చినుకు చినుకు పడుతోంది
మదిలోన అగ్గి రగిలింది.
తడిసిన దేహంలోన
వేడి ఎలా పుట్టింది.
చల్లదనం లోనూ
వేడి దాగి వుంది.
చీకటి లోనూ వెలుతురు నివసిస్తోంది.
సముద్రం అడుగున
అగ్నిపర్వతం ఉన్నట్టు
బాధలోనూ
ఆనందం దాగి ఉంది
బాధే సౌఖ్యమనే
భావన రానిస్తే
చీకటినే వెలుతురుగా భావిస్తే
పేదరికాన్ని ప్రేమించటం నేర్చుకుంటే
నువ్వు ఓటమిపై
విజయం సాధించినట్టే
నీ బలహీనతనే
బలంగా మార్చుకో
కటిక నేలనే
పరుపులా పరచుకో
నీలి ఆకాశాన్నే
దుప్పటిలా కప్పుకో
బాధల్ని
దిండు కింద దాచినిద్రపో
సుఖదుఃఖాలు ఆటుపోటుల్లాంటివి
అవి వస్తూ పోతూ ఉంటాయి
దుఃఖాల్ని కూడా ఆస్వాదించగలిగితే
అవి విరక్తితో ఆత్మహత్య చేసుకోవా?
ఇంకొకరిలా ఉండాలని
ఆశించకు
ఇంకొకరు నీలా వుండలేరని తెలుసుకో
గతం ఒక శవం
భవిష్యత్తు ఒక స్వప్నం
వర్తమానం మాత్రమే వాస్తవమని తెలుసుకో
-మహబూబ్ బాషా (ఆదోని)
Advertisement