ప్రొద్దుటే
పాచి ముఖానికి
అదృశ్య మైన సిగరెట్టు పేకెట్
నషాళానికి నిప్పెడితే...
కోరమీసాలు కోడి పుంజులై
కాలు దువ్వాయి.
అనుమానపు చూపులు
మాటల ఈటెల్ని
నిర్దాక్షిణ్యంగా
వంట గదికి గురి పెట్టాయి.
మాటలు
తుంపర్లు గా మొదలై
వర్షంగా మారి
ఉరుముల్ని పిడుగుల్ని కురిపించాయి
అంత వరకూ
మౌనంగా చూస్తూ భరిస్తున్న
వంటగది లోని గ్యాస్ స్టౌ
ఒక్కసారిగా బగ్గు మంది
వంట పాత్రలు
ఎగిరి పడ్డాయి
గొంతు చించుకున్నాయి
కాఫీ కప్పు లో కారం
దోసెల్లో ఉప్పు
మునిగీతకొట్టాయి.
ఉవ్వెత్తున ఎగసిన
ఘర్షణ
రెండు భాగాలు గా చీలి
చెరో వైపు నిలిచి
కాసేపు
పక్క వాటాలకు వినోదాన్ని పంచాయి
చివరికి అలసిన గొంతులు
రాజీ పడి
ఆ పూట ఆటను డ్రాగా ముగించాయి.
***
మక్కెలు విరగ్గొట్టబడి
చెత్త బుట్ట లో
ఉండ చుట్టుకుపోయిన
సిగరెట్ పేకెట్ మాత్రం
దిగ్భ్రాంతి నుంచి
ఇంకా కొలుకున్నట్లు లేదు
-ఆసు రాజేంద్ర (హైదరాబాద్)