టీచర్ ఆత్మహత్యకు జగన్‌కు ఏమన్నా సంబంధముందా..?

ఉరవకొండ మండల పరిషత్ స్కూల్‌లో మల్లేష్ అనే ఎస్జీటీ టీచర్ పనిచేస్తున్నాడు. ఆయన ఆదివారం ఆత్మహత్యకు ప్రయత్నించారు. అందుకు ఆయన చెప్పిన కారణాలు ఏమిటంటే.. సీపీఎస్ రద్దుకు జగన్ హామీఇచ్చి చేయలేదట.

Advertisement
Update:2023-12-11 09:47 IST

ఒక టీచర్ ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఎల్లోమీడియా జగన్మోహన్ రెడ్డికి చుట్టేసి నానా రచ్చచేస్తోంది. తన ఆత్మహత్యాయత్నానికి టీచర్ చెప్పిన కారణాలు వ్యక్తిగతంలాగే కనబడుతోంది. అయితే జగన్ మాటతప్పిన కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు టీచర్ వాట్సప్‌లో సమాచారం పెట్టగానే ఎల్లోమీడియా దాన్ని ప్రముఖంగా మొదటిపేజీల్లో అచ్చేయటమే ఆశ్చర్యంగా ఉంది. జగన్‌కు వ్యతిరేకంగా ఏ చిన్న ఘటనా జరిగినా.. ఎల్లోమీడియాకు పండగే కదా. అదే పద్దతిలో ఇప్పుడు టీచర్ ఆత్మహత్యాయత్నాన్ని కూడా బాగా హైలైట్ చేసి రాజకీయం చేస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే.. ఉరవకొండ మండల పరిషత్ స్కూల్‌లో మల్లేష్ అనే ఎస్జీటీ టీచర్ పనిచేస్తున్నాడు. ఆయన ఆదివారం ఆత్మహత్యకు ప్రయత్నించారు. అందుకు ఆయన చెప్పిన కారణాలు ఏమిటంటే.. సీపీఎస్ రద్దుకు జగన్ హామీఇచ్చి చేయలేదట. 1వ తేదీన జీతాలు వేయటంలేదట. 5వ తేదీలోగా జీతాలు వేస్తే బాగుంటుందట. ఉద్యోగులను జగన్ అణగదొక్కేస్తున్నారట. ఉద్యోగుల విషయాల్లో చంద్రబాబు నాయుడే నయమని మల్లేష్ అభిప్రాయపడ్డారట.

పీఆర్సీ కూడా జగన్ ప్రభుత్వం సరిగా ఇవ్వటంలేదని మల్లేష్ బాధపడిపోయారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇందులో ఏ ఒక్క కారణం కూడా టీచర్ ఆత్మహత్యయత్నానికి సరైన కారణంగా కనిపించటంలేదు. టీచర్ ఆత్మహత్యకు కారణం పూర్తిగా వ్యక్తిగతమే. ఎలాగంటే సీపీఎస్ రద్దవుతుందని లక్షల రూపాయలు అప్పులుచేసి మల్లేష్ పందేలుకట్టి పోగొట్టుకున్నాడు.

కుటుంబ పోషణకు, అప్పులు చెల్లించటానికి చిట్టీలు వేయటమే కాకుండా బ్యాంకుల్లో, లోన్ యాప్‌ల్లో అప్పులు తీసుకున్నాడు. లోన్ యాప్‌లో అప్పులు తీసుకుంటే.. వ్యవహారం ఎలాగుంటుందో అందరికీ తెలిసిందే. తీసుకున్న అప్పులు, కట్టాల్సిన అసలు, వడ్డీలు కొండంతంగా పెరిగిపోయి వాటిని తీర్చేదారిలేక చివరకు ఆత్మహత్యాయత్నం చేశాడు. సీపీఎస్ రద్దు మీద పందేలు కట్టమని టీచర్‌కు జగన్ చెప్పారా..? పందేలు కాయటం కోసం లక్షల్లో అప్పులు చేయమని జగన్ చెప్పారా..? నిజానికి సీపీఎస్‌ను ప్రభుత్వం నాలుగు నెలల క్రితమే రద్దుచేసింది. అయినా సీపీఎస్ రద్దుచేయలేదని చెప్పి సుమారు రూ.70 వేల జీతం తీసుకుంటున్న మల్లేష్ ఆత్మహత్యాయత్నం చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

జగన్ పరిపాలన నచ్చకపోతే వ్యతిరేకంగా ఓటు వేస్తారు. ఎందుకంటే సీపీఎస్ రద్దు, 1వ తేదీన జీతాలు పడకపోవటం, పీఆర్సీ అన్నది ఒక్క మల్లేష్‌కు మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఫైనాన్షియల్ ఇన్ డిసిప్లిన్ కారణంగా అప్పులుచేసి తీర్చలేక ఆత్మహత్యకు ప్రయత్నించి దాన్ని జగన్ ప్రభుత్వానికి చుట్టేశారు. కోతికి కొబ్బరికాయ దొరికినట్లు మల్లేష్ వ్యవహారాన్ని ఎల్లోమీడియా కొండంతలుచేసింది.

Tags:    
Advertisement

Similar News