ప్రముఖ తెలుగు కథకులు కీ.శే.బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు గారు విజయనగరానికి చెందినవారు, మద్రాస్ లో సోవియట్ యూనియన్ తెలుగు విభాగంలోపనిచేసారు .
నయాగరా కవుల్లో ఒకరయిన ఏల్చూరిసుబ్రహ్మణ్యం ,రచయిత శెట్టి ఈశ్వరరావు వారి సహోద్యోగ మిత్రులు .
కథా రచనలో తమదైన విన్నాణాన్ని సంతరించుకున్న సూర్యారావు గారు భారతి ,ఆనందవాణి ,తరుణ, విశాలాంధ్ర ,అభ్యుదయ , రూపవాణి ,యువ ,జయంతి, అనామిక ,పెంకిపిల్ల ,జ్యోతి , కథాంజలి ,ఆంధ్రపత్రిక , ఆంధ్రజ్యోతి వంటి వివిధ పత్రికలలో కథలు రాశారు.
'కలలు కథలు','సువర్ణ రేఖలు'అనే'పేరిట రెండుకథాసంపుటులు వెలువరించారు.
వీరి కథల్లో'దొంగలున్నారు జాగ్రత్త' కథకు 1954 లో అఖిల భారత స్థాయిలో రెండవ బహుమతి లభించింది. ఆ ఏడే ప్రపంచ కథానికల పోటీకి కూడా ఈ కథ వెళ్లింది. ఈ కథలో కనిపించే దొంగ, కనిపించని దొంగ ఇద్దరినీ ఒక చోట చేర్చి వారి మనస్తత్వాలను రచయిత విశ్లేషించారు.
ఈ ఆగస్టు 25 బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు గారి 33 వ వర్థంతి .వారి స్మరణలో
సాధారణంగా మా కుటుంబాల్లో బొమ్మిరెడ్డిపల్లి బ్రదర్స్ అంటే, వారు అపర మేధావులు అయినప్పటి కీ వారు చాలా అమాయకులని అతి మంచితనానికి మారు పేరైన వారని,శాంత స్వభావులని, చీమకు కూడా హాని తలపెట్టలేని సున్నిత మనస్కులని, మొత్తానికి "సాత్వికులు అని పేరెన్నిక గల వారిగా విరాజిల్లుతూ
ఉండేవారు.
ఋషీశ్వరుల మాతృ భాష అయిన మౌనమే తమ ఆయుధం, మౌనమే తమ ఆభరణంగా సుతి మెత్తని మనస్తత్వాలతో ఉండేవారని అనుటలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
కానీ అన్నదమ్ములలో మూడవ వారైన శ్రీ బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు గారు మాత్రము ఈ క్వాలిటీలే ఉన్నప్పటికీ అందరి లోకి కాస్త భిన్నంగా ఉండేవారు. ఆయనే స్వయంగా మా చిన్నాన్న గారు.
చురుకుదనం, హాస్య చతురత, రచనలు చేయడం, నాటకాలువ్రాయడం, రేడియో కార్యక్రమాల్లో పాల్గొనడం, చదరంగం ఆడటం, ఇలా అన్నిటిలో ఆల్ రౌండర్.
స్వగ్రామం విజయనగరం అయినప్పటికీ, ఉద్యోగ రీత్యా ఢిల్లీ లో కొన్నాళ్ళు,తర్వాత మద్రాసు కు మకాం మారారు. తర్వాత జీవిత కాలం అంతా మద్రాసు లోనే..
ఢిల్లీ లో రష్యన్ ఎంబస్సి లో పని చేస్తున్న రోజుల్లోనే అక్కడి తెలుగు రచయితల పరిచయాలతో , అక్కడి కార్యక్రమాలతో ఆయన వ్యక్తిత్వం మరింత ఇనుమడించింది. నూతనోత్సాహం తో తన పరిధి మరింత విస్తృతమయింది. గొల్లపూడి మారుతీరావు,శెట్టి ఈశ్వరరావు మొ॥ వారి పేర్లు వినబడుతుండేవి. రచయితలలోబుచ్చిబాబు
తనకి అత్యంత సన్నిహితుడని కూడా అర్ధమయింది.
మా చిన్నాన్న సూర్యారావు గారు L.L.B చదివారు గాని కోర్టు వైపు వెళ్ళలేదు.
రచయితలలో అందగాళ్లు తక్కువ అని, బహు కొద్దిమంది పేర్లు పలువురు ప్రస్తావించేవారు.
ఉదాహరణకు -రావి శాస్త్రి, దేవరకొండ బాల గంగాధర తిలక్, గుంటూరు శేషేంద్ర శర్మ యిలా...
అలాగే-మా చిన్నాన్న సూర్యారావు గారు కూడా అందమైనవారు, స్ఫురద్రూపి.
బయటికి చాలా మృదు స్వభావిగా కొంచెం గంభీరంగా కనిపించినప్పటికీ,అయన
రచనల్లో తెలుస్తుంది ఆయన అంతరంగం ఎంత విశాలమైనదో. ఆయన కథల్లో హాస్యచతురత, మనసు ద్రవింప చేసే ఆర్ద్రత , మంచికి ,మానవత్వం కి విలువనిచ్ఛేస్వభావాలచిత్రీకరణ, సమాజంలో నిత్యం అతి దగ్గరగా కనిపించే వ్యక్తిత్వాలు,బడుగు వర్గాల
ప్రజల అగచాట్లు, కళ్ళకు కట్టినట్లు కన్పిస్తాయి. బడుగు వర్గాల అగచాట్లని బియ్యపుగింజలు కథలో కళ్ళకు కట్టినట్లు రచించి చూపించారు..
' మాస్కో నగరమంతా మంచు దుప్పటి కప్పుకొన్నట్టుంది ” అనే వాక్య ప్రయోగం ఆ రోజుల్లో ఎంత బావుందని? మంచు కింద మాస్కో నగరం కళ్ళకు కనబడుతూ .ఆ తర్వాత కాశ్మీరు, ఊటీల గురించి ఆ విధంగా వ్రాశారు మరి కొంతమంది .
చిన్నాన్న రష్యా పర్యటన చేసి వచ్చి తన అనుభవాలన్నిటినీ క్రోడీకరిస్తూ వ్రాసిన
వాటిలో మొదటి వాక్యం అది.
శ్రీ ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన చిత్రం తేనెమనసులు సినిమా అంటేనాకు చాలా ఇష్టం. ఎందు వలన అంటే చిన్నాన్న విశాఖ వచ్చినప్పుడు మా పిల్లలందరినీ ఆ సినిమాకి తీసుకెళ్లారు. అదొక మధుర జ్ఞాపకం.
చాలా చిన్న వయసులోకూడా ఆ సినిమాలో ఉండే నీతి ఇప్పటికి మా మైండ్ లో చురుగ్గా ఉంది స్థిరనివాసమేర్పరచుకుని.
మద్రాసు వెళ్ళినప్పుడు పాండీ బజారుకు తీసుకు వెళ్లి అందరిని ఎవరికి ఏది కావాలో అది కొనుక్కోమని షాపింగ్ చేయించారు. ఇంట్లో తనతో జరిపే
సంభాషణలన్నీ హాస్యపు జల్లులు. నవ్వులే నవ్వులు. నవ్వుల జల్లులు. అవన్నీ స్మృతిపథం లో పదిలంగా ఉన్నాయి.
ప్రసిద్ధిగాంచిన వయొలిన్ విద్వాంసులు శ్రీ మారెళ్ల కేశవరావు గారు ఆయనకి
స్వయానా బావ మరిది. ఆయన చెల్లెలు, మా పిన్ని శ్రీమతి కృష్ణవేణి కూడా సంగీతవిద్వాంసురాలే.
మేమిద్దరం కలసినప్పుడు హంసధ్వని వర్ణం, జలజాక్షి, వినాయకునిమీద దీక్షితార్ కీర్తన చాలా సార్లు పాడుకొనేవారం.
"ఇష్టంగా నేను చేసిన కూరలు ఈ మధ్య మీ చిన్నాన్న మెచ్చుకోవడంలేదే, ఈ రోజు నువ్వు చేసావని చెప్పి పంపిస్తాను" అని నా చేత ఆనపకాయ తరగడం మాత్రమే చేయించి ,మిగతా ఆవ కూరంతా తానే చేసి ఆయనకు క్యారేజీ పంపించింది. నిజంగానే క్యారేజీ ఖాళీఅయిందండోయ్. !
చిన్నాన్న పిన్నిలతో సింహాచలం వెళ్లి రోజంతా అక్కడ గడపడం కూడా ఒక చక్కటి జ్ఞాపకం.
చిన్నాన్న పుంఖానుపుంఖాలుగా రచనలు చేయలేదు. మహా రచయితల జాబితాలోకి చేరిపోలేదు. అయన తను ఒక మంచి రచయిత. గొప్ప రచయిత .
అంతకన్నా ఒక విశిష్ట వ్యక్తి.
ఆయన ప్రవాసాంధ్రుడవడం వలన విస్తృత జనాదరణ లేక పోవచ్చు గాని అయన పాఠకజనాలకు మాత్రం ఒక ప్రసిద్ద రచయిత.
తన short stories అన్నీ కథా వాహినిగా రెండు సంకలనాలు మాత్రం వెలువడ్డాయి .1952 లో ప్రపంచ కథానికల పోటీలో తన దొంగలున్నారు జాగ్రత్త కథకు అఖిల భారత స్థాయి లో రెండవ బహుమతి లభించింది. కలలు - కథలు,సువర్ణ రేఖలు అనే కథా సంపుటాలు ప్రచురింప బడ్డాయి. అడవి మల్లెలు అనే కథప్రగతి ప్రచురణాలయం, మాస్కో వారి తెలుగు రచయితల కథా సంకలనంలోఅచ్చయింది. చిల్లు కంబళి అనే కథ నేషనల్ బుక్ ట్రస్టు వారి కథా భారతి లోప్రచురితమైంది.
1961 లో సాహిత్య అకాడమీ వారు WHO IS WHO OF INDIAN WRITERS_ పేరిట చిన్నాన్నను పాఠక లోకానికి పరిచయం చేయడం గర్వ కారణం.
ఆయన కథ పొగచూరిన గోడలు, సాహిత్య సేవా సమితి ట్రస్ట్, విశాఖపట్నం వారుసుప్రసిద్ధ రచయితల కథానికలు సంకలనం కథామంజరిలో ప్రచురించారు.
చిన్నాన్న రష్యన్ భాష బాగా నేర్చిన వారు. ఆంటన్ చెకోవ్ చెర్రీ ఆర్బర్డ్స్ నాటకాన్ని సంపంగి తోట పేరుతో అనువాదం చేశారు. చెకోవ్, పుష్కిన్, టాల్ స్టాయ్,దాస్తా విస్కీ, వంటి విశ్వ విఖ్యాత రచయితల నవలలూ, కథలూ, నాటకాలూ ఎన్నోతన అభిమాన విషయాలుగా చదివారు. వాటిలో కొన్ని తెలుగులోకి అనువదించారు.
చిన్నాన్న లేని లోటు మా కుటుంబానికి ఎప్పటికీ తీరని లోటు.ఈ విధంగా మా చిన్నాన్న బొమ్మిరెడ్డి పల్లి సూర్యారావు గారి గురించి నాలుగు ముక్కలు జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం కల్పించిన తెలుగు గ్లోబల్ డాట్ కామ్ వారికి ధన్యవాదాలు
ఉషాకిరణ్
(దయాల్బాగ్ ,ఆగ్రా )