు అడిగినపుడు, కవి గారు ఈ నాటకాన్ని రచించారు. ఇది రెడ్డి విద్యార్థి వసతిగృహంలో ప్రదర్శించారు. దానిని చూచిన శ్రీ చెన్నకేశవుల హనుమంతరావు నాయుడు గారు స్వయంప్రేరితులై నాటకాన్ని ముద్రించడానికి ఉత్సాహాన్ని చూపారు.
హనుమంత రావు గారు శ్రీ చెళ్ళ పిళ్ళ వెంకటశాస్త్రి గారి దగ్గర ఉన్నత పాఠ శాలలో తెలుగును చడువు కోడమే వారి తెలుగు సాహిత్యాభిమానానికి కారణం. కవి ఈ గ్రంథాన్ని స్వతంత్రులై సత్సంకల్పం కోసం తమ సర్వస్వాన్ని సమర్పించే సాహసం గల సరసమైన కవులకు అంకితం చేశారు.
ఈ నాటకం అయిదు అంకాలను కలిగింది. శాంత రస ప్రధానమైన ఈ నాటకం పోతన మహాకవి వ్యక్తిత్వానికి ఘన నీరాజనమిచ్చింది.
నాందీ పద్యం లోనే "రాజస భావముం దొరగి , రమ్య గుణ ప్రకర ప్రకర ప్రసూనముల్ - పూజలు సేసి, మంజు కృతి పుంజము నంజలు లొగ్గి భక్తి నీ - రాజన రాజి రోచుల విరాజిలు భక్తుల బ్రోచుకల్ప భూ- మీజము దివ్య తేజ మది మీ కొన గూర్చుత ! సర్వ సంపదల్" అంటూ కావ్యార్థ సూచనను కావించారు. నటీ సూత్రధారుల సంభాషణలో తమ నాటకం ఆధునికమని (అర్వాచీనమని) ప్రకటించారు.
అసూయా పరులైన వారు సజ్జనులకు కావించిన ఆటంకాలు, వారి సత్ప్రవర్తన ఈర్ష్యా పరులైన వారిలో కలిగించిన పరివర్తనలను ప్రథానాంశాలుగా బోధించిన ఈ నాటకం నిరామయమైన హృదయోల్లాసానికి రూప కల్పన కావించింది.
నాటకారంభం లో సింగ భూపాలుని కవితా సంగీత గోష్టులలో ఆనాటి తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను కన్నులకు కట్టినట్లుగా చిత్రించారు. ఆరంభం లోనే పోతన జీవిత లక్ష్యానికి బీజా వాపన చేసారు. పోతన రస కవితా ఝురి భోగినీ దండకం వలన కొంత వ్యత్యస్తమైంది. మహాభాగవత మార్గం లో సముద్రమై ప్రవహించింది. శ్రీనాథుడు నరాంకితమిమ్మని ప్రోత్సహించాడు. సింగభూపాలుడు, పేరావధానులు, అడ్డంకులు కలిగించారు. కాని శ్రీ రామానుగ్రహము, చిదానంద యోగి ఉపదేశము తోడ్పడ్డాయి. పరస్పర విరుద్ధాలుగా శృంగార శాంత రసాలకు, ప్రతినిథులైన శ్రీనాథ పోతనల వ్యక్తిత్వాలను నిరూపించడం లో కవి కృత కృత్యు లయ్యారు. వారిరువురి బాంధవ్యాన్నీ, చిన్న నాటి నుంచీ కలిగిన మైత్రిని నిరూపించారు.
పోతన శ్రీనాథులు లో కలమే హలం గా ఆంధ్ర సాహితీ క్షేత్రాన మధుర ఫలములను పండించిన పోతన జీవన భూమికకు "హాలికుడు" నాటక నామం సార్థక మయింది. శ్రీనాథ పోతనలకు గాను నాటక కర్త రచించిన పద్యాలు స్వయంగా ఆ మహా కవులు పలికినట్లుగనే శోభించాయి. నాటకం లోని సంభాషణలు ఆయా పాత్రల చిత్త వృత్తులకు రూపుదిద్దాయి.
ఈ రచన చదివితే పోతనను గూర్చిన సర్వ కథలూ కరతలామలకాలవు తాయని. శ్రీ విశ్వనాథ వారన్నారు ఒక మహా కవి జీవిత పరమార్థములను ఆంధ్ర వాజ్ఞ్మయమునందు ప్రదర్శించిన ఈ కవికి అభినందనలన్నారు రాయ ప్రోలు సుబ్బా రావు గారు.
ఈ నాటకం 1940 సంవత్సరంలో మొదటి ముద్రణ , 1946 లో రెండవసారి ముద్రణలను పొందింది.
మద్రాసు విశ్వ విద్యాలయం వారి విద్వాన్ పరీక్షకు, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వారి ఇంటర్మీడియెట్ పరీక్షకు పాఠ్య గ్రంథంగా నిర్ణయించబడిన హాలికుడు నాటకం ఉత్తమ కావ్య సంకల్ప సిద్ధిని సాధించింది.
శ్రీ చలమచెర్ల రంగాచార్యులు గారు సికింద్రాబాదులోని మహబూబు కళాశాలలోను, , నారాయణ గూడా బాలికోన్నత పాఠశాలలోను అధ్యాపకులుగా పనిచేశారు. తరువాత ఉస్మానియా విశ్వ విద్యాలయం గ్రంథాలయంలొ తాళపత్రగ్రంథాలను సంపాదించే ఉద్యోగిగా చేరారు. ఐదేళ్ల తర్వాత అక్కడే పండిత పదవిలో నియమితులయ్యారు. 1957లోఅక్కడి ఆర్ట్స్ కళాశాలలో ఉపన్యాసకులుగా చేరి, అక్కడే ఉద్యోగ విరమణ చేసారు.
వారు అలంకార, వ్యకరణ శాస్త్రాలలోపండితులు .ఆంధ్ర శబ్ద రత్నాకరము అనే నిఘంటువును ఒక వినూత్న పద్ధతిలో రచించారు.