అనారతం సాంద్ర మనోవికారః మయూరలాస్యామల చిత్తవృత్తిః
సశీకరాంభః కణమండితశ్చ ప్రభాతి సంపచ్చయముచ్ఛలీంద్రః
దట్టంగా క్రమ్ముకొన్న మనోభావ వికారాలు నెమళ్ళ అందమైన లాస్య నృత్యాన్ని చూసి కొంత ఊరటచెంది స్వస్థతను పొందినట్లుగానూ, సమృద్దిగా మొలచిన పుట్టగొడుగుల మాదిరి నేలపై పడిన నీటి బిందువుల తుంపరలతో వెలుగొందుతూ వర్షఋతువు క్రమంగా వచ్చింది.
ఓగేటి పరీక్షిత్ శర్మగారు రచించిన యశోధర కావ్యంలోని వర్ష ఋతు వర్ణన ఇది. గౌతమ బుద్ధుడు యశోధరను,రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళి పోవడంతో యశోధరతో సమానంగా ఋతువుల కూడా ఘోషిస్తున్నవి . విరహం లోనున్న యశోధర శుద్ధోదన మహారాజుగారి ఓదార్పుతో రోజులు గడుపుతూ వుంటుంది. ఆ సమయంలో ఋతువులన్నీ కూడా ఒకదాని వెనుక ఒకటి గడిచిపోతూ యశోధర దుఃఖం లో తాము కూడా పాలుపంచుకుంటుండగా కాలం సాగుతున్నది, ఋతువులన్నీ ఘోషిస్తున్నాయి అంటూ కవి వర్ణిస్తున్న సందర్భంలోనిదే ఈ వర్ష ఋతు ఘోషణ. వర్షాకాలంలో చెట్లు లతలు అన్నీ కూడా వర్షానికి కడిగినట్టుగా అయ్యి మనోహరంగా కనపడుతున్నాయి, ఆకాశంలో మెరిసిన మెరుపుతీగ దాని వెలుతురులో లోకానికి సన్మార్గం చూపిస్తున్నదా అన్నట్లుగా నల్లని మేఘాలతో వర్షం వేగంగా జీవలోకాన్ని చేరుతూ ఉంటే కప్పలు వేద ఘోష వలె ఘోషిస్తున్నాయిఅంటాడు. భారమైన మనస్సులు వర్షం చూసి నాట్యమాడుతున్న నెమళ్లను చూసి స్వచ్ఛతను,తేలికతనాన్ని పొందుతున్నాయి, వాన తుంపరలతో నీటి బిందువులు నేలపై పడి పుట్టగొడుగుల సంపదలుగా భ్రాంతి కలిగిస్తున్నాయి. అంటే నేల మీద ప్రతి చోట పుట్టగొడుగులు పుడుతున్నాయి. నేల నిలచిన ప్రతీ నీటి చుక్క శిలీంద్రంలాగా మెరుస్తున్నది, వాన తడికి మష్రూమ్స్ పుడుతున్నాయి. అదే విధంగా తామరాకులను చీలుస్తూ, తుమ్మెదల మనోహరమైన ధ్వనితో వానా కాలంలో వికసించే మొగలిపూల సుగంధంతో పతి విరహంలో ఉన్న యశోధర బాధాకరమైన రోజులన్నీ వర్షరూపం దాల్చిందా అన్నట్లు వర్షాకాలం వచ్చింది అని కవి చమత్కరిస్తున్నాడు. యశోదర అనే కావ్యంలో ఆమె దుఃఖమే తన దుఃఖంగా భావిస్తున్నటువంటి ఋతువులన్నీ ఘోషిస్తున్నాయి, వర్షాకాలం బాధాతప్త హృదయాల దుఃఖాలన్నిటినీ కడిగివేసి సహృదయతను చాటుతున్నది అంటూ అద్భుతంగా చమత్కరించారు పరీక్ష శర్మ గారు. ఈ కావ్యానికి వారికి అఖిల భారతీయ కాళిదాసు సన్మానం పురస్కారం కూడా లభించింది.
డా.భండారం వాణి