ఉజ్వల’ క్రాంతి (కథ)

Advertisement
Update:2023-11-04 13:27 IST

టి.వి లో , రాజకీయాల గురించి రసవత్తర చర్చ జరుగుతుంటే ,ఆసక్తిగా చూస్తున్న నాకు ,నా స్నేహితుడు ' శ్రీధర్ ' ఫోను చిరాకు తెప్పించింది.

సామాన్యంగా నా గురించి బాగా తెలిసిన స్నేహితులు ఎవరు, ఈ సమయంలో , నన్ను ‘డిస్టర్బ్’ చెయ్యటానికి సాహసించరు. వారికి తెలుసు, ఈ రాజకీయ చర్చలని నేనెంత ఆస్వాదిస్తానో ,ఆ సమయంలో ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడనని. ఎంత అవసరమున్నా, ఆవశ్యకమయినదయినా ఈ చర్చ అయ్యాకనే !

మొదట్లో తెలియక, ఫోను చేసి, ఇంటికి వచ్చి, నా వ్యంగ్యము, వెటకారము బారిన పడి, ఆ ‘అనుభవాన్ని’ మిగతావారికి , తమ అక్కసు రూపంలో వెళ్ళగక్కి…మొత్తానికి ఆ కొంచెం సమయంలో మాత్రం ,నా ఉనికిని విస్మరించాలని అందరూ జ్ఞానోదయం పొందారు .

నా ‘ప్రత్యక్ష’ నిష్టూరపు వాగ్ధాటి బాధితులలో ,ఈ శ్రీధర్ ఒకడు. అలాంటిది, ఏం కొంపలు మునిగిపోయాయని చేస్తున్నాడు? అని విసుక్కుంటూ..కావాలని, టి.వి ‘వాల్యూం’ ఇంకాస్త పెంచి ,ఫోను అందుకున్నాను. వీలయినంత అసహనాన్ని గొంతులో పలికిస్తూ 

‘హలో’ అన్నాను.

అవతలి నుంచి ‘శ్రీధర్’ ,”రేయ్ మదన్! నేనీరోజు చూసిన ఒక విచిత్రమయిన విషయం చెప్పాలిరా నీకు” అన్నాడు.

"నాకు చిర్రెత్తుకొచ్చింది. ఏం? కాసేపు ఓపిక పట్టలేని విశేషమా? "కోపం ధ్వనించిన స్వరంతో అన్నాను.

“ఏమోరా? నాకయితే ,నీతో వెంటనే పంచుకోవాలనిపించింది “ అన్నాడు.

ఎలాగూ టి.వి లో చర్చ కూడా ముగిసిపోతోందని “తగలడు” అన్నా

ఆ కోపాన్ని అలానే కొనసాగిస్తూ..

“ఈ రోజు మా ‘మనవడి’ కాలేజీలో, ‘ఓరియెంటేషన్’ ప్రోగ్రాం ఉంటే వెళ్ళాము.మమ్మల్ని అక్కడ ‘క్యాంపస్ టూర్’ అని తీసుకెళ్ళిన ఒక ‘సీనియర్’ అమ్మాయి, నువ్వు చెప్తే నమ్మవు కానీ, అచ్చు మీ కూతురిలానే ఉంది. ‘ముఖము’, ‘మాట’ అంతా నీ కూతురే అనుకో” .మా ఆవిడ కూడా చూడంగానే ,”మన ‘మదన్ ,శాంతి’ ల కూతురు ‘ఉజ్వల’ లా లేదూ?” అంది

వాడింకా ఏదో చెప్పబోతుంటే నేను ‘నాన్సెన్స్’ ఎవరిని చూసి , ఏమనుకుంటున్నారో? చూపు మందగించి ఉంటుంది, చెక్ చేయించుకో. ఎండన పడి ..మతిపోయినట్టుంది ..పెట్టెయ్ ఫోను , నా కూతురిలా ఉందట అని కట్ చెయ్యబోతుంటే- “ నీ ఇంటి పేరేరా” అన్నాడు.

ఉలిక్కిపడ్డాను. మరో మాట మాట్లాడకుండా ఫోను పెట్టేసాను. ఎప్పటినుంచి మా మాటలు వింటోందో కానీ నా భార్య ‘శాంతి’ కన్నీళ్ళతో నా వైపే చూస్తుండటం కనిపించింది.

అపార్థం చేసుకోకండి. నేనేదో బలహీన క్షణాన కని పడేసిన సంతానం మాత్రం కాదు.‌ఆ సంగతి నా అర్ధాంగి కి కూడా తెలుసు. ఎందుకు? అంటే నా గురించి మీకు చెప్పాలి.

నేను మా తల్లి తండ్రుల కి ఒక్కగానొక్క సంతానం. అరికాళ్ళకి మట్టి అంటకుండా పెరిగాను. నా నోటి నుంచి వచ్చే ప్రతి శబ్దానికి విలువుండేది, ప్రతి కోరిక నా కనుల ముందు రూపమయ్యేది. నేనూ, నా తల్లిదండ్రులని , ఎప్పుడూ నిరాశపర్చలేదు. చదువులో, ఆటల్లో అన్నింటిలో ముందుండే వాడిని. మంచి విలువలు కలిగి నడుచుకునే వాడిని.

మా చుట్టాలందరిలో, మొట్టమొదట ’విదేశాల్లో’ చదువుకున్నది ‘నేనే’.

నా ‘తెలివి తేటలని’ మెచ్చుకుని , బంధువులు, స్నేహితులు అందరూ ‘సలహాల’ కోసం నా దగ్గరికే వచ్చేవారు. నేను చెప్పింది చేసి నష్టపోయిన వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు.

అలా , నన్నెప్పుడూ ఒక పీఠం మీద కూర్చో పెట్టేవారు. చివరికి నా కాబోయే భార్య ,నా అంత ‘నిజాయితి’, నిబద్ధత కలిగి ఉందో లేదో నిర్ధారించుకుని మరీ వివాహం చేసుకున్నాను.

నన్నెవరయినా వేలెత్తి చూపితే సహించలేక పోయేవాడిని. నేను ఎప్పుడూ ‘తప్పు’ చెయ్యను, అని నా మీద నాకు అంత నమ్మకం.

‘సహధర్మచారిణి’ కి పర్యాయపదంలా ‘శాంతి’ , ఎప్పుడూ నా మాట జవదాటకుండా నడుచుకునేది.

నాకు మొదటి సంతానంగా ‘అమ్మాయి’ పుట్టింది. కొందరు, మొదటి సంతానం ‘వారసుడు’ పుట్టి ఉంటే బావుండేది అని అమ్మ తో అనటం, అమ్మ ' మాకు ఆడపిల్లే కావాలని ఉండె, ఆ ముచ్చట కూడా తీర్చుకోవాలి కదా ' రెండోది మాత్రం ఖచ్చితంగా అబ్బాయే’ అని నవ్వటం విన్నాను.

ఎందుకో ఆ మాటలు, నన్ను, అవమానించిన భావన కలుగజేసాయి. పాప ‘నామకరణం’ రోజు , “నాకు ఇంక ఒకరే సంతానం, పాపే నా వారసురాలు, చూస్తుండండి, పాపని ఎలా పెంచుతానో! ‘మదన్ కూతుర్ని’ , కొడుకులకి తీసిపోకుండా పెంచుతాను ..పాప పేరు ఉజ్వల’ “ అన్నాను, వారసుడని మాట్లాడిన వారి వంక ఓరకంట చూస్తూ.

అమ్మ మొహం పాలిపోయింది.

‘శాంతి’ చూపుల్లో “కనీసం, నన్నొక మాటయినా అడగరా “ అని కన్నీటి ప్రశ్న కనిపించింది. కానీ , ఎప్పటిలాగే నేను పట్టించుకోలేదు. నాన్నకి , నా విషయం తెలుసుకాబట్టి ,మౌనంగా ఉండిపోయారు.

మొండితనంతో , మళ్ళీ పిల్లలు పుట్టకుండా,నేను ఆపరేషన్ చేయించుకున్నాను, అతి జాగ్రత్తతో, శాంతికీ చేయించాను .అన్నట్లే

‘ఉజ్వల’ ని ,నాలా తీర్చి దిద్దాను.

ఒకటే తేడా! ఉజ్వల ఇష్టాయిష్టాలన్నీ నేనే నిర్ణయించేవాడిని. ఎత్తి చూపే అవకాశం ,ఎవరికీ ఇవ్వకూడదని నా అభిప్రాయం.

ఉజ్వల కి , నేనంటే ఎనలేని గౌరవం.

నా మాటకు చాలా విలువిచ్చేది.

నా దగ్గర ఎప్పుడూ,ఏదీ దాచేది కాదు.

ఒకసారి మాటల సందర్భంలో, అభయ్ ని ప్రేమిస్తున్నానని, అతను తన కాలేజీ లో సీనియర్ అని, కాలేజీలో ఉన్నప్పటినుంచి ప్రేమించాడట కానీ, ఉజ్వల చదువు కూడా పూర్తయ్యి , ఉద్యోగం వచ్చే దాకా వేచి చూసి, నిన్ననే ప్రేమ, పెళ్ళి ప్రస్తావన తీసుకొచ్చాడని చెప్పింది. “నాకు కూడా ఇష్టమే నాన్నా! కానీ నీ అనుమతి లేనిదే , అతనికి నా ఇష్టాన్ని తెలియచెయ్యను “ అంది.

నిజానికి ,మంచి పిల్లాడు. ఈ కాలం కుర్రవాళ్ళలా ,వెంట పడి ,వేధించకుండా పద్ధతిగా పెళ్ళి ప్రస్తావన ముందు పెట్టాడు. నా కూతురు మాత్రం!! ఏం తక్కువా? నా అనుమతి లేకుండా అడుగు వెయ్యను అంటోంది.

అయినా…రేపు ,నలుగురిలో , ‘నేను చూసిన సంబంధం కాదు, ఉజ్వల ఎంచుకున్న వరుడు’ అని తెలిస్తే ?’ అనే ఊహతో , ఉజ్వల ప్రేమని మొగ్గలోనే త్రుంచేసాను. ఇంకెప్పుడూ ఆ అబ్బాయి ప్రస్తావన తీసుకురావద్దని ఖచ్చితంగా చెప్పాను. సరే అని ,ఉజ్వల మౌనంగా ఉండిపోయింది.

అయినా ,అనుమానంతో, తన కదలికలు కనిపెట్టే వాడిని. ఇలా ఎన్నాళ్ళు చూడాలని, త్వరగా పెళ్ళి ఏర్పాట్లు చేసాను. ‘చిట్టితల్లి’, మారు మాట్లాడకుండా తల వంచి ‘తాళి’ కట్టించుకుంది. నా ఛాతీ సంతోషంతో ఉప్పొంగిపోయింది.కానీ ,ఆరు నెలలయ్యాక, శుభవార్త కోసం ఎదురు చూస్తున్న మాకు, ఉజ్వల ‘మరణ వార్త’ ఒక శరాఘాతంలా తగిలింది.

కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. హుటాహుటిన అల్లుడింటికి చేరిన మాకు, నిశ్చలంగా పడుకున్న ‘ఉజ్వల’ కనిపించింది. నిశ్చేష్టుడినై నిలబడిపోయాను. కూతుర్ని చూసి, శాంతి గుండె పగిలిపోయేలా ఏడుస్తోంది. ఏమయ్యింది?

"ఎలా జరిగింది? "అల్లుడి వైపు నిస్సహాయంగా చూసాను.

“ బాల్కనీలో,మొక్కలకి నీళ్ళు పోస్తూ ఉంది. ఉన్నట్టుండి పెద్ద శబ్దం వినపడింది, పరిగెత్తుకుని వెళ్ళి చూస్తే…కింద రక్తపు మడుగులో ఉజ్వల, నేను కిందకి పరుగెత్తుకొని వెళ్ళి, హాస్పిటల్ కి తీసుకెళ్ళే లోపలే….నన్ను క్షమించండి మామయ్య!! ఉజ్వల ని

కాపాడుకోలేకపోయాను “ అని నన్ను పట్టుకుని బిగ్గరగా ఏడ్చాడు.

“ వీళ్ళందరూ,ఉజ్వల ఆత్మహత్య చేసుకుంది అంటున్నారు ,మాకేమీ అర్థం కావట్లేదు బావగారూ “ అని వియ్యంకుడు అంటుంటే , “నా కూతురు ‘ఆత్మహత్య’ చేసుకునేంత పిరికిది కాదు, ' నా’ పెంపకం అన్నాను” కన్నీళ్ళు ధారగా కారుతుంటే.

'డెత్’ సర్టిఫికెట్ కోసం వెళ్ళినపుడు, ఉజ్వల స్నేహితురాలు పావని, నా దగ్గరకు వచ్చి, “అంకుల్, మీకొక నిజం చెప్పాలి. ఉజ్వలని, గ్యారంటీగా మీ అల్లుడే చంపేసుంటాడు. ఎందుకంటే, మేము ఒకసారి ,వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ,ఏం కారణం లేకుండా ఉజ్వల మీద రెండు మూడు సార్లు చెయ్యి చేసుకోవడం, బెదిరించడం చూసాం. “

“మీకు ‌తెలియజెయ్యమని చాలా సార్లు చెప్పి చూసాం. లేదా, మేమన్నా, మిమ్మల్ని తీసుకు వస్తామని బ్రతిమాలాము.‌ కానీ, ఈ విషయం,ఎట్టి పరిస్థితుల్లోనూ మీ దాకా రాకూడదని, ప్రాధేయపడింది. మాట తీసుకుని మా నోరు కట్టిపడేసింది. ఇప్పుడు అనిపిస్తుంది,దాని మాట విని తప్పు చేసామని. కొన్నాళ్ళకి ఉజ్వల ఫోన్ నెంబరును మార్చేసాడు‌ ఆ ‘స్కౌండ్రల్’. ఇంటికి ఎప్పుడు వెళ్ళినా తాళం వేసుకుని ఉండేది. ఉజ్వలని ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్ళేవాడని ఇప్పుడు, ఇరుగు పొరుగు ద్వారా తెలిసింది.

అంకుల్!, ఉజ్వల, మీరు తీసుకున్న నిర్ణయాన్ని కాదనటం, లేదా ప్రశ్నించటం అంటే , మిమ్మల్ని అవమానించినట్టు, అగౌరవపరిచినట్టే అని మాతో చాలా సార్లు అనేది.‌ఈ విషయంలో కూడా, తన ఆలోచన అదే ఉండుంటుంది. అందుకే మీకు ఏనాడు తన బాధని చెప్పుకోలేదు, ఆత్మహత్య అస్సలు చేసుకోదు. “ అంది.

అంతా విని కూడా కన్నీళ్ళ మధ్య, డెత్ సర్టిఫికెట్ లో ‘యాక్సిడెంటల్ డెత్’ అని రాయించాను. కారణం‌ ! ఒకటి ‘సమాజంలో నా పట్ల ఉన్న ‘ఉన్నత స్థానం' చెదిరిపోకూడదనే ‘నా అహం’ , రెండు ‘నా ఉజ్వల మనసులో ,నేను తప్పు చెయ్యను అనే నమ్మకం’ నిజం చెయ్యాలనే వెర్రితనం.

ఇప్పుడు మెల్లిగా అర్థమవుతోంది, శాంతి, “ఉజ్వల ఫోను కలవట్లేదని ఎందుకనేదో’..తన మాటల్ని కొట్టి పడేసేవాడిని. అల్లుడికి ఫోను చేసి మాట్లాడి ,అంతాబావుంది,బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు, ఎవరి సెలక్షన్ మరి,అని కాలరెగరేసేవాడిని.

“ఇంటికి వెళ్ళి చూసొద్దాం” అని శాంతి ,ఎంతబ్రతిమిలాడినా ,వినేవాడిని కాను. నా స్థాయి చూపించుకోడానికి, అల్లుడిని, కూతుర్ని నా ఇంటికే రమ్మనేవాడిని. ‘ఉజ్వల’ పెదవులపై ఉన్న ‘నవ్వు’ కళ్ళల్లోకనిపించకపోయినా , నిర్లక్ష్యం చేసాను. వీడు నా ‘అబధ్ధపు’ పోకడని,వాడికి అనుగుణంగా మార్చుకున్నాడు. ఫోను గురించి ఎప్పుడడిగినా, దాటవేసేవాడు. పైగా నేను, వాడికి వంత పాడేవాడిని,

“నిన్ను మరపించేంత బాగా చూసుకుంటున్నాడు, నీతో ఫోన్ లో ఎందుకు మాట్లాడుతుందీ” అని.

ఉజ్వలని ఒక్క క్షణం కూడా ,ఒంటరిగా వదలకపోతే, ప్రేమనుకున్నా కానీ, అనుమానం అనుకోలేదు.

శాంతి అన్నట్టు, ఉజ్వల ఇంటికెళ్ళి చూసుంటే ,ఎలా ఉండేదో?....

కానీ ఎక్కడ నా ‘బేలతనం’ బయటపడుతుందో , అని ఈ విషయాలన్నింటినీ నాలోనే దాచుకున్నాను.నా అహం ఎంత దూరం తీసుకెళ్ళిందంటే ,అల్లుడి ఎంపిక సరయినదే అని నన్ను నేను నిరూపించు కోడానికి, ‘ఉజ్వల' దినాలప్పుడే సంబంధం మాట్లాడుకుంటున్న అల్లుడిని ,నిలదీయకుండా దగ్గరుండి మళ్ళీ పెళ్ళి చేసాను.శాంతి కి, ఈ విషయం చెప్పలేదు. అవసరం లేదు అనుకున్నాను.

కానీ ఒక రోజు ‘ఉజ్వల’ స్నేహితులని ,ఇంటి దగ్గరచూసినప్పుడు మాత్రం , ఇంక దాచలేను అనిపించింది. అయినా , ఎప్పటిలాగే నిర్లక్ష్యం చేసాను.

కానీ…ఈ సారి నా భార్య శాంతి కూడా, నన్ను పట్టించుకోవడం మానేసింది. ఏనాడూ ‘ఘర్షణ’ ఎరుగని మా మధ్య ,మౌన ‘సంఘర్షణ’ మొదలయ్యింది.నా అంతట నేను, పొద్దున్నే ‘వాకింగ్’ కి, వెళ్ళటం, దేశాన్ని ఉద్దరించేసే వాళ్ళలా , సమస్యల మీద ‘వాదోపవాదాలు’,రాజకీయ చర్చలు చేసుకోవటం; కడుపులో,ఎలుకలు ‘కమాన్’ అనగానే, కరచాలనం చేసుకుని ఇంటికి చేరుకోవడం. టేబుల్ మీద ‘శాంతి’ తయారుచేసి పెట్టిన ‘టిఫిన్’ తినడం. స్నానం, ధ్యానం, టి.వి. ఇది నా దినచర్య.

శాంతి కి ,మా ఇద్దరికి ఇంత వండటం, పూజలు,దేవాలయాలు ,పారాయణాలు, టి.వి లో ‘సీరియల్సు' దినచర్య.

ఎవరి టి.వి వారికి, ఎవరి గదులు వారివి. పందొమ్మిదేళ్ళ నుంచి మా జీవితాలు ఇలానే గడుస్తున్నాయి. కలిసి భోంచేసింది లేదు, కూర్చుని మాట్లాడుకున్నది లేదు.

వివాహాలకి, వేడుకలకి మాత్రం కలిసి వెళ్తాం, కలిసి వస్తాం, కానీ అక్కడ ,ఎవరి దారి వారిదే.

ఇన్నేళ్ళకి మళ్ళీ , ఈ వార్త ,మా మధ్య చూపులు కలవడానికి కారణమయ్యింది. అయోమయం, గందరగోళం కలిసిన భావాలతో ఒకరి మొహం ఒకరు చూసుకున్నాము.శ్రీధర్ కి ఫోను చేసి వివరాలు కనుక్కున్నాను. మర్నాడు పొద్దున్నే తయారయ్యి, కారు దగ్గరకు వెళ్ళేసరికి ,శాంతి ఎప్పుడో వచ్చి నా కోసం ఎదురుచూస్తోంది.

ఇద్దరం, శ్రీధర్ చెప్పిన కాలేజీకి వెళ్ళి , అమ్మాయి పేరు చెప్పి, ‘వెయిటింగ్ రూం’ లో ఆత్రంగా ఎదురు చూస్తూ కూర్చున్నాము. ఇంతలో , “మీరేనా అంకుల్, ఆంటీ ! నా గురించి అడిగింది? అంటూ డోర్ తెరుచుకుని వచ్చింది.

మా ‘గుండె చప్పుడు’ మాకే స్పష్టంగా వినిపిస్తోంది. మా అమ్మాయే ‘పిలుపు’ మార్చి, 'అమ్మా, నాన్నా' బదులు , ‘అంకుల్,ఆంటీ' అంటుందా అన్నంత పోలికుంది.అప్రయత్నంగా మా కనులు వర్షించాయి.

ఆ అమ్మాయి కంగారు పడి ,” ఏమయ్యింది ఎందుకు ఏడుస్తున్నారు ?” అనడిగింది. మేము తేరుకుని, కళ్ళు తుడుచుకున్నాము.

అమ్మాయి ఇచ్చిన మంచినీళ్ళు తాగి ,కాస్త స్థిమిత పడి, “నీకీ పేరు ‘క్రాంతి’ అని, ఎవరు పెట్టారమ్మా?” అనడిగాను, మొదట్లోనే ఇంటి పేరు గురించి అడగలేక.

"ఇదడగటానికా మీరు నన్ను పిలిచారు? అన్నట్టు ఆశ్చర్యంగా చూసి, “ తెలీదంకుల్! నన్ను ‘అనాధాశ్రమం' లో చేర్చినప్పుడు, నా బట్టలలో, నా పేరు,కొంత డబ్బులతో ఉన్న ‘కవర్’ దొరికిందట. “ ఇదివరకు ఎంతోమందికి చెప్పినట్టు యథాలాపంగా అన్నా ,ఆ మాటలు మాత్రం , మా గుండెల్లో ‘గునపం’ గుచ్చి మెలి పెట్టిన బాధని కలిగించాయి.

ఏదో అనబోతున్న 'శాంతి’ ని వారించి, అనాథాశ్రమ వివరాలు కనుక్కుని , ‘వెళ్ళొస్తాం' అని లేచాను.

ఆ అమ్మాయి, దత్తత తీసుకునేందుకు తిరుగుతున్నామనుకుని, “తప్పకుండా వెళ్ళండంకుల్..మీకు తప్పకుండా ఎవరో ఒకరు నచ్చుతారు” అంది, మేము వెళ్ళటానికి తలుపు తెరిచి పట్టుకుని. నా కూతురు ' జిరాక్స్ కాపీ’ అనుకున్నాను.

శాంతి కనులలో మెరుపుతో పాటు ,ఎన్నో ప్రశ్నలు. నేనెందుకు ‘క్రాంతి’ కి ఏమీ చెప్పలేదనీ? తననెందుకు మాట్లాడకుండా వారించానని?

ఇన్నేళ్ళకి,మొదటి సారి , శాంతి ముందర నోరు విప్పాను. శాంతి మోములో కూడా వినాలనే ఆరాటం కనిపించింది.

చూడు శాంతి! ఇలాంటి విషయాల్లో ‘ఆత్రం’ పనికిరాదు. మన ‘ తొందరపాటు’, క్రాంతి కి ఏం విధంగానూ,బాధ కలిగించకూడదు అనే నా తాపత్రయం. ఇప్పుడు ఆ అనాథాశ్రమానికే వెళ్తున్నాను. చూద్దాం ఇంకేమన్నా వివరాలు దొరుకుతాయేమో! అన్నాను. శాంతి, సరే అన్నట్టుగా తల ఊపింది.

ఆశ్రమం దగ్గర కార్ ఆపి, కిందకి దిగాము.

‘ శ్రీ గురు నిలయం’ అని ఒక పాతబడి, పెచ్చులూడుతున్న బోర్డ్ కనిపించింది.

శాంతి ఒక్కసారి నా చెయ్యి గట్టిగా పట్టుకుంది. ‘పర్వాలేదు’ అని తన చేతిని తట్టి ‘ధైర్యము’ ఇస్తున్నా కానీ, నా మనసులో నరాలు చిట్లిపోయేంత ‘ఆందోళన’ ఉంది. నాలో ఎక్కడో ఒక మూలనున్న ‘అనుమాన పిశాచం’ నా పెంపకాన్ని ప్రశ్నిస్తున్నట్టుంది.

లోపలికి అడుగు పెట్టగానే బిల బిలమంటూ పది, పదిహేను మంది పిల్లలు చుట్టూరా చేరారు. రకరకాల వయసువారు, నేను,నేను అంటూ ,మా చేతులు పట్టి లాగసాగారు.

“ఏయ్ పిల్లలు! అల్లరి మాని లోపలికి పొండి, మీ టీచరు పిలుస్తోంది “ అని ఒకావిడ పిల్లల్ని గదమాయించింది. నిశ్శబ్దంగా వెనుతిరిగారు పిల్లలు. “ క్షమించండి, మీరు దత్తత తీసుకోడానికి వచ్చారేమో అని ఆ ఆరాటం” అంది

‘ఛ! అనాథాశ్రమానికి వస్తూ ఇన్ని పళ్ళయినా తీసుకురావాలనే ఇంగితజ్ఞానం లేకపోయింది నాకు' అని నన్ను నేను తిట్టుకున్నాను.

కూర్చోండి! అని రెండు కుర్చీలు చూపించింది.

“చెప్పండి! ఏం పని మీద వచ్చారు? అనడిగింది ఆ పెద్దావిడ కూడా కుర్చీ లాక్కుంటూ. మీ పేరు..? మీరు ఎన్నేళ్ళుగా ఇక్కడ పని చేస్తున్నారు? అనడిగాను.

“ నా పేరు ‘మాల’ అండి.‌నేను దాదాపు పదేళ్ళుగా ఇక్కడ పని చేస్తున్నాను” అంది

‘పందొమ్మిదేళ్ళ క్రితం జరిగిన సంగతి ,ఈవిడకేం తెలుస్తుంది?’ మనసులో అనుకున్నాను.

నా మొహం లోని నిరుత్సాహాన్ని చూసి,” మీకేం కావాలో చెప్తే, నేనేమన్నా సహాయం చెయ్యగలనేమో ప్రయత్నిస్తాను” అంది

‘ మీ కంటే ముందు ఎవరు పని చేసే వారో ,మీకేమైనా తెలుసా?’ అనడిగాను

“పార్వతమ్మ’ గారని ఉండేవారండీ , ఆవిడ మంచాన పడితే,నేను తీసుకున్నాను.పాపం ఈ మధ్యే కాలం చేసారు “ అంది

"అయ్యో! ఉన్న ఒక్క తీగ ,తెగిపోయిందే!" అనుకుని, చివరి ప్రయత్నంగా “ మీ ఆశ్రమం , పూర్వాపరాలు, ఎప్పుడెప్పుడు,ఎవరెలా వచ్చారో? చెప్పమన్నారు.

“ ఎవరు ,ఎప్పుడు పెట్టారో తెలియదు కానీ , దత్తత కి వెళ్ళిన వాళ్ళు వెళ్ళగా,ఎప్పటికీ పదిహేను , ఇరవై మందయితే ఉంటారు. ఇక్కడే ఒక‌ టీచర్ని పెట్టి, ‘బేసిక్ ఎడ్యుకేషన్ ' అయితే ఇస్తాము. బాగా చదువుకునే వాళ్ళు, ‘స్కాలర్షిప్’ తో, లేదా, ఎవరయినా దాతలు వారి ‘చదువుకయ్యే’ ఖర్చులు ఇస్తే పై చదువులకు వెళ్తారు” అంది.

అదే అవకాశంగా “ ఇప్పటి వరకు పెద్ద చదువులు చదివిన వారు ఎంతమంది? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? “ అనడిగాను.

ఇవన్నీ మీకెందుకు? అన్నట్టు మొహం పెట్టి, వెంటనే చిరునవ్వు పులుముకుని “ ఓ! చాలా మంది ఉన్నారు. కలెక్టర్లు , డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు ఇలా ఇంకా చాలామంది ఉన్నారు “ అంది ఇంక చాలు అన్నట్టుగాముసుగులో గుద్దులాట అనవసరమని ,సూటిగా 'క్రాంతి’ గురించి మీకేమైనా తెలుసా? తన చదువుకు ఎవరు సాయం చేస్తున్నారో తెలుసా? అని అడిగాను.

“కారణం చెప్పందే మేము ఏ వివరాలు వెల్లడించమండి “ అంది. ఇందాక గొంతులో ఉన్న మృదుత్వం ఇప్పుడు లేదు.

“మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. ఇందాక కాలేజీలో చూసాము.మాకు బాగా నచ్చింది. అందుకే. వివరాలు కనుక్కుందామని వచ్చాము” అన్నాను

“అయ్యో! ఎంత మాట , మాకు అంతకంటే భాగ్యం ఏముంటుంది? “మళ్ళీ స్వరం లో మృదుత్వం. “కానీ ..క్రాంతి ని ఎవరికీ దత్తత కి ఇవ్వద్దని, పార్వతమ్మగారు చెప్పేవారండి. ’క్రాంతి’ ని,వదిలి‌ వెళ్ళిన వాళ్ళు, ఇంటిపేరు తో సహా , క్రాంతి పేరు, ఖర్చులకి, కొంత పైకం వదిలి వెళ్ళారు. ఇంటి పేరు రాసారంటే, ఏదో ఇబ్బందిలో ఉండే, ఇక్కడ వదిలిపెట్టి ఉంటారు. పైగా మధ్య మధ్య క్రాంతి పేరుమీద డబ్బు వస్తుంటుంది. అందుకే క్రాంతి ని వెతుక్కుంటూ, ఆ వంశస్థులు ఎవరో ఒకరు , ఎప్పుడో అప్పుడు వస్తారని చెప్పేది” అంది.

ఇక ఇంతకంటే ఈవిడ దగ్గర వివరాలు లేవనుకుని, లేచి నిలపడ్డాము.

నా పర్సులో ఉన్నదంతా తీసి, మాల చేతిలో పెట్టి వెనుతిరిగాము. ఇంకా చిక్కు ముడి పడినట్లయింది. ఎవరు వదిలిపెట్టి వెళ్ళారు?ఎవరు సాయం చేస్తున్నారు? ఎంత ఆలోచించినా ఎక్కడ మొదలయ్యిందో అర్థం కావట్లేదు.

ఒకసారి మళ్ళీ అప్పుడు జరిగిన సంఘటనలు నెమరు వేసుకున్నాను. ‘ఉజ్వల’ తప్పటడుగు వేసే ప్రసక్తే లేదు.టక్ మని ఉజ్వల , ‘అభయ్’ గురించి చెప్పడం గుర్తొచ్చింది. ‘రాస్కెల్’ ! ఎక్కడున్నా పట్టుకోవాలి అనుకున్నా.

వెంటనే ఇంటికి వచ్చి, ఉజ్వల స్నేహితుల ఫోను నెంబర్లను వెతకమని,శాంతికి చెప్పి, ‌దొరికిన వాటికి ఫోన్లు కలిపాను. దాదాపు నెంబర్లన్నీ మారిపోయాయి. ఒక్క నెంబరు మాత్రం కలిసింది. కానీ స్నేహితురాలి అమ్మ ఎత్తింది. కూతురు ఇప్పుడు,అమెరికాలో ఉందని చెప్పింది. నెంబరు తీసుకుని ‘థాంక్స్ ' చెప్పి పెట్టేసాను.

అమెరికాలో వాళ్ళకిపుడు అర్ధరాత్రి. వారికి తెలవారే వరకు , అంటే మనకి రాత్రి అయ్యే వరకు ఆగాలి. క్లూ దొరకని పజిల్ లా ఉంది పరిస్థితి.

శాంతి కేసి చూసాను. నీరసంగా సోఫాలో ఓ మూలకి ఒరిగి ఏదో ఆలోచనలో ఉంది. ఇన్నేళ్ళ వైవాహిక జీవితం లో మొదటిసారి శాంతి మీద జాలి పడ్డాను.

అన్నం కలుపుకుని వెళ్ళి ' శాంతి ,లే అన్నం తిను ' అన్నాను.

ఆశ్చర్యం,ఆనందం కన్నీరుగా మారుతుంటే నన్ను హత్తుకొని ఏడ్చేసింది. తన చుట్టూ చేయి వేసి ఓదారుస్తూ ఉండిపోయాను. ఓదార్పులో ఇంత ప్రశాంతత దొరుకుతుందని ఇప్పుడే తెలిసింది.

రాత్రి కాగానే ,వారి సమయం చూసుకొని ‘మెసేజ్’ పెట్టాను,ఫోన్ చెయ్యవచ్చా? అని.వెంటనే ఫోన్ రింగయ్యింది. హలో ! అనగానే, “అంకుల్ నేను ‘పావని’ ని ,బావున్నారా? ఆంటీ ఎలా ఉన్నారు? ” అని వినిపించింది. ఒక్క క్షణం ,అపరాధ భావన కలిగింది.

సర్ధుకుని, తన కుశలము అడిగి, ‘అభయ్’ గురించిన వివరాలు అడిగాను.కాసేపు మౌనం తర్వాత “అంకుల్ , మీకు తెలీదా? ఉజ్వల చనిపోయిన మూడు నెలలకే ‘అభయ్’ యాక్సిడెంట్ లో చనిపోయాడు” అంది.

చేతిలోంచి ఫోన్ జారిపడి ,నేను సోఫాలో తూలి పడ్డాను. శాంతి ,నన్ను పట్టుకుని సరిగా కూర్చోపెట్టి, “అంకుల్, అంకుల్” అని ఆందోళనతో అరుస్తున్న పావనితో , ‘అంకుల్ , బానే ఉన్నారమ్మా! మేము మళ్ళీ ఫోన్ చేస్తామమ్మా, జాగ్రత్త! ' అని ఫోన్ కట్ చేసింది.

శాంతి తెచ్చిన మంచినీళ్ళు తాగి, కాస్త ఉపశమనం పొంది, ఎలా శాంతి? ఇదెలా సాధ్యం? ఇద్దరూ ఈ లోకం విడిచి వెళ్ళాక , క్రాంతి పుట్టింది. పోనీ మనిషిని పోలిన మనుషులు ఉంటారు , ఇది యాదృచ్ఛికం

అనుకుందామంటే ,మన ఇంటి పేరెలా?

ఎంతో తెలివిగల వాడినని విర్రవీగే నాకు, అంతుబట్టని చిక్కు ప్రశ్న లా ఉంది. నాకేమీ అర్థం కావట్లేదు అని తల పట్టుకు కూర్చున్నా.

ఇంతలో పావని దగ్గరినుంచి మెసేజ్. “అభయ్’ అక్క నంబరు,పేరు రాసి, వీలయితే కలవమని” సారాంశం.

వెంటనే ఫోను చేసి, పొద్దున్నే కలుద్దామని చెప్పాను. ఒకటే మంచం మీద ఉన్న ఇద్దరం,నిద్ర పట్టక సూర్యుడి కోసం ఎదురు చూస్తూ అటూ ఇటూ కదులుతునే ఉన్నాం.

చెప్పిన సమయానికి ,ఇచ్చిన చిరునామాకు చేరుకున్నాం. సుమారు యాభై ఏళ్ళు ఉంటాయేమో,ఒకావిడ తలుపు తెరిచింది.

“రండి, కూర్చోండి. నా పేరు అఖిల. నేను అభయ్ అక్కని “ అని కాసేపు ఆగింది.ఆ కాస్త విరామాన్ని కూడా భరించలేక పోయాం.

“మీరు ‘అభయ్’ గురించి అడిగారని ‘పావని’ చెప్పింది. అందుకే మిమ్మల్ని కలుస్తానని చెప్పమన్నాను.”

మేము నిశ్శబ్దంగా వింటున్నాము.

“మీకీ విషయం ఎలా చెప్పాలో తెలియట్లేదు?

“మీ ఉజ్వల, అందము ,తెలివితేటలు చూసి మీ అల్లుడి స్నేహితుడొకడు, “ఇలాటి అమ్మాయిల ‘అండాలకి’ బాగా ‘డిమాండ్’ ఉంటుందని,తను పనిచేసే ‘ఎగ్ బాంక్’లో చూస్తానని చెప్పాడు.

ఆ మాటలు మీ అల్లుడి మనసులో దురాలోచనలు కల్పించాయి. ఎంత వరకు రావచ్చని అడిగాడు. వాడు , “ పార్టీని బట్టి ఉంటుంది ,మంచి సౌండ్ పార్టీని పడితే, కోట్లు రావచ్చని’ చెప్పాడు.

ఇద్దరూ కూడబలుక్కుని, ఉజ్వల కి ‘ రొటీన్ చెకప్ అని’, ఆ టెస్ట్ ,ఈ టెస్ట్ అని ఇంజెక్షన్లు ఇచ్చి, రెడీ చేసారు. ఉజ్వల కనిపెట్టే లోపల, జరగాల్సింది , జరిగిపోయింది.

అదృష్టవశాత్తు,ఆ బాంక్ హెడ్, అభయ్ కి ప్రాణమిత్రుడు. ఉజ్వల ని చూసి , గుర్తుపట్టి అభయ్ కి కాల్ చేసాడు.

అక్కడికి వెళ్ళిన అభయ్,వాడనుకున్నట్టు పెద్ద మొత్తంలో డబ్బు చేతిలోపడిందంటే, వాడికదొక వ్యాపారమయిపోతుంది. ఉజ్వల ప్రాణానికే ప్రమాదం. అందుకని దయచేసి,వాటిని దాచేసి , వాళ్ళకి డబ్బు రాకుండా చెయ్యమన్నాడు’

కానీ అభయ్ ఊహ తప్పయ్యింది. మళ్ళీ డొనేట్ చెయ్యమని ,ఉజ్వల మీద ఒత్తిడి తెచ్చాడు. కొట్టాడు, బెదిరించాడు.

ఉజ్వల అంగీకరించక పోయేసరికి, బహుశా వాడే పైనుంచి తోసేసి ఉంటాడని మా అనుమానం.” అని నిట్టూర్చింది అఖిల.

“ఎంత బాధ అనుభవించావురా,నా బంగారు తల్లీ !! “ అని శాంతి విలపిస్తుంటే, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదనిపించింది.

ఇప్పుడు ,నాకు మెల్లిగా అంతా అర్ధమయ్యి, మబ్బులు వీడుతున్నట్టనిపించింది. కానీ దాన్ని ,ఈ భూమ్మీదకు తీసుకొచ్చిందెవరు? జన్మనిచ్చింది ఎవరు? ఎందుకు అనాథాశ్రమంలో వదిలేసారు? అనే ప్రశ్నలకు మాత్రం ఇంకా జవాబు దొరకలేదు.

అదే అడిగాను.

“ ఉజ్వల మరణం తర్వాత ,అభయ్ బాగా క్రుంగిపోయాడు. డబ్బు రాకుండా చేసి ,పరోక్షంగా ఉజ్వల చావుకి , తాను కూడా ఒక కారణమయ్యానని ‘ కుమిలిపోయాడు.

ఈ లోపల ,అభయ్ స్నేహితుడు, ఉజ్వల ఎగ్స్ ని ఏమి చేద్దాం? అని అడగటంతో, ‘ వాటికొక రూపాన్ని ఇచ్చి ,పెంచుకుంటాను అని అభయ్ , అభ్యర్థించాడు.

ఈ విషయం బయటికి వస్తే తన ఉద్యోగానికి ప్రమాదమని , ఎవరికీ తెలియటానికి వీల్లేదని మాట తీసుకుని, తనకున్న ఉద్యోగంపరిచయాలతో , ఒకమ్మాయిని ఒప్పించారని విన్నాము. వివరాలు మాత్రం ఎప్పుడూ చెప్పలేదు. ఆ తర్వాత అభయ్ మరణంతో, చెదిరిపోయిన మా కుటుంబాన్ని, నిలబెట్టుకునే ప్రక్రియలో మేము ఆ విషయానికి ప్రాదాన్యత ఇవ్వలేదు.

మీరు అభయ్ గురించి అడిగారని ‘పావని’ చెప్తే…మీకు తెలియాల్సిన అవసరం ఉందని ,కలుస్తానని అన్నానని చెప్పి ముగించింది.

“ఆ అభయ్ స్నేహితుడు, ‘అదే ఆ ఎగ్ బాంక్ హెడ్ , వివరాలు ఏమన్నా ఇవ్వగలరా ?” అని అడిగాను.

“నా దగ్గర అతని ఫోన్ నెంబరు అయితే లేదు కానీ పేరు ‘ వినయ్’ ,ఆ సంస్థ పేరు ‘ యువర్ బేబీ స్టెప్స్’ “అని మాత్రం తెలుసని చెప్పింది.

గూగుల్ లో వెతికితే అదృష్టవశాత్తు ఆ సంస్థ ఇంకా నడుస్తోందని తెలిసింది. ‘అఖిల’ కి కృతజ్ఞతలు చెప్పి బయలుదేరాము.

అభయ్ విషయంలో ,మా వల్ల జరిగిన పొరపాటుకి మమ్మల్ని క్షమించమని అడిగి, భారమయిన మనసుతో ‘శాంతి’ నన్ను అనుసరించింది.

ఎక్కువ కష్టపడకుండానే, సంస్థ చిరునామా దొరికింది.

కానీ వినయ్ ఆ సంస్థ వదిలేసి చాలా కాలమయ్యింది, ఇప్పుడు తనకు సొంత ‘బిజినెస్’ ఉందని చెప్పారు.

మా అభ్యర్థనను మన్నించి,వినయ్ ఫోన్ నెంబరు ఇచ్చారు.అక్కడినుంచే వినయ్ కి ఫోన్ చేసాను. వివరాలు చెప్పగానే, మా ఇంటికి తనే వచ్చి కలుస్తానన్నాడు.

ఇంటికి చేరి ఎదురుచూస్తూ ఉన్నాము. అసలీ ఎదురు చూపులకు, అంతముందా? అనిపించింది.

వినయ్ ఫోన్ చేసి ‘అడ్రెస్’ కనుక్కుని వచ్చాడు.

“నాకు ఎక్కడ మొదలుపెట్టాలో తెలియట్లేదు అంకుల్.ఉజ్వల పట్ల ,అభయ్ కి ఉన్న ప్రేమను చూసి, తన అభ్యర్ధనని కాదనలేకపోయాను.

నాకు ఈ ‘ఫీల్డ్’ లో ఉన్న పరిచయాలతో, ఒకమ్మాయిని ఒప్పించాను. అంతా బావుంది.. అనుకుంటుండగా ‘అభయ్’ మరణం మాకు ఊహించని పరిణామం అయ్యింది.

‘అబార్షన్’ ఆ అమ్మాయి ప్రాణాలకి , ప్రమాదం అంటే , గర్భాన్ని కొనసాగించాల్సి వచ్చింది. పాప పుట్టేదాకా,నేనే దగ్గరుండి అన్నీ చూసుకున్నాను.

పాపని కని,ఆ అమ్మాయి వెళ్ళిపోయింది.

పాపని ఏం చెయ్యాలో నాకు పాలుపోలేదు. ‘అభయ్ ‘ వాళ్ళ ఇంట్లో ఇద్దామంటే, ఈ ‘ఐవిఎఫ్’ కోసం అభయ్ చేసిన ఖర్చు భారం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. మరో భారం , వెయ్యటం ఇష్టం లేకపోయింది. వారు కొంచెం కుదుట పడ్డాక, చెప్ఫుదామనుకున్నాను,కానీ ఈ లోపల వారు ఇల్లు మారడంతో, చిరునామా తెలియకుండా పోయింది.

అభయ్ కి, మీ మీదున్న గౌరవంతో, తను చేసిన పనికి , మీరెన్నడూ మాట పడకూడదు అనే ఉద్దేశ్యంతో,ఈ విషయం మీకు ఎప్పటికీ తెలియకూడదని, నా దగ్గర మాట తీసుకోవడంతో, మీ వద్దకూ ..రాలేక పోయాను.

నాకున్న కుటుంబ సమస్యల వల్ల, నేనూ పెంచుకోలేక అనాథ శరణాలయంలో , వదిలి పెట్టాల్సొచ్చింది. ‘అభయ్’ ఎంతో ప్రాణంతో పెంచుకుదామనుకున్న పాపని , అలా అనాథ లా విడిచి‌ పెడ్తున్నప్పుడు,నేను అనుభవించిన బాధ,అంతా ఇంతా కాదు.

అభయ్ అనుకున్న పేరు ‘క్రాంతి’ అని పెట్టి, దైవ సంకల్పం అనుకుంటా..ఇంటి పేరు మాత్రం ,మీది పెట్టాను .

ఇక ఆ ‘సంస్థ’ లో పని చెయ్యలేక, సొంత వ్యాపారం పెట్టుకుని ,బయట పడ్డాను. అయినా ఆ అపరాధభావనతో, అప్పుడప్పుడు ‘క్రాంతి’ పేరున డబ్బు పంపిస్తూ ఉంటాను.

మీ నుంచి ఫోన్ వచ్చేసరికి ,ఎంత సంతోషపడ్డానో, చెప్పలేను. నా గుండె మీద నుంచి ,పెద్ద భారం తీసినట్లుంది. అందుకే నేనే స్వయంగా వచ్చి, మిమ్మల్ని కలవాలనుకున్నాను. థాంక్యూ వెరీ వెరీ మచ్” అన్నాడు కాళ్ళకి దణ్ణం పెడుతూ..

మా మనసులో, మా చుట్టూ నిశ్శబ్దం ఆవహించింది. “నేను ఆలోచించుకోవాలి” అని లేచి

నిలబడ్డాను.అప్పటి వరకు బాధ, ఆనందం, దుఃఖం, ఇలా రకరకాల భావనలు పలికించిన, ‘శాంతి’ కళ్ళు ‘నిప్పులు చెరగడం’ చూసాను.

‘క్రాంతి' ని ఎలా ఒప్పించాలో? ఏమని క్షమాపణ అడగాలో? ఆలోచించుకోవాలి అంటున్నా శాంతీ ' అన్నాను. ఎన్నడూ వినని ‘గద్గదమయిన’ నా కంఠాన్ని విని, శాంతి నన్ను గట్టిగా కౌగలించుకొని, బిగ్గరగా ఏడవటం మొదలు పెట్టింది.

సమాజంలో, నా కున్న గౌరవానికి, మర్యాద కి కారణం, నాకున్న తెలివితేటలు, నా హోదానే అని విర్రవీగేవాడిని. కానీ , దానికి మీ ‘సహకారం’ ఎంత ఉందో, ఇప్పుడు అర్థమవుతోంది.రెండో ‘సంతానం’ వద్దు అన్నప్పుడు, నువ్వు , నీకెవరిచ్చారా హక్కు? అనడిగినా….

“ లేదు నాన్నా! నేను ‘అభయ్’నే చేసుకుంటాను “ అని నా కూతురు ఎదిరించినా, ‘ఇలాంటి వాడికిచ్చా, నాకు పెళ్ళి చేసావు? అని ప్రశ్నించినా…

“‘ఉజ్వల ' జీవితాన్ని పాడు చేసిన తండ్రి “ అని ‘అభయ్’ నా మీద ‘నింద’ వేసినా… “అంత వివరించినా , ఎందుకంకుల్ మీరు ఆ రాక్షసుడిని ‘సపోర్ట్’ చేసారని, పావని నిలదీసినా….

“ మీ మనవరాలు ,మీరే పెంచుకోండి” అని వినయ్ ,నలుగురిలో నన్ను నిలబెట్టినా…..

“నా పెద్దరికం, నా సంస్కారం ఏమయ్యేవి శాంతీ?”

“ నాకు తెలియకుండానే నన్ను నిలబెట్టిన వెన్నుపూసలు మీరందరు “

“ఇంటి పేరు” తెలిసి కూడా , టీ.వి లకెక్కి రచ్చ చేయకుండా , తన జీవనం ,తాను సాగించిన ‘క్రాంతి’ మంచితనం ముందర , నేనెలా నిలబడగలను శాంతీ …..

మీ స్వచ్చమైన అభిమానం ముందు, నా స్వార్థమైన ప్రేమ , ఓడిపోయింది. అర్థం పర్థం లేని బింకాలతో మిమ్మల్ని కట్టిపడేసాను. ఆలోచించే స్వేఛ్చని కూడా లాక్కున్నాను.నా అహంకారంతో, నిన్ను, నీ కూతురికి,మనవరాలికి దూరం చేసాను. క్షమించమని ఎంత అడిగినా తక్కువే శాంతి!! చేతులలో మొహం దాచుకుని విలపించాను.

“లేదండీ! నా దృష్టిలో మీరెప్పుడూ, ఉన్నత స్థానంలోనే ఉంటారు. ఇలాంటి ఆలోచన, ఇంకెప్పుడూ రానివ్వకండి. పదండి, మన ‘ఉజ్వల’ క్రాంతి ని, మనింటికి తీసుకు వద్దాం.. “ అంటున్న, నా ‘శాంతి’ చెయ్యి పట్టుకుని, ఒక కొత్త ‘మదన్’ ముందుకు నడిచాడు.

- అర్చన కోవూరు

Tags:    
Advertisement

Similar News