మేం ఓడిపోయాం.. మీరు మోసపోయారు

తమకంటే ప్రజలే ఎక్కువ బాధపడాల్సి వస్తుందని, ఐదేళ్లపాటు వారు మోసపోతూనే ఉంటారని చెప్పారుమాజీ ఎమ్మెల్యే రాచమల్లు. మోసపోయిన ప్రజల పక్షాన తాము పోరాటం చేస్తామని, తమకు వారు నైతిక మద్దతు ఇవ్వాలని కోరారు.

Advertisement
Update:2024-07-01 07:29 IST

ఏపీలో ఓడిపోయిన వైసీపీ నేతల కంటే.. మోసపోయిన ప్రజలే ఎక్కువ బాధలు పడతారని అన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తాము కేవలం ఓడిపోయామని, కానీ రాష్ట్ర ప్రజలు కూటమికి ఓటు వేసి మోసపోయారన్నారు. పెన్షన్ల పంపిణీ విషయంలో తొలి మోసం జరిగిందని అంటున్నారాయన. కేవలం వృద్ధులకు మాత్రమే మూడు నెలల పెన్షన్ బకాయిలు ఇస్తున్నారని, వికలాంగులకు, ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారిని సీఎం చంద్రబాబు మోసం చేశారంటున్నారు. వారికి కేవలం పెరిగిన పెన్షన్ ఇస్తున్నారని, బకాయిలు మాత్రం ఇవ్వట్లేదని చెప్పారు రాచమల్లు.


రెండో మోసం యువతకు జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు. గత వైసీపీ ప్రభుత్వం 6వేల టీచర్ పోస్ట్ లకు ఆల్రడీ నోటిఫికేషన్ ఇచ్చిందని, కేవలం 10వేల పోస్ట్ లు పెంచి మొత్తం 16వేల ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం భర్తీ చేస్తామంటోందని చెప్పారు. ఏపీలో 50వేల టీచర్ పోస్ట్ లు ఖాళీగా ఉంటే కేవలం 16వేల పోస్ట్ లు మాత్రమే భర్తీ చేస్తామనడం న్యాయమేనా అని ప్రశ్నించారాయన. తన నియోజకవర్గంలో నిరుద్యోగులంతా ప్రత్యర్థికి ఓటు వేసి, తనను ఓడించారని, ఇప్పుడు వారంతా కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయారని అన్నారు. వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పి ఇప్పుడు సచివాలయ ఉద్యోగులతోనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని, అంటే వారిని కూడా చంద్రబాబు మోసం చేసినట్టేనని తేల్చి చెప్పారు రాచమల్లు.

మోసపోయిన ప్రజల పక్షాన తాము పోరాటం చేస్తామని, తమకు వారు నైతిక మద్దతు ఇవ్వాలని కోరారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు. తమకంటే ప్రజలే ఎక్కువ బాధపడాల్సి వస్తుందని, ఐదేళ్లపాటు వారు మోసపోతూనే ఉంటారని చెప్పారు. ప్రజల తరపున శాంతియుత పోరాటాలకు తాము సిద్ధమవుతున్నామని, తమకు నైతిక బలం ఇస్తే చాలని చెప్పుకొచ్చారు. ప్రజలు ఓడించినా, నిజాయితీగా వారికోసం తాము పనిచేస్తామని అంటున్నారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. 

Tags:    
Advertisement

Similar News