నేనెవరిని అని అడిగిందామె
నువ్వు ఆకాశంలో సగానివి కదా అన్నాడతడు
నేలనై మొలకెత్తేది
పూలవనాలను పెంచేది
నేనే అంది
విత్తనం నేనే కదా అన్నాడతడు గర్వంగా
ఇంటా బయటా
నా వెనకే నువ్వు
నీ నుదుట మెరిసే
సూర్యుడిని నేను
నీ మొత్తం వెలుగూ నేనే
అన్నాడతడు మీసం మెలేస్తూ
నా ఉనికికి అర్ధం అడిగిందామె మళ్ళీ
నువ్వు అంతటా ఉన్నావు
కానీ ఎక్కడా లేవు
నేను లేకపోతే నువ్వు
ఉత్త శూన్యానివి అన్నాడు
*******
ఆమె ఉన్నట్టుండి రహస్యమైంది
ఆమె లేని సమయం
అతడికి శిక్షైంది
అతడికి ఉక్కపోత మొదలై
ఊపిరాడనితనమైంది
పగలు రాత్రితో సహా
సమస్త ఋుతువులూ
అతడిని ఒకేలా పలకరించాయి
అతడు నిద్రను కలవరించాడు
దిగులుదుప్పటి కప్పుకుని
ఆమెకై అంతటా గాలించాడు
ఉన్నట్టుండి ఆమె ప్రత్యక్షమైంది
ఎన్నో క్షణాల నరకం
రుచి చూసిన
అతడికి మరల శ్వాసాడింది
ఆమె అడిగింది మళ్ళీ
నేనెవరిని అని
ఆకాశమే నువ్వు
నేనందులో చిన్న చుక్కను
మాత్రమే అన్నాడతడు
కన్నీటిపర్యంతమై
ఆమె మార్దవంగా నవ్వి
అతడిని అమ్మలా
గుండెలకు హత్తుకుంది
- పద్మావతి రాంభక్త (విశాఖపట్టణం)