వైశ్రాయ్ ఎపిసోడ్‌కి నేనే ప్రత్యక్ష సాక్షి.. బాబు పరువు తీసిన వైసీపీ ఎమ్మెల్యే...
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా అప్పుడు చంద్రబాబు వైపు చేరిపోయారని, బాలకృష్ణకి కూడా ఆ పాపంలో వాటా ఉందన్నారు ఎమ్మెల్యే ప్రసన్న. కుటుంబ సభ్యులంతా కలసి ఎన్టీఆర్‌ని మానసికంగా చంపేశారని చెప్పారు.
అన్ స్టాపబుల్ కార్యక్రమం పేరుతో వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్‌ని చంద్రబాబు అనవసరంగా కదిలించినట్టయింది. అప్పటి తప్పుని కవర్ చేసుకోడానికి చేసిన ఈ కార్యక్రమం ఇప్పుడు కొత్తగా మరింత మంది నోళ్లలో నానుతోంది. ఇప్పటికే వైసీపీ నుంచి ఓ రేంజ్‌లో కౌంటర్లు పడుతున్నాయి. ఈ కౌంటర్లన్నీ పక్కనపెడితే అప్పుడు ఎన్టీఆర్‌తో ఉన్న ఎమ్మెల్యే, ఆ ఎపిసోడ్‌కి ప్రత్యక్ష సాక్షిని తానేనంటూ బయటకొచ్చారు. చంద్రబాబు పరువు తీసేశారు.
చంద్రబాబు టీడీపీని హస్తగతం చేసుకునే టైమ్‌లో ఎన్టీఆర్ పక్కనే ఆయనకు అండదండగా ఉన్న ఎమ్మెల్యేలలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒకరు. ఆయన ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. నల్లపురెడ్డి కుటుంబంతో ఎన్టీఆర్‌కి సన్నిహిత సంబంధాలున్నాయి. ఎన్టీఆర్ హయాంలో నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి మంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఆ తర్వాత టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్‌లో ఆయన వెంట మిగిలిపోయిన 14 మందిలో ప్రసన్న కూడా ఒకరు. దీంతో ఆయన అక్కడ జరిగిన విషయాలను పూసగుచ్చినట్టు వివరించారు. అన్ స్టాపబుల్ కార్యక్రమంలో చెప్పుకుంటున్నట్టు ఆ రోజు ఎన్టీఆర్ కాళ్లు పట్టుకోలేదని అసలు ఆయనతో మాట్లాడలేదని, బతిమిలాడలేదని చెప్పుకొచ్చారు. ఒకవేళ నిజంగా చంద్రబాబు కాళ్లు పట్టుకుని ఉంటే, అది ఆయన్ని ఒప్పించడానికి కాదని, కాళ్లు పట్టుకుని కిందపడేయడానికేనంటూ సెటైర్లు పేల్చారు.
ఆనాడు వైశ్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్‌పై చెప్పులు, రాళ్లు వేయించారని చెప్పుకొచ్చారు ప్రసన్న కుమార్ రెడ్డి. ఆ తప్పులో అందరికీ భాగస్వామ్యం ఉందన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా అప్పుడు చంద్రబాబు వైపు చేరిపోయారని, బాలకృష్ణకి కూడా ఆ పాపంలో వాటా ఉందన్నారు. కుటుంబ సభ్యులంతా కలసి ఎన్టీఆర్‌ని మానసికంగా చంపేశారని చెప్పారు ప్రసన్న.
చంద్రబాబు ఓ పథకం ప్రకారం ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్నారని, ఈనాడు సాయంతో ఎమ్మెల్యేలంతా బాబు వెంటే ఉన్నారంటూ తప్పుడు వార్తలు రాయించారని, అది చూసి ఒకరి వెంట ఒకరు అపోహపడి చంద్రబాబు దగ్గరకు వెళ్లారని చెప్పుకొచ్చారు ప్రసన్న. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచిన పాపం తగిలి ఇప్పుడు చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలతో చరిత్రలో ఎప్పుడూ లేని ఓటమిని అనుభవిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు సీఎం అయ్యాక పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాల్లో ఎన్టీఆర్ ఫొటోని కూడా తీసేయించారని, అలాంటి దుర్మార్గుడు చంద్రబాబు అంటూ ఆనాటి సంగతులు గుర్తు చేసుకున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి.