మనిషిపై మనిషి స్వారీ
ఓడించటం హింసించటం
శిక్షించటం భక్షించటం
యుగయుగాలుగా యిదే దారి !
గడిచిన సరిగమల్లో దిగి
పల్లవి అనుపల్లవి వింటే
పంచభూతాల ప్రతిక్రియలు
నేటికీ నిత్యక్రియలు!
విలయ తాండవమై
వరుణుడి కుంభవృష్టి
పలుదారుల్లో ప్రవహించి
పల్లం ముంపై
ప్రజలకు హాని!
ఆరంతస్తుల మేడ
అభేద్యమై
అగ్నిదేవుని పాచిక పారక
క్రోధాగ్నికి
ఒంటి నిట్టాడు గుడెశెలు
భస్మమై అగ్నికి ఆహారం!
ఫల పుష్పాలతో
మహా వృక్షాలు
భూమికి సంపదలు
కూకటి వేళ్ళతో పెకలించిన
వాయుదేవుని విధ్వంసం!
కనుల పండువగా
మేఘ మాలికలు సందోహమై
తిరుగుతూ
ఒక భూమి అస్పృశ్యమై
ఒక నేల స్పృశ్యమై
వర్షిస్తూ ఎండగడుతూ
సాగుతున్న పాలన
పంచ భూతాలు
బృందగానమై
చరమక్రియ రాగం
ఆలపిస్తుంటే
అనాదిగా
ఆదితాళమై మానవుడు!
-అడిగోపుల వెంకటరత్నం
Advertisement