తెల్లవారగానే .పాలవాడు కాలింగ్ బెల్ కొడతాడు . అప్పటికింకా ఎవరు లేవరు..సరే..పాలప్యాకెట్లు తెచ్చికిచెన్ లో పెడతాను .ఆకలేస్తూ వుంటుంది ఎవరైనా లేచారేమోనని ఓసారి ఇల్లంతాకలయతిరుగుతాను.మనవరాలు చిన్ని లేస్తుంది .
బ్రష్ చేసి, నా దగ్గర కొచ్చి
"పెద్దాయనా ..పద వాకింగ్ కి వెళ్దామంటూ"నా అనుమతి తో పనిలేదు ..తీసుకుపోతుంది .
తిరిగొచ్చాక ఆకలేస్తూవుంటుంది ..కాసిని పాలిస్తుందేమో ..అంటే ఇవ్వదు ..నన్ను పడకకుర్చీలో కూర్చోమని,తాను ఆఫీసు కెళ్ళడానికి రెడీ అవుతుంటుంది.
ఈ లోపులో కోడలు సుధ లేస్తుంది .అందరికీ టిఫిన్ బాక్సులు సిద్ధం చేసి ,డైనింగ్ టేబుల్ పై పెడుతుంది .
అబ్బాయి మోహన్,మనవడు సిధ్ధు..చిన్నీ తయారై వచ్చీ...ఆదరా బాదరాగా కాస్త తినేసి ..టిఫిన్ డబ్బాలు పట్టుకొని,నాకూ సుధకూ టాటాలు,బైబైలుచెప్పేసివెళ్ళిపోతారు .
ఆకలేస్తూవుంటుంది నాకు .ఇంతలో పేపరు వస్తుంది .తెచ్చి టీపాయ్ పైన పెడతాను .సుధ లోపలనుండి నాకు పాలూ ,రెండు రస్కులూ ఇచ్చి ..తాను వేడిగా కాఫీ తెచ్చుకొని,టి.వీ.ఆన్ చేసుకొని,పేపరు ముందేసుకొని,కాఫీ తాగుతుంటుంది..
ఇంతలో పనమ్మాయి వస్తుంది ..దీనికి సోదెక్కువ ,పనితక్కువ ..
అందరింట్లోవార్తలన్నీ ..సుధకుచేరవేస్తుంది .చెప్పొద్దూ ..ఈ కబుర్లు నాకూఅలవాటయ్యాయి .టీవీ చూస్తూనే ..వింటూ వుంటాను ..
ఆ తర్వాత ..నా స్నానంఅవుతుంది ...
సుధ స్నానంచేసొచ్చి,కుక్కర్ పెడుతుంది . లక్షణంగా చీర కట్టుకొని దేవుడికి దీపం పెడుతుందా ...ఊహు ..మళ్ళీ నైటీతొడిగేసుకొని ,కూరలు తెచ్చి టీపాయ్ పైన పెట్టుకొని తరుగుతూనే.. చెవి కిందఫోన్ పెట్టుకొని ఫ్రెండ్ గీతతో మాట్లాడుతూ వుంటుంది ....
ఈ గీత రాతేవిటో తెలియదు కానీ ...అత్తగారన్నా...
మావగారన్నా ఆస్సలు పడదు ..మొగుడు తప్ప ,ఎవ్వరూ తనతో వుండడం ఇష్టం వుండదు దానికి ..తెల్లారి లేస్తే వాళ్ళనాడిపోసుకుంటూనే వుంటుంది .గంటకుపైగా ఈ పనికిమాలిన నేరాలు వింటూ వంటయిందనిపిస్తుంది సుధ.ఈ ఫోన్లు తగ్గించమని చెప్దామను కుంటాను కానీ చెప్పలేను.
నాకు ఆకలేస్తూవుంటుంది .
నా కుర్చీ ..ముందున్న బాల్కనీలో వేసి,నేనున్నానన్న ధైర్యంతో తలుపు దగ్గరకు వేసి,కూరలు తెస్తానని చెప్పి బజారుకెళ్తుందిసుధ. ఎదురుగా వున్న పోర్షన్ లో ..అన్నపూర్ణమ్మ గారు .. .గుమ్మంలో కూర్చొని,దేవుడు శ్లోకాలన్నీ గట్టిగా చదువుతుంటుంది .
సుధ వచ్చేవరకూ నాకు మంచి కాలక్షేపం అవుతుంది.
...... ...... ........
మధ్యాహ్నం ఒంటి గంటవుతుంది ..నాకో రెండు చపాతీలు,ఓ కప్పుడు పెరుగన్నం పెట్టేసి,తాను కూడా భోంచేసి , హాల్లోనే సోఫాలో వాలిపోయి,టీవీలో సీరియల్స్ పెడుతుంది .నాకు వయసైపోతోంది కానీ..వీటికి మాత్రం చివరి భాగమే లేదు.కొన్నేళ్ళుగా కొన సాగుతూనే వున్నాయి ..చేసే పనేంవుంది ..నాకూ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది .పిల్లలు ,
అబ్బాయి ఫోన్ చేస్తే, సుధ మధ్యలో మాట్లాడుతూ చూస్తుందేమోకానీ ..నేను మాత్రం కళ్ళు ,ఒళ్ళూ అప్పగించి మరీ ఒకదాని వెంట ఒకటి ఈ సీరియల్స్ అన్నీ చూసేస్తాను .
..... ...... ...... ........
సాయంత్రం , నాకో రెండు బిస్కెట్లు, గ్లాసుడు పాలిచ్చి, యూట్యూబ్ లో కొత్త స్నాక్స్ చూసి ,చక్కగా చేసుకుని తినేసి , "పెద్దాయనా పద వాకింగ్ కి వెళ్దామంటూ" తీసుకుపోతుంది.
...... ....... ..... ..... ....
రాత్రి ఎనిమది దాటకుండా అందరూ ఇంటికి చేరుకుంటారు.చిన్నీ నా దగ్గర చేరి ,"మార్నింగ్ నుండి ఏం చేసావు పెద్దాయనా "అంటూ ప్రేమగా పలకరిస్తుంది.డిన్నర్ చేసేసి,నాకు రెండు చపాతీలు మాత్రం ఇచ్చి...చిన్ని ,సిధ్ధూ టీవీ కి అతుక్కుపోతారు. రాత్రి పన్నెండు వరకూ చూస్తూనే వుంటారు .వద్దని చెప్దామను కుంటాను ..చెప్పలేను.
"సుధా ..తొమ్మిది దాటింది వాళ్ళిద్దరినీ టీవీ కట్టేసి పడుకోమను.." కేకలేస్తున్న అబ్బాయి మాట లెక్కచెయ్యరు వాళ్ళు.పైగా టివి చూస్తూనే ఫోన్లు కూడా మాట్లాడుతూనే వుంటారు.ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది .తమ్ముడు వచ్చాడంటూ సుధ తలుపు తీస్తుంది.
లోపలికి వస్తూనే నన్ను చూసి మొహం మాడ్చుకొని, ఓ..కంగారు పడిపోతూ
.."అక్కయ్యా .లోపలకు తీసుకెళ్ళు ..తీసుకెళ్ళక్కయ్యా"
అక్కయ్యా ..."అంటూ గొడవ చేస్తాడు.
ఆ మాటంటే నాకు ఒళ్ళు మండిపోయి,అపార్ట్ మెంట్ అదిరిపోయేలా నోరెట్టుకొని,అరిచేస్తాను.
ఇంట్లో అందరూ నన్ను పెద్దాయనా అనిపిలుస్తోంటే .. వీడు మాత్రం,నన్ను వేరే పేరుతో పిలుస్తూ.. రోజూ ఈ టైమ్ కి వచ్చీ నన్నలా దూరంగాపొమ్మనడం ..
గోలచెయ్యడం నాకు నచ్చదు...సిధ్ధూ వచ్చి నన్ను వెనకవైపు బాల్కనీ లోకి తీసికెళ్ళి 'గొలుసు' తో కట్టేస్తాడు.
ఆ మావయ్యగాడు వెళ్ళేదాకా నన్నిక్కడే వుంచేస్తారు. పదకొండవచ్చు, పన్నిండవచ్చు...చెప్పలేం.
తెల్లారి లేస్తే మళ్ళీ మామూలే .. ఈ ఇంట్లో
ఇదే నా దినచర్య ...ఛీ ఛీ కుక్క బతుకైపోయింది.
హు..!నాకో దినం..
దానికో చర్య ..!!
- భారతీకృష్ణ