జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరిన నటి మాధవీలత.. నేను రాయలసీమ బిడ్డనే
టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్, 'మా'కు నటి మాధవీలత ఫిర్యాదు చేశారు.
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్ 'మా'కు నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. సినిమాలో నటిస్తున్న మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన ప్రభాకర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని మా ట్రెజరర్ శివ బాలాజీకి మాధవీలత వినతి పత్రం అందించారు. గతేడాది డిసెంబర్ 31న జేసీ పార్కులో నిర్వహించిన న్యూ ఇయార్ వేడుకలపై మాధవీలతతో పాటు మరో బీజేపీ నేత సాధినేని యామిని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి అభ్యంతకరమైన పదాలతో దూషించడం విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. దాంతో జేసీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో పాటు వారికి క్షమాపణలు కూడా చెప్పారు. ఇప్పుడు మాధవీలత ఫిర్యాదుతో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది.
జేసీ ప్రభాకర్‌రెడ్డి క్షమాపణ చెబితే సరిపోదని మాధవీలత తెలిపారు. ఆయనపై న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై సినిమా పరిశ్రమ స్పందించకపోవడంతోనే ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేసినట్లు నటి పేర్కొన్నారు. నేను కూడా రాయలసీమ గడ్డ మీదనే పుట్టి, రాగి సంగటి, నాటు కోడి తినే పెరిగానని మాధవీలత, జేసీని హెచ్చరించింది. నేను బ్రతుకు తెరువు కోసం సినిమా ఇండస్ట్రీ కి రాలేదని… నాకు సినిమాల్లో నటించడం ఫ్యాషన్‌తో వచ్చానని తెలిపారు.