టీడీపీ మ్యానిఫెస్టోపై వైసీపీ ప్రచారమా?
గుంటూరు కాలేజీలో సదస్సు నిర్వహించబోతున్నట్లే రాష్ట్రవ్యాప్తంగా చర్చావేదికలు, కాలేజీల్లో సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో 2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీల్లో తమ ప్రభుత్వం ఎన్ని అమలుచేసిందనే విషయాలను కూడా వివరించబోతున్నారు.
వినటానికి విచిత్రంగా ఉన్న వాస్తమైతే ఇదే. రాజమండ్రి మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రకటించిన మొదటి విడత మ్యానిఫెస్టోను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు టీడీపీ మ్యానిఫెస్టోపై జనాల్లో చర్చలు జరిగేట్లు చూడాలన్నారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆధ్వర్యంలో గుంటూరు హిందూ కాలేజీ సెమినార్ హాలులో టీడీపీ మ్యానిఫెస్టోపై ఆదివారం సదస్సు నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో మర్రి రాజశేఖర్, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొంటారు.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏ విధంగా మోసపూరితమైనవో జనాలకు వివరించాలని జగన్ ఆదేశించారు. 2014లో టీడీపీ ప్రకటించిన మ్యానిఫెస్టోను ఈ సందర్భంగా వైసీపీ నేతలు గుర్తు చేయబోతున్నారు. అప్పట్లో ఇచ్చిన హామీలేమిటి? అవి ఎంతవరకు అమలు జరిగాయి అనేది కీలకమైన చర్చ. మధ్యలోనే మ్యానిఫెస్టోను టీడీపీ వెబ్‌సైట్ నుండి ఎందుకు మాయం చేశారో కూడా వైసీపీ నేతలు జనాలకు వివరించబోతున్నారు.
టీడీపీ నేతలు జనాల్లోకి వచ్చినప్పుడు 2014 మ్యానిఫెస్టోలోని హామీలను ఎంతవరకు అమలుచేశారు? పార్టీ వెబ్‌సైట్ నుండి ఎందుకు మాయం చేశారో చెప్పమని నిలదీయాలని చెప్పబోతున్నారు. మ్యానిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏ విధంగా మోసపూరితమో జనాలకు వైసీపీ నేతలు వివరించబోతున్నారు. గతంలో ఇచ్చిన హామీలను అమలుచేయని చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో గెలిస్తే ఏ విధంగా అమలుచేస్తారో ఆలోచించాలని జనాలను వైసీపీ నేతలు కోరబోతున్నారు.
గుంటూరు కాలేజీలో సదస్సు నిర్వహించబోతున్నట్లే రాష్ట్రవ్యాప్తంగా చర్చావేదికలు, కాలేజీల్లో సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో 2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీల్లో తమ ప్రభుత్వం ఎన్ని అమలుచేసిందనే విషయాలను కూడా వివరించబోతున్నారు. జగన్ ఇచ్చిన హామీలేమిటి? అమలుచేసినవి ఏమిటి? అనే విషయాలను పాయింట్ బై పాయింట్ జనాలకు అధికార పార్టీ నేతలు వివరించబోతున్నారు. మ్యానిఫెస్టో పేరుతో జనాలను మోసం చేయటానికి రెడీ అవుతున్న చంద్రబాబు పట్ల జనాలను అప్రమత్తం చేయటమే వైసీపీ ఉద్దేశమని డొక్కా చెప్పారు. మరి దీని ఫలితం ఎలాగుంటుందో చూడాల్సిందే.