ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రారంభం
నగరంలోని కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో నేటి నుంచి రెండు రోజుల పాటు జరిగనున్న ఈ వేడుకలు
మాతృభాషను భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా.. ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటలకు సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మహాసభలను ప్రారంభించారు. జస్టిస్ ఎన్వీ రమణ, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అంతకుముందు వీరు తెలుగు తల్లి విగ్రహానికి అంజలి ఘటించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి, మండలి బుద్ధ ప్రసాద్, విశ్వహిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో నేటి నుంచి రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకల కోసం దేశవిదేశాల నుంచి 1500 మందిపైగా ప్రతినిధులు విజయవాడకు తరలివచ్చారు. కవులు, రచయితలు, భాషాభిమానులు, ముఖ్య అతిథుల రాక శుక్రవారం నుంచి ఆరంభమైంది. పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణలోని చెరుకూరి రామోజీరావు ప్రధాన వేదికతో పాటు రెండు వేదికలనూ.. సదస్సులు, కవితా, సాహిత్య సమ్మేళనాల కోసం సిద్ధం చేశారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణా జిల్లా రచయితల సంఘం, కేబీఎన్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు.