తిరోగమనమేమీ
అవాంఛనీయమైనదేమీ కాదు
కొన్ని సందర్భాలలో...
మనసులోకి మాగన్నుగా దూరిన ఖండీకరణ....
విజయగీతాలు
పాడుతున్న తరుణం నుండి
మనసు కిటికీ కాస్త తెరుచుకొని
మనిషి వాసన పొదివి పట్టుకోవాలన్న
అలోచనా గాలి దూరవచ్చు........
పాయలు పాయలుగా
విడిపోయిన నది
మరలా ఎక్కడో ఒక చోట
తన జలచేతులు కలుపుకోవచ్చు.
సూక్ష్మపు ఊబిలోని వెలితి
తొలచి.... తొలచి.... స్థూలమై వికసించి మురవవచ్చు.
పిట్ట పాటను విసర్జించి
మోడు వారిన చెట్టు
తిరిగి ప్రేమ వసంతాన్ని
కావలించుకోవచ్చు.
మరలా
అమ్మా.. నాన్నా..
అవ్వ... తాత...
అన్నా వదిన....
అందరూ ఉన్న
ఉమ్మడి గడపను
కాళ్ళు ముద్దాడవచ్చు.
- అవ్వారు శ్రీధరబాబు (నెల్లూరు)
Advertisement