2024 హామీలు.. నవరత్నాలను మించేలా జగన్ నిర్ణయాలుంటాయా..?
నవరత్నాలు ఎలాగూ అమలులో ఉంటాయి.. 2024లో అధికారంలోకి వస్తే వాటితోపాటు ఇంకేమేం చేస్తామనేది జగన్ చెప్పాల్సి ఉంది. 2024 ఎన్నికలకు వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉంటుందనేది ఆసక్తిని కలిగిస్తోంది.
ఎన్నికల మేనిఫెస్టోకి పూర్తి స్థాయి అర్థం చెప్పిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు సీఎం జగన్. సంపూర్ణ మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు.. వంటి హామీలను పక్కనపెడితే మిగతావాటి విషయంలో నూటికి నూరుపాళ్లు ఆయన మాటమీద నిలబడ్డారనే చెప్పాలి. ప్రస్తుతం 2024 ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతోంది. టీడీపీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ మరోసారి మాటల గారడీ చేస్తోంది. ఈ గారడీ పూర్తి స్థాయిలో చేసే లోపే చంద్రబాబు జైలుకెళ్లి కూర్చున్నారు, లోకేష్ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. లీడర్లు, క్యాడర్లు కొవ్వొత్తులు పట్టుకుని రోడ్లపై తిరుగుతున్నారు కానీ, ఎన్నికలకోసం సన్నద్ధం కావట్లేదు. ఈ దశలో వైసీపీ మేనిఫెస్టో ఏంటనేది ఆసక్తికరంగా మారింది. రేపు విజయవాడలో వైసీపీ కార్యవర్గ సమావేశం పెద్ద ఎత్తున జరగబోతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్ చార్జ్ లు, ఇతర నేతలు.. దాదాపు 9వేలమంది మంది వస్తారని అంచనా. ఈ సమావేశంలో మేనిఫెస్టో గురించి జగన్ ఏమైనా హింట్ ఇస్తారేమోనని గుసగుసలు వినపడుతున్నాయి.
నవరత్నాలను మించి..
నవరత్నాల హామీలతో 2019లో ప్రజల్ని ఆకట్టుకున్నారు జగన్. జగన్ ఆ హామీలను నెరవేరుస్తారనే నమ్మకం ప్రజల్లో ఉన్నా లేకున్నా.. చంద్రబాబు అధికారంలోకి వస్తే కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేస్తారనే భావన బలంగా నాటుకుపోయి ఉంది. అందుకే ఏకపక్షంగా జగన్ కి జై కొట్టారు. 151 సీట్ల రికార్డు స్థాయి మెజార్టీ కట్టబెట్టారు. 2024లో జగన్ వైనాట్ 175 అంటున్నారు. అంటే ఆ స్థాయిలో సీట్లు సాధించాలంటే.. హామీలు ఏ స్థాయిలో ఉండాలనేది చర్చనీయాంశంగా మారింది. నవరత్నాలు ఎలాగూ అమలులో ఉంటాయి.. 2024లో అధికారంలోకి వస్తే వాటితోపాటు ఇంకేమేం చేస్తామనేది జగన్ చెప్పాల్సి ఉంది. 2024 ఎన్నికలకు వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉంటుందనేది ఆసక్తిని కలిగిస్తోంది.
ఉచితాలు ఉంటాయా..?
ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది కాంగ్రెస్, టీడీపీ విస్తృతంగా వాడుతున్నాయి. ఆ హామీ జోలికి జగన్ వెళ్తారా లేదా అనేది అనుమానమే. గ్యాస్ సిలిండర్ రేటు తగ్గింపు అనేది కూడా టీడీపీ కాపీ కొట్టేసింది కాబట్టి జగన్ ఆ విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇక తెలంగాణలో అమలులో ఉన్న దళితబంధు వంటి పథకాలవైపు జగన్ మొగ్గుచూపుతారా లేదా అనేది వేచి చూడాలి. సామాజిక పింఛన్ల పెంపు, అమ్మఒడి.. ఇతరత్రా ఆర్థిక సాయాల పెంపుపై కూడా జగన్ నిర్ణయం తీసుకుంటారనే అంచనాలున్నాయి. ఇవన్నీ కాకపోతే ఈసారి అభివృద్ధి, ఉపాధి కార్యక్రమాలపై జగన్ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మూడు రాజధానుల అభివృద్ధికి స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశముంది. ఉచితాలు ఎన్నికల్లో ఏమేరకు ఓట్లు తెప్పించగలవు అనేది 2024 ఏపీ ఎన్నికల ఫలితాలతో తేలిపోతుంది.