వాక్యాన్ని అల్లుతుంటే
తీగ మీద నడుస్తున్నట్టుగా వుంది.
భాషా భాగాల మధ్య
సమన్వయం కుదరనప్పుడు
అర్థం ఏ ఆగాధాల్లో
కూలి పోతుందో తెలియదు.
సాంకేతిక సమ్మతి గురించి కాదు మాట్లాడేది
స్పందనల తుఫానులకు మూలమేదో
అవాఙ్మానస గోచర మయ్యింది.
ఒక పదాన్ని ముట్టుకుంటే
ఇది ఇదివరకటి స్పర్శ కాదు.
అర్థం కరిగిపోతూ
అపూర్వ భావమేదో ఉబుకుతూ వుంది.
ఎవరిదన్నా కానీ
ఆర్తితో
సందర్భం మారిపోయింది.
మాటలకు అతీతమైన
ఒక మార్మిక సంక్షోభం తలెత్తింది.
పెంక మీద
రొట్టెను మర్లేసినట్టు
కాలం కాలుతూ
ఆకలి వాసన వేస్తుంది.
దాని పొగల మాధుర్యంలో
పుట్టే జీవాణువుల కదలిక
సృష్టికి నవీన వేదిక.
మళ్లీ వాక్యం దగ్గరి కొస్తే
ఇప్పుడది
గుర్తు పట్ట లేనంత కొత్తగా వుంది.
వ్యాకరణం అప్రధానమై పోయింది.
ఒక అంతర్లీన
అగ్నికణికల సమిష్టి జీర
అశాంతి రూపంలో వ్యాపించింది.
శరీరం తక్కువ దేమీ కాకపోయినా
ఆత్మ వల్లనే
అది జాజ్వల్యామానంగా
వెలుగు లీనుతుంది.