ట్యాబ్‌లు ఇవ్వటం జగన్ తప్పా..?
బైజూస్ కంటెంట్ అత్యున్నత ప్రమాణాలతో ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. ఇలాంటి కంటెంటును ఎవరైనా కొనాలంటే ఏడాదికి లక్ష రూపాయలు ఖర్చుచేయాలి.
అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాల ఆధారంగా విద్యార్థులందరికీ టీచర్లు పాఠాలు బోధించాలన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అందుకనే కోట్ల రూపాయలు ఖర్చుచేసి బైజూస్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీని ఆధారంగా సుమారు 6 లక్షల మంది విద్యార్థులకు, టీచర్లకు బైజూస్ కంటెంట్ ఉన్న ట్యాబులను అందించింది. టీచర్లు ఈ ట్యాబుల ఆధారంగానే పాఠాలు చెబుతున్నారు. విద్యార్థులు కూడా ట్యాబుల ఆధారంగానే పాఠాలను ఫాలో అవుతున్నారు. ప్రభుత్వ ప్రయత్నాన్ని ఎంతోమంది విద్యావేత్తలు, మేథావులు అభినందించారు.
అయితే ఎల్లోమీడియాకు మాత్రం ఏపీ ప్రభుత్వ ప్రయత్నం ఏమాత్రం నచ్చలేదు. ఎలాగైనా ఈ పథకాన్ని దెబ్బకొట్టాలని కంకణం కట్టుకున్నట్లుంది. అందుకనే ‘జగన్ బర్త్ డే బహుమతి.. చెడగొడుతోంది మతి’ అనే హెడ్డింగుతో ఒక కథనం అచ్చేసింది. ఆ కథనంలో విద్యార్థులు ట్యాబ్‌లను చదువుల కోసమే కాదట ఆన్ లైన్లో గేములు ఆడుకునేందుకు, ఇతర వీడియోలు చూసేందుకు ఉపయోగిస్తున్నట్లు రాసింది. పిల్లలు వీడియోగేములు ఆడటం, ఇతర వీడియోలు చూస్తుండటంతో తల్లిదండ్రులు గోల చేస్తున్నారట.
నిజానికి ప్రభుత్వం పిల్లలకు ట్యాబులు ఇచ్చేటప్పుడే సిలబస్ కంటెంటు తప్ప ఇతరత్రా చూసేందుకు వీల్లేకుండానే అన్నింటినీ లాక్ చేసిచ్చింది. అయితే ఎక్కడైనా కొందరు ఆ లాక్‌ను ఏదో పద్ధతిలో ఓపెన్ చేస్తే చేయొచ్చు. అంతమాత్రాన పిల్లలకు ట్యాబులు వద్దు వెనక్కి తీసుకోమని తల్లిదండ్రులు గోలచేస్తున్నారని రాయటమే విచిత్రంగా ఉంది. ప్రభుత్వం పిల్లలకు ట్యాబులు ఇవ్వకపోతే పిల్లలు పెద్దవాళ్ళ మొబైల్స్ తీసుకుని ఆన్ లైన్ గేములు ఆడరా..?
బైజూస్ కంటెంట్ అత్యున్నత ప్రమాణాలతో ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. ఇలాంటి కంటెంటును ఎవరైనా కొనాలంటే ఏడాదికి లక్ష రూపాయలు ఖర్చుచేయాలి. అలాంటిది ప్రభుత్వం లక్షల మంది పిల్లలకు ఉచితంగా అందిస్తోంది. ప్రతిరోజూ ఒక ఫిర్యాదు వస్తోందని ఎల్లోమీడియా ఆరోపించటమే ఆశ్చర్యంగా ఉంది. 6 లక్షలమంది పిల్లలు ట్యాబులను ఉపయోగిస్తున్నప్పుడు ఎక్కడో ఒకచోట ఫిర్యాదు రావటం ఎల్లోమీడియాకు పెద్ద తప్పుగా కనబడింది. మొత్తంమీద ఎల్లోమీడియా కథనంలో తేల్చిదేమిటంటే.. పిల్లలకు ట్యాబుల ద్వారా పాఠాలు చెప్పించటం జగన్ తప్పని.