ఏపీలో ఎన్నికలకు ముందే పవన్ కల్యాణ్ బలమేంటో తేలిపోతుందా?
ఈ మధ్య ఏపీలో ఎక్కడ మాట్లాడినా జనసేన ఓటు బ్యాంకు పెరిగిందని గోల చేస్తున్నారు. తెలంగాణలో కూడా పార్టీ బలంగా ఉందంటున్నారు. మరెక్కడ బలంగా ఉందో పవన్‌కు తప్ప ఇంకెవరికీ అర్థంకావటంలేదు. అందుకనే ఎన్నికల్లో పోటీ చేస్తేనే జనసేన ఎంతబలంగా ఉందనే విషయం బయటపడుతుంది. దాన్నిబట్టి ఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభావంపై ఒక అంచనాకు రావచ్చు.
జనసేన కథ ఏంటో తొందరలోనే తేలిపోతుందా? పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు విన్నతర్వాత అందరికీ ఇలాగే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే తొందరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయబోతోందని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉందికానీ ఎన్నికల్లో జనసేన ఎవరితోనూ పొత్తు పెట్టుకోవటంలేదని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికలను ఒంటరిగానే ఎదుర్కొని పార్టీ సత్తా ఏమిటో చూపిస్తుందని చెప్పారు. ఈ మాటతోనే అందరికీ అనుమానం పెరిగిపోతోంది.
నిజానికి జనసేన సత్తా ఏమిటో చూడాలని రాజకీయ పార్టీలతో పాటు మామూలు జనాలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పట్టుమని పది నియోజకవర్గాల్లో కూడా ఇన్‌చార్జిలను నియమించుకోలేని పవన్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏపీలో అధికారం జనసేనదే అని పదేపదే చెబుతున్నారు. టీడీపీతో పొత్తులేనిదే ఎన్నికల్లో పోటీచేసేంత ధైర్యంలేని పవన్ రాబోయేది జనసేన ప్రభుత్వమే అని చెబుతుంటే వినివిని జనాలకు బాగా విసుగొచ్చేస్తోంది. ఏపీ పరిస్థితే అలాగుంటే తెలంగాణలో జనసేన అసలు ఉనికిలో ఉందా లేదా కూడా తెలియదు.
అలాంటిది 26 నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించేసి తెలంగాణలో ఒంటరిగా పోటీచేసి సత్తా చూపిస్తామంటే ఎవరు నమ్ముతారు? ఇక్కడ పవన్ మరచిపోయిందేమిటంటే తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఏపీపైనా ప్రభావం చూపుతాయని. తెలంగాణ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదంటే కచ్చితంగా దాని ప్రభావం ఏపీ ఎన్నికలపైన పడుతుంది. ఎందుకంటే పవన్ సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసిపోతుంది. నిజానికి పవన్ సత్తా 2019 ఎన్నికల్లో రెండుచోట్లా ఓడిపోయినప్పుడే తెలిసిపోయింది.
కానీ ఈ మధ్య ఏపీలో ఎక్కడ మాట్లాడినా జనసేన ఓటు బ్యాంకు పెరిగిందని గోల చేస్తున్నారు. తెలంగాణలో కూడా పార్టీ బలంగా ఉందంటున్నారు. మరెక్కడ బలంగా ఉందో పవన్‌కు తప్ప ఇంకెవరికీ అర్థంకావటంలేదు. అందుకనే ఎన్నికల్లో పోటీ చేస్తేనే జనసేన ఎంతబలంగా ఉందనే విషయం బయటపడుతుంది. దాన్నిబట్టి ఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభావంపై ఒక అంచనాకు రావచ్చు. ఏదేమైనా జనసేన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకోవటం అందులోనూ ఒంటరి పోటీకి రెడీ అవటమే అందరికీ కావాల్సింది. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.