నా కధ ,
అక్షరాలను తనలో నిక్షిప్తం చేసుకుంది.
కలాన్ని చేతబట్టి,
పాళీకి ప్రాణం పోసి,
చైతన్యమనే సిరా నింపుకుంది .
అంతే...
ఊహలనే ఊపిరొచ్చిపడి ,
అక్షరాలకు రెక్కలు మొలిచి, ...
భావాలు స్వైరవిహారం చేసాయంది.
నాకధ,
రాయిలాంటి మనసులలో రాగాలాలపించానంది .
మానులాంటి బ్రతుకులను ,
మల్లెతీగలా గుబాళింప జేసానంది.
కరడుగట్టిన గుండెలను
కరవాలంలా పొడిచేస్తానంది.
అందరి బాగోగులు
తనవిగా చేసుకొని,
సమాజం లోని నిజాలను,
నిర్భయంగా చెప్పేస్తానంది.
నాకధ-
కన్నీళ్ళకు చన్నీళ్ళలాంటి ఓదార్పునిచ్చానంది.
మారణహోమాలను సైతం మంటకలుపుతానంటూ..
రాతలచేతలతో రెచ్చిపోయింది.
నాకధకో తలరాత వుందనీ....
ఆ రాతకో
పెద్ద చరిత్రే వుందని,
మహారాజులు సైతం,
మనసు పారేసుకున్నారని,
ఢంకామ్రోగించి మరీ వినిపించింది.
అంతేనా..!
చదువంది,విజ్ఞానఖనినంది.
గీతాచార్యుల,
గీతాసారాంశమే తానంటూ
గీతగీసి మరీ బోధించింది.
ఎంత ఎదిగినా ఒదిగి వుండడమే
తన సిద్దాంతమని
వినయంగా వివరించింది.
నాకధ,
తన కలంలోని బలం,
జనమేనంటూ
తనది కవికులమంటూ..
కావ్యంగా మీ ముందుకొస్తానంటూ కాలుదువ్వుతోంది.
ఒక్కమాటలో చెప్పాలంటే ...
అందమైన ఆడపిల్ల మదిలో , ముస్తాబైన చిలిపి ఊసునంది.
వడ్డాది వారి పసిడి బొమ్మ బాసనంది.
ప్రేయసీ ప్రియుల
ప్రణయగీతికనూ.. తానేనంది.
పసిపాప బోసినవ్వులు,
అల్లరి కేరింతలు,
గంతులేస్తున్న లేగదూడల
కాలిమువ్వల సందడీ...
నేనేసుమా అంటూ...,
ఇంకా చందమామనంది,
చల్లగాలినంది.
చెట్టంది,పుట్టంది,గోదారంది .
కోయిలపాటంది,
నెమలి నాట్యమంది పువ్వులు,తేనెలు ,ఒకటేవిటి
సంక్రాంతి గొబ్బెమ్మ ,
దసరాల సంబరం,
దీపావళి టపాకాయ
నేనేనంటూ
మామిడితోరణాలు కట్టీ..
ఆనందంతో పండుగ చేసేసుకుంది .
అసలు సంస్క్రతి ...
సంప్రదాయాలకు ,
అచ్చతెలుగుతనానికి,
చిరునామా తానేనని,
విర్రవీగి పోయింది.
అదికాదు, ఇదికాదు,
సర్వం నేనేనని,
ఇంత బడాయి కబుర్లు చెప్పిన
నా కధ,
అంతటితో ఆగక,
చిట్టచివర జీర్ణావస్థలో కూడా...
రంగడి, కిరాణా కొట్టులో చేరి,
చిన్నపిల్లల కోసం,
తియ్యని మిఠాయి చుట్టిన
కాగితం పొట్లమైపోయింది .!!
- భారతీకృష్ణ