టీడీపీలో త్యాగమూర్తులకు ఫలం దక్కుతుందా..?
పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కృష్ణా జిల్లాలో మినిస్టర్ రేసు మామూలుగా లేదు. విజయవాడ సిటీలో హ్యాట్రిక్ కొట్టిన గద్దె రామ్మోహన్ తనకు ఈసారి మంత్రి పదవి పక్కా అంటున్నారు. కాపుల కోటాలో బోండా ఉమ, బీసీ కోటాలో కొల్లు రవీంద్ర తమకు ఖాయమంటున్నారు.
కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా, గుంటూరు జిల్లాలో ఆలపాటి రాజా.. ఇంకా చాలామంది నేతలు పొత్తులో తమ సీట్లు త్యాగం చేశారు. వైసీపీ మీద గెలుపే ప్రథమ లక్ష్యమని, అందుకోసం త్యాగాలకు సిద్ధపడాలని చంద్రబాబు రెండేళ్లుగా పార్టీ నేతలను మెంటల్‌గా ప్రిపేర్ చేస్తూ వచ్చారు. చివరిలో కొంతమంది గట్టిగా పట్టుబట్టి సీటు తెచ్చుకున్నా సీనియర్ నేతలు మాత్రం బాబు మాట విని రేసులో నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడు ఏపీలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ నుంచే ఏకంగా 135 మంది ఎమ్మెల్యేలుగా గెలిచేశారు. ఇక ఇప్పుడు మంత్రివర్గంలో స్థానం కోసం రేసు మొదలయింది. టికెట్లు త్యాగం చేసిన తమకు ఎమ్మెల్సీగా తీసుకుని, మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనే డిమాండ్లను ఆయా నేతలు ముందుకు తెస్తున్నారు
ఉమా పరిస్థితేంటి?
దేవినేని ఉమా.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీలో కీలక నేత. తొలుత నందిగామలో, అది రిజర్వుడు స్థానంగా మారాక పక్కనున్న మైలవరంలో ఆ పార్టీకి ఆయనే అభ్యర్థి. మంత్రిగానూ పని చేశారు. కృష్ణా జిల్లాలో ఓరకంగా పార్టీకి ఆయనే పెద్దదిక్కు. కానీ మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి రావడంతో ఆ సీటును ఆయనకే కేటాయించాల్సి వచ్చింది. మొదట్లో పట్టుబట్టినా చంద్రబాబు మాటతో ఉమా తన సీటును త్యాగం చేశారు. పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి వస్తుందా లేదా అనేది ఫజిల్‌గా మారింది.
కృష్ణాలో పోటాపోటీ
పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కృష్ణా జిల్లాలో మినిస్టర్ రేసు మామూలుగా లేదు. విజయవాడ సిటీలో హ్యాట్రిక్ కొట్టిన గద్దె రామ్మోహన్ తనకు ఈసారి మంత్రి పదవి పక్కా అంటున్నారు. కాపుల కోటాలో బోండా ఉమ, బీసీ కోటాలో కొల్లు రవీంద్ర తమకు ఖాయమంటున్నారు. చంద్రబాబుకు వీరవిధేయులు కావడం వీరికి కలిసొచ్చే అంశం. గుడివాడలో కొడాలి నానిని ఓడించిన తనకు మంత్రి పదవి కావాలని వెనిగండ్ల రాము అర్జీ పెడుతున్నారు. గన్నవరంలో వంశీని ఓడించి, చంద్రబాబు వ్యక్తిగత కక్ష తీర్చానని తనకూ మంత్రి పదవి కావాలని యార్లగడ్డ వెంకట్రావ్ కర్చీఫ్ వేస్తున్నారు. ఇంత మంది ఎమ్మెల్యేల మధ్యలో ఎమ్మెల్యే కాని ఉమాకు మంత్రి పదవి ఇవ్వాలంటే చంద్రబాబుకు తలనొప్పే.
ఆలపాటి రాజాదీ అదే పరిస్థితి
మరోవైపు తెనాలిలో మిత్రపక్ష నేత నాదెండ్ల మనోహర్ కోసం సీటు త్యాగం చేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజా కూడా చంద్రబాబు తనను కరుణిస్తారని ఆశతో ఉన్నారు. తొలుత మనోహర్‌కు కాస్త దూరం పాటించినా, చివరకు డబ్బులు పంచేవరకు అన్ని పనులూ తానే భుజాన వేసుకుని చేశారు రాజా. ఇప్పుడు మిత్రపక్షం కోటాలో నాదెండ్ల మనోహర్‌కు క్యాబినెట్ బెర్తు ఖాయమంటున్నారు. అదే జరిగితే రాజాకు మంత్రి పదవి దక్కడం అసాధ్యం. ఒకవేళ సామాజిక సమీకరణాల లెక్కలో మనోహర్‌ను స్పీకర్‌గా పంపినా కూడా అదే నియోజకవర్గ నేత అయిన ఆలపాటి రాజాకు పదవి దక్కడం అనుమానమే. ఈ లెక్కన చూస్తే ఈ నేతల త్యాగాలకు విలువ దక్కే పరిస్థితి కనిపించడం లేదు.