పితృ పితామహ ప్రపితామహానాం ...

Advertisement
Update:2023-06-18 10:20 IST

పితృ పితామహ ప్రపితామహానాం ...

వసు, రుద్ర, ఆదిత్య

రూపాల్లో మూడు తరాల వారితో

ఋణానుబంధం తీర్పించుకునే

స్వార్థపరులు కారు

నాన్నా, తాతా, ముత్తాతా

కారణ జన్ములు కాకపోయినా

మన జన్మ కారకులు

చిన్నవో, పెద్దవో

ఇంటనో, మింటనో

మనం సాధించిన విజయాలకు

ప్రేరకులూ, ఉత్ప్రేరకులూ

వీక్షకులూ, ప్రేక్షకులూ

పాఠకులూ, ప్రోత్సాహకులూ

జీవిత గమన నిర్దేశకులూ

నాన్నా, వాళ్ళ నాన్నా

ఆ పై నాన్నలందరూ ...

అందుకే నా ఛాతీ మీద బలంగా

పట్టుకున్న ఆయన కుడి ఎడమ

చేతుల వెచ్చని బొటన వేళ్ళ

అనురాగం

నా గుండె లోతుల్ని తాకింది

నేను నా చిన్ని పాదాలతో

సుతిమెత్తగా తంతూ ఆడుకున్న

ఆ విశాల హృదయం

నా బోసి నవ్వులకు వికసించింది

నా విజయాలకు ఉప్పొంగింది

నాకు దెబ్బ తగిలితే విలవిలలాడింది

నాకు అపజయమెదురైతే

భయ విహ్వలమైంది

కనిష్ఠికనందించి మార్గదర్శనం

చేసిన నాన్న

నా నుంచి

వీడ్కోలు అందుకున్న రోజున

నిర్వికారంగా నిర్మలంగా నిబ్బరంగా

యోగముద్ర లో

శాశ్వతంగా నిద్రించిన

గంభీర గౌరవ మూర్తి ...

నడకలోనూ, నడతలోనూ

మాట లోనూ, మమత లోనూ

ధైర్యం, శౌర్యం

కొండొకచో క్రౌర్యం

నేర్పిన ఓ తండ్రీ ...

శాశ్వతంగా నా గుండెల్లో

నా నీడ లా, నాతోనే

వెన్నంటి ఉండమని

కోరుతూ ...

నిత్యం, నిరంతరం

ఇదమిదమాసనం

హృదయాసనం

స్వాగతం, సుస్వాగతం ...

- సాయి శేఖర్

Tags:    
Advertisement

Similar News