అక్షరాయుధ జీవి-సోమసుందర్

Advertisement
Update:2023-08-12 23:44 IST

తెలుగు కవిత్వంతో పరిచయం కలవారికి సోమసుందర్ అనగానే ‘వజ్రాయుధం’ గుర్తుకు వస్తుంది.

దొడ్డి కొమరయ్య మరణంపై రాసిన ‘ఖబడ్దార్’ కవిత దానిలో మొదటి కవితగా వచ్చింది. ఆ కవిత రేపిన సంచలనం ఎంతో తీవ్రమైనది. ‘ఖబడ్దార్ హే నిజాం పాదుషా. ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు’ అన్న వాక్యం వెంటాడే నినాదంగా హోరెత్తించింది. ఆ కావ్యం 1949లో వెలువడింది. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆ పుస్తకాన్ని నిషేధించింది. 1956లో ఆ నిషేధాన్ని ఎత్తివేశారు.

అసలు తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతుగా విద్యార్థిగానే ఉద్యమించిన కవి సోమసుందర్. ఆంధ్రరాష్ట్ర ఉద్యమానికి మద్దతుగా 1953లో ‘కాహళి’ వెలువడింది.

కవిగా సోమసుందర్ - రక్తాక్షి, మేఘరంజని, అనల కిరీటం, వెన్నెల్లో కోనసీమ - వంటి చాలా కావ్యాలూ, అనేక దీర్ఘ కవితలూ రాశారు. ‘సహజ అభ్యుదయ కవి’గా పరిగణింపబడి గౌరవాస్పదుడైనారు. శ్రీశ్రీయే సోమసుందర్ కవిత్వానికి తాను ‘దాసుడ’నని చెప్పుకున్నాడు.

సోమసుందర్ అనేక విమర్శ గ్రంథాలు, అసంఖ్యాక విశ్లేషణ వ్యాసాలు-తెలుగు సాహిత్యానికి మేలికూర్పులుగా ప్రశంసల్ని పొందాయి.

కాళిదాసు రామకథ, రుథిర జ్యోతి దర్శనం, కవిత్వం కాలాతీత కాంతిరేఖ, నూరుశరత్తులు, (సినారె) నారాయణచక్రం, కృష్ణశాస్త్రి కవితాత్మ, గురజాడ గురుత్వాకర్షణ, శేషేంద్రజాలం, నాడూనేడూ శకుంతల ఆడదే, యుగపురుషుని ప్రహసనాలు, నజ్రుల్ ఇస్లామ్, హెన్రిక్ హెయినీ, సుబ్రహ్మణ్య భారతి వంటి గ్రంథాలన్నీ సోమసుందర్ ప్రాచీన అర్వాచీన, ప్రాచ్యపాశ్చాత్య సాహిత్యాధ్యయన పటిమనీ, విస్తృతజ్ఞానవిజ్ఞాన పరిధినీ తెలుపుతాయి. ఆయనలోని పరిశీలనాశక్తి సాంద్రతతో మనల్ని అబ్బురపరుస్తాయి.

బాలగంగాధర తిలక్ కవిత్వంపై ‘అమృత వర్షిణి’ వ్యాస సంపుటి ఎంతో విశిష్టమైనది. దాని పునర్మద్రణ సమయంలో సోమసుందర్ నాకు ఫోన్ చేశారు. సృజన-తిలక్ సంస్మరణ ప్రత్యేక సంచికలో తాను రాసిన ‘అతని జ్ఞాపకాలు వాడని మల్లెలు’ వ్యాసం కాపీ పంపమని. కారణం-ఆ వ్యాసం చదివి ఎన్నడో 1966/67లో నేను ఆ వ్యాసంలో ‘నభూతోనభవిష్యతి’ అన్నరీతిలో ఆయన రాసిన యౌవనారంభ దశ మనస్తత్వ చిత్రణని మెచ్చుకుంటూ-ఆ పేరా కాపీని చాలామందికి పంపానని చెప్పటం!! ఇలాంటి సోమసుందర్ జ్ఞాపకాలు కూడా వాడనిమల్లెలే!

సోమసుందర్ నాటకకర్తకూడా. ఆయన రాసిన ‘విషవలయం’ అనేక పరిషత్తుల్లో ప్రదర్శింపబడి బహుమతుల్ని గెలుచుకుంది.

కథకుడుగా తనదైన అనుభూతి ముద్రతో, జీవితానుభవ నేపథ్యంతో ఆయన చాలా కథలు రాశారు. జర్మన్ నాటకకర్త బెర్తోల్ట్ బ్రెహ్ట్ నాటకీకరించిన ‘అమ్మ’ కు తెలుగు అనువాదాన్నీ చేశారు. ఇతర భాషలనుండీ కవిత్వానువాదాలూ ఉన్నాయి. నవలాకారుడుగా ఆయన ‘సమాగమం’ నవలని రాశారు.

సోమసుందర్ నడిపిన ‘కళాకేళి’ సాహిత్య పత్రిక ఎందరో అభ్యుదయ కవులకూ, ఔత్సాహిక యువ రచయితలకూ చైతన్యవేదికగా నిలిచింది. ప్రసిద్ధ సాహితీవేత్త లెందరో తమ విలువైన రచనల్నీ దానికి అందించారు.

ఆవంత్స సోమసుందర్ లిటరరీ ట్రస్ట్ ని ఏర్పాటు చేసి, ఆయన జన్మదినం (నవంబరు 18) నాడు వివిధ సాహిత్య ప్రకియల్లో కృషి చేస్తున్న రచయితలకు ప్రతి ఏటా పురస్కారాల్ని అందించారు. వారి చేతులమీదుగా పురస్కారాన్ని పొందిన అదృష్టవంతుల్లో నేనూ ఒకడిని! ఆ సందర్భంగా ఆహ్వానితుల పట్ల వారూ, వారికుమారులు శశికాంత్ శాతకర్ణి చూపిన శ్రద్ధ, ఆదరణ ఎంతో ఎంతో ఆత్మీయమైనవి.

సోమసుందర్ వ్యక్తిత్వంలోని ఒక విశిష్ట గుణం చిన్నా, పెద్దా, పాతా కొత్తా భేదం లేకుండా- ప్రతిభని గౌరవించటం, ఆయా ప్రతిభామూర్తుల్ని అభినందించటం. నేను రాసిన (350కి పైగా) కథల విశ్లేషణ వ్యాసాల్ని మెచ్చుకుని - ఆ వ్యాస సంపుటాలకే - ఆ ప్రక్రియా విభాగం క్రిందనే-నాకు పురస్కారాన్ని ప్రదానం చేశారు.

ఎంతోమంది రచయితల పుస్తకాలకి విలువైన విపులమైన ముందుమాటలు రాశారు. (డా.జి.వి.పూర్ణచంద్ ‘కాంతి స్వప్న’ దీర్ఘ కావ్యం సోమసుందర్ విశ్లేషణ-సాంఖ్యానికి ఒక గొప్ప భాష్యం, కొత్తచూపున్న పరామర్శ).

సోమసుందర్ గొప్ప చింతనాపరుడు. ప్రపంచ తెలుగు మహాసభలు (విజయవాడ) సందర్భంలో - మొదటి రోజు నన్ను ఆయన పక్కకి పిలిచి కూర్చోమని, నా ‘ప్రాప్తం’ కథలు బాగున్నాయని అభినందించి ఒక మాటన్నారు, ‘కోస్తా మధ్య తరగతి కుటుంబాల్లో స్వాతంత్ర్యం అనంతరం వచ్చిన, వస్తున్న ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సాంఘిక పరిణామాల్ని వస్తువుగా తీసుకుని మీరొక మంచి నవల రాయాలి. ఇది నా కోరిక. మీ జీవిత నేపథ్యం, అనుభవాల దృష్ట్యా మీరు దీనికి సమర్థులు’ అని. నేను వినమ్రంగా, ఆశ్చర్యంగా ఆయన వైపు చూస్తే ‘అవును నిజం’ అని ధ్రువీకరించారు!

ఆ ప్రయత్నం గురించి ఇప్పటికీ నాలో మేధోమధనం మాత్రమే సాగుతున్నది!

తెలుగు సాహితీలోకంలో ప్రగతిశీల రచయితల్లో మేటిగా నిలిచి, అవిరళమైన కృషితో ధాటిగా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సృజనకారుడు-సోమసుందర్! ఆయన కీర్తి అజరామరం!!  *

- విహారి

Tags:    
Advertisement

Similar News