భావన: భక్తి జ్ఞాన వైరాగ్య ప్రదాయి గీత

Advertisement
Update:2023-11-22 13:05 IST

యథార్ధమైన భక్తి ఏమిటో, జ్ఞానాన్ని యోగంగా ఎలా మార్చుకోవాలో, వైరాగ్య భావన ఎలా ఏర్పరుచుకోవాలో తెలియజేసింది భగవద్గీత

భక్తి :

యో మద్భక్తః స మే ప్రియః ।

ఎవరు నా భక్తుడో అతడు నాకు ఇష్టుడు అన్నాడు కృష్ణుడు .భక్తుడికి ఉండవలసిన 35 లక్షణాలు భక్తి యోగంలో తెలుపబడ్డాయి. ద్వేషం లేకపోవుట, మైత్రి, కరుణ, నిర్మమకారం, నిరహంకారం, సుఖ దుఃఖ సమభావం, ఓర్పు, సంతృప్తి, అనపేక్ష, భగవదర్పిత బుద్ధి, బాహ్యాంతర శుద్ధి మొదలైనవి భక్తుని లక్షణాలు.

భగవంతుని యందు ప్రీతి కలిగి ఉండుటయే భక్తి. అన్య (ఇతర) భావం లేకపోవుట - అనగా భగవానుని పట్ల తప్ప ఇతర విషయాల పట్ల చిత్తం లగ్నం కాకపోవటమే అనన్య భక్తి. అది కలిగిన వారి యోగక్షేమాలను నేనే వహిస్తాను (యోగక్షేమం వహామ్యహమ్‌) అని భగవాన్‌ ఉవాచ.

శ్రీమహాభాగవతంలో మొసలి బారిని పడిన గజేంద్రుడు శక్తిహీనుడై, ‘నీవే తప్ప నితఃపరంబెరుగ, మన్నింపం దగున్‌ దీనునిన్‌’ అని భగవానుని ప్రార్థించాడు. భగవత్‌ కృపతో క్షేమంగా బయటపడ్డాడు.

విభక్తి కానిది భక్తి. అనగా విభజన లేనిది. భగవత్‌ స్వరూపం నుండి విడివడకుండా దానియందే మనసు లగ్నం చేయటమే భక్తి. భక్తితో పత్రం, పుష్పం, ఫలం, తోయం - ఏది సమర్పించినా ప్రీతితో ఆరగిస్తానని పరమాత్మ రాజవిద్యా రాజగుహ్య యోగంలో చెప్పారు.  ఆ నాలుగు ఏవో కాదు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇవి అంతఃకరణ చతుష్టయం. ఈ నాలుగు ఆయనకు అర్పించాలి. మనస్సు ఆలోచన, విశ్లేషణ చేస్తుంది. బుద్ధి నిశ్చయం చేస్తుంది. చిత్తం ఒకదానినుండి మరొక దానికి చలిస్తుంటుంది. అహంకారం ‘నేను’ అనే దేహభావనతో కూడి     ఉంటుంది. ఈ నాలుగు శుద్ధి చేసుకొన్నట్లయితే అప్పుడు చక్కగా ఆత్మజ్ఞానం పొందగలము.

జ్ఞానము :

శ్రీమద్భగవద్గీత జ్ఞానయోగంలో జ్ఞాన తపస్సు గూర్చి చెప్పబడిరది.

రాగం గాని, భయం గాని, క్రోధం గాని లేకపోవుట, భగవన్మయుడై ఉండుట, భగవంతుని ఆశ్రయించుట ` ఇదంతా జ్ఞాన తపస్సు. దీని వలన చిత్తశుద్ధి, పరమాత్మ స్వరూప ప్రాప్తి కలుగుతాయి. మనో నిగ్రహం ఏర్పడుతుంది. తత్త్వ విచారణ, ఆత్మానాత్మ వివేకం, ఇంద్రియ నిగ్రహం, దృక్‌ దృశ్య వివేచన, శ్రవణ మనన నిదిధ్యాసనలు, వాసనాక్షయం మొదలైనవి జ్ఞానయజ్ఞం అవుతాయి.

అందుకే

నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే ।

అని పేర్కొంది గీత

జ్ఞానంతో సమానమైనది, పవిత్రమైనది లోకంలో లేదు.

వైరాగ్యము :

రాగం లేకపోవటమే వైరాగ్యం. లోకంలో మనకు సంబంధించిన వ్యక్తులు గాని, వస్తువులు గాని, విషయాలు గాని మనం కోరుకున్నట్లుగా, మనకిష్టమైనట్లుగా ఉండాలనుకొంటాం. అదే రాగం. అవి అట్లా ఉండకపోతే విచారిస్తాం. ప్రేమాతిశయమే రాగం. రాగమే దుఃఖానికి మూల కారణం. రాగం వదిలిపెట్టటమే వైరాగ్యం. విరాగునికి దుఃఖం ఉండదు. అన్నిటి పట్లా సమదృష్టి ఉంటుంది.

ఈ విధంగా భక్తి జ్ఞాన వైరాగ్యాలను భగవద్గీత స్తూలంగా విశదపరిచింది.

Tags:    
Advertisement

Similar News