అక్షరాలతో ప్రేమలో పడగానే
శిలగా మారిపోతాను !
ఆలోచనల ఉలితో
నగిషీలు చెక్కుకుంటూ
భావ శిల్పాన్నవుతాను !!
అనుక్షణం అక్షర యజ్ఞం చేసి,
సృష్టి అణువణువున చేరి
కవిత్వాన్ని సృజిస్తాను
ఆకలితో వున్నప్పుడు
అమ్మ చేతిలోని అమృతభాండంగా మారిపోతాయి అక్షరాలు
ఆవేశం ఆనందం అనుభవాలుగా మారి అనుభూతిని అందిస్తాయి..
ఒంటరి వాడిని అసలే కాను,
అక్షరాలు నాన్నలా
నిర్దేశిస్తూనే ఉంటాయి..
వడివడిగా అడుగులేసి తడబడి పడిపోనీక నడవడికను నేర్పుతాయి..
అప్పుడప్పుడు కలలు కల్లలయి
కన్నీటి వరద ముంచెత్తినప్పుడు
పరిమితులు లేని పరిభ్రమణంలో అనంత సత్యాలు పరిష్కృతమవుతాయి !
కళ్ళముందు కన్నీటి దృశ్యాలు
గుండెని కదిలిస్తుంటాయి..
ఆక్రందనలు, ఆక్రోశాలు
కట్టి కుదిపేస్తుంటాయి..
నిస్సహాయత నిలబడిచూస్తుంది !
విచక్షణ విలవిలలాడుతుంది..
అనునిత్యం కవితాత్మ
నన్ను శోధిస్తూనే ఉంటుంది !
అప్పుడు మళ్ళీ అక్షరాలు
తట్టి లేపుతాయి..
మనసు మౌనాన్ని బద్దలు కొడుతూ చైతన్యం ఊపిరి పోసుకుంటుంది..
ఓటమిని గెలిచే ప్రయత్నంలో కొత్త పాటలు రాసుకుంటాను..
బాటలని వంతెనలని
నేనే నిర్మించుకుంటాను !
స్నేహగీతాలని
నిరంతరం ఆలపిస్తాను
రెండు చేతుల నిండా అవధులు లేని ప్రేమధారలని పంచిపెడతాను..
ప్రకృతి ఆకృతికి
మానవతా సుగంధాలని అద్దుతాను.
శూన్యాన్ని పూర్ణం చేసి పరిమళింపచేస్తాను!
ప్రపంచపటంలో
ఏదో ఒక అక్షాంశంలో నివసిస్తాను
అక్షరాల చెలిమితో
విశ్వమానవుడిని అవుతాను..!
నన్ను నేను నిరంతరం
కొత్తగా ఆవిష్కరించుకుంటాను..!!
ఆకెళ్ల సూర్యనారాయణమూర్తి