గాలి బుడగ రా ఈ జీవితం
తెలుసుకోరా ఈ జీవిత మర్మం
ఏడుస్తూ పుడుతూ ఏడిపించి వెళ్ళేదే దేవుడిచ్చిన జీవితం
ఈ రెండు ఏడుపుల మధ్యదే
నీ కోసం నీదనే జీవితం
ఇంతేరా .... జీవితం
ఈ మాత్రం దానికి
ఎందుకురా సంబురం
నవ్వుతూ , నవ్విస్తూ బ్రతికేయ్ జీవితాంతం
" బ్రహ్మచర్యం "
అంతా మధుర స్మృతుల హరివిల్లు
" గృహస్థ " వ్యవస్థ
అంతా కుటుంబంతో
సంతోషాల పొదరిల్లు
"వానప్రస్థం" అంతా
బాల్య గృహస్థల తీపిగురుతుల నెమరువేతలు
"సన్యాసం" అంతా పరమాత్మ
పిలుపు కోసం ఎదురు చూపులు
ఇంతేరా .... జీవితం ,
ఈ మాత్రం దానికి
ఎందుకురా సంబురం
నవ్వుతూ , నవ్విస్తూ బ్రతికేయ్ జీవితాంతం
రోజూ ఏదో... ఇంకేదో సాధించాలని ఉరుకులు పరుగులు
దానికోసం నిత్యం అలుపెరగని పోరాటాలు , ఆయాసాలు
మనిషిగా మానవత్వం లేని మృగానికన్నా హేయమైన పనులు
చివరి రోజుకు వట్టి చేతుల తిరుగు ప్రయాణాలు
ఇంతేరా .... జీవితం ,
ఈ మాత్రం దానికి
ఎందుకురా సంబురం
నవ్వుతూ , నవ్విస్తూ బ్రతికేయ్ జీవితాంతం
గాలి బుడగ లాంటి జీవితం కోసం
జీవమే లేని మర యంత్రంగా మారి
బంధాలు , అనుబంధాలు , బంధుత్వాలు మరచి
విలువలు లేని మనిషిగా మారి
ఆనందం , ఆత్మీయతలకు అర్ధమే తెలియకుండా
చిరు గాలి సవ్వడికి ఆవిరై పోయేదేరా
ఈ జీవితం
ఇంతేరా .... జీవితం ,
ఈ మాత్రం దానికి ఎందుకురా సంబురం
నవ్వుతూ , నవ్విస్తూ బ్రతికేయ్ జీవితాంతం
ఎవరు నీ తలరాతను రాసేది...
ఎవరు నీకు మార్గం చూపేది....
దివ్యత్తాన్ని నమ్ముతూ ...
రాసుకో నీ రాతను
జీవిస్తూ మరణించకు
నీకంటూ , నీదంటూ
చివరిగా నీకు మిగిలేది
కాదు..... నువ్వు బ్రతికిన సంవత్సరాలది
అవును ..... ఆస్వాదించిన
మధుర అనుభవాలది....
ఇంతేరా .... జీవితం.....!!
- భీమా శ్రీనివాసరావు