దేశంలో అతిపెద్ద స్కామ్‌.. మార్గదర్శి కుంభకోణమే

మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అగ్నిప్రమాద ఘటనపై నిజానిజాలు తేల్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో తమ పాత్ర ఉంటే ఆధారాలు చూపాలని మూడుసార్లు సవాల్‌ విసిరినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

Advertisement
Update:2024-08-22 09:25 IST

దేశంలో అతి పెద్ద స్కామ్‌ మార్గదర్శి కుంభకోణమేనని వైసీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి తెలిపారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా మార్గదర్శిని తప్పుపట్టిందని ఆయన గుర్తుచేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఈనాడు తప్పుడు కథనాలను అచ్చేస్తోందని, వాటిపై కనీసం తమ వివరణ కూడా తీసుకోకుండా దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

తప్పుడు కథనాలు ప్రచురించిన ఈనాడుపై పరువు నష్టం దావా వేస్తూ తాము నోటీసులిచ్చామని, అప్పటి నుంచి సినిమాలో ఫ్యాక్షన్‌ విలన్ల తరహాలో తమను చిత్రీకరిస్తూ తప్పుడు కథనాలు అచ్చేస్తోందని మిథున్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అగ్నిప్రమాద ఘటనపై నిజానిజాలు తేల్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో తమ పాత్ర ఉంటే ఆధారాలు చూపాలని మూడుసార్లు సవాల్‌ విసిరినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. తమకు వందలు, వేల ఎకరాల భూములు ఉన్నాయని మంత్రులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసిందని మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు. హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ.. వాటినే తమకు అనుకూలమైన పత్రికలు, ఛానళ్ల ద్వారా దుష్ప్రచారం చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News