నెల్లూరు వైసీపీలో కోటంరెడ్డి అలక..

రెండోసారి మంత్రి వర్గంలో పేరు లేకపోవడంతో శ్రీధర్ రెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తి బయటపెట్టారు. అనుచరులు రచ్చ చేసినా వారిని సముదాయించారు, అధిష్టానం గీచిన గీత దాటలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో మరోసారి ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కారు.

Advertisement
Update:2023-01-23 21:49 IST

నెల్లూరు వైసీపీలో కోటంరెడ్డి అలక..

2024 ఎన్నికలకు సమయం దగ్గరపడేకొద్దీ వైసీపీలో అలకలు పెరుగుతున్నాయి. పార్టీకి మొదటినుంచీ నమ్మకస్తులు, పైగా జగన్ కి నమ్మినబంటులు, జనంలోకి వెళ్తే తమ పేరుకంటే జగన్ పేరు, పార్టీ పేరే ఎక్కువగా చెప్పుకునే నేతలు... అలాంటి వారు కూడా పార్టీపై అలకతో ఉన్నారు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల పలుమార్లు తన అసంతృప్తిని బహిరంగ వేదికలపైనే ప్రదర్శించారు. మంత్రి పదవి రాకపోవడం ప్రధాన కారణం అయితే.. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అధికారుల సహకారం లేకపోవడం మరో కారణం. వీటన్నిటికీ తోడు ఆయన తర్వాత పార్టీలోకి వచ్చినవారు, ఆయన ద్వారా పార్టీలోకి వచ్చినవారు ఉన్నత స్థానాలకు వెళ్తున్నారు, ఆయన మాత్రం అక్కడే ఉండిపోయారు.

ఎవరీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..?

రాజకీయ నేపథ్యం లేకపోయినా స్టూడెంట్ లీడర్ గా ఎదిగి వరుసగా రెండుసార్లు నెల్లూరు రూరల్ లో వైసీపీ తరపున విజయకేతనం ఎగురవేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అప్పట్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా వెంకటగిరిలో వైఎస్ రాజారెడ్డి సభ పెడితే జన సమీకరణతో లైమ్ లైట్ లోకి వచ్చిన నాయకుడు శ్రీధర్ రెడ్డి.

ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో, ఆయన తర్వాత జగన్ తో అదే అనుబంధం కొనసాగించారు. తాను గెలిచి పార్టీ ఓడిపోయినా, 2014 తర్వాత టీడీపీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా జగన్ నే నమ్ముకుని ఉన్నారు. గడప గడప అనే రాష్ట్రవ్యాప్త కార్యక్రమానికి ముందే శ్రీధర్ రెడ్డి.. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లేవారు.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక తొలి దఫా మంత్రి పదవి దక్కుతుందేమోనని ఆశించారు. పార్టీలో తనకంటే జూనియర్, తన తర్వాత వచ్చిన అనిల్ కి పదవి ఇచ్చినా సరిపెట్టుకున్నారు. రెడ్డి సామాజిక వర్గంలో మేకపాటి కుటుంబానికి పదవి వెళ్లిపోతే సర్దిచెప్పుకున్నారు.

రెండో దఫా అయినా ఛాన్స్ దొరుకుతుందనుకుంటే ఆ అవకాశం కాకాణి గోవర్దన్ రెడ్డికి వెళ్లిపోయింది. వాస్తవానికి గోవర్దన్ రెడ్డిని జగన్ కి పరిచయం చేసింది, పార్టీలో సపోర్ట్ చేసింది కూడా శ్రీధర్ రెడ్డే. వారిద్దరూ బంధువులు కూడా. కానీ సమీకరణాలు మారిపోయి కాకాణికి మంత్రి పదవి వరించినా శ్రీధర్ రెడ్డి సైలెంట్ గానే ఉన్నారు.

అవకాశం ఎప్పుడు..?

రెండోసారి మంత్రి వర్గంలో తన పేరు లేకపోవడంతో శ్రీధర్ రెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తి బయటపెట్టారు. అనుచరులు రచ్చ చేసినా వారిని సముదాయించారు, అధిష్టానం గీచిన గీత దాటలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో మరోసారి ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కారు. నెల్లూరులో పేరుగొప్ప పెద్ద రాజకీయ కుటుంబాలన్నీ తన గొంతు కోయాలని చూసినా తాను ఒంటరిగా నిలబడ్డానని ఇటీవల ఓ మీటింగ్ లో చెప్పుకొచ్చారు శ్రీధర్ రెడ్డి.

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొత్తగా సీటుకోసం కొంతమంది ప్రయత్నాలు చేయడం, గతంలో ఆయన మద్దతు తీసుకున్నవారే ఇప్పుడు ఆయనక వ్యతిరేకంగా అధిష్టానానికి దగ్గరవ్వాలని చూడటంతో శ్రీధర్ రెడ్డి వర్గం మరింత అసంతృప్తితో ఉంది.

ఇటీవల సీఎం జగన్ శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డికి సేవాదళ్ రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. ఒకరకంగా శ్రీధర్ రెడ్డికి జగన్ ప్రాధాన్యమిస్తున్నట్టు అనిపిస్తున్నా మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి అయితే ఆయనలో మిగిలే ఉందని అంటున్నారు.

పార్టీకి లాభమా..? నష్టమా..?

ఇప్పటికే నెల్లూరులో ఆనం కుటుంబం వైసీపీకి దూరమైంది. అనిల్ కి బంధువుల్లోనే వ్యతిరేక వర్గం పుట్టుకొచ్చింది. గౌతమ్ రెడ్డి మరణం తర్వాత మేకపాటి కుటుంబం పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది.

ఈ దశలో శ్రీధర్ రెడ్డి అలక పార్టీకి మంచిది కాదనే వాదన వినపడుతోంది. 2024 ఎన్నికలనాటికి నెల్లూరు జిల్లాలో పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏ మలుపు తిరుగుతాయనేది తేలాల్సి ఉంది. 

Tags:    
Advertisement

Similar News