జరిగింది కిడ్నాప్.. రాజకీయం చేయకూడదంటే ఎలా..?

చంద్రబాబు పాలనలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని ఆరోపించారు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. కిడ్నాపర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ ఒక్క ఉదాహరణతో విశాఖపై నిందలు వేయడం సరికాదన్నారు.

Advertisement
Update:2023-06-21 15:25 IST

జరిగింది కిడ్నాప్..

అందులోనూ కిడ్నాప్ కి గురైంది అధికార పార్టీ ఎంపీ కుటుంబం.

అది కూడా భావి రాజధానిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్న విశాఖ పట్టణంలో జరిగిందీ ఘటన.

మరి ప్రతిపక్షాలు రాజకీయం చేయకూడదంటే ఎలా..? అదనుకోసం చూస్తున్న ప్రతిపక్షాలు కచ్చితంగా ఆ అంశాన్ని హైలెట్ చేస్తాయి. సాక్షాత్తూ అధికార పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులకే రక్షణ కరువైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీస్తాయి. అంతమాత్రానికే ఉడుక్కుంటే ఎలా..? కిడ్నాప్ జరిగిన వారం రోజులకి వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పెట్టిన కవరింగ్ ప్రెస్ మీట్ లో ఆయన బాధితుడిగా కాకుండా, వైజాగ్ ఎంపీగానే మాట్లాడారు. ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

కిడ్నాపర్లతో సంబంధం లేదు..

ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ జరిగిన వెంటనే వ్యాపారంలో గొడవలు, కబ్జాలు, రియల్ ఎస్టేట్ దందాలు అంటూ వైరి వర్గాలు తమ అనుకూల మీడియా ద్వారా వార్తల్ని వండి వార్చారు. కిడ్నాపర్లు హేమంత్, రాజేష్.. తో ఎంపీ సత్యనారాయణకు ముందే సంబంధాలున్నాయనే ఆరోపణలు వినిపించాయి. దీంతో ఆయన వెంటనే మీడియాకు వివరణ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ మరోసారి వివరణ ఇచ్చుకున్నారు. కిడ్నాపర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ ఒక్క ఉదాహరణతో విశాఖపై నిందలు వేయడం సరికాదన్నారు.

బాబు పాలనలో జరగలేదా..?

చంద్రబాబు పాలనలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని ఆరోపించారు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. ఆయన హయాంలో అలాంటివి జరిగాయి కాబట్టే, మరోసారి జరగకూడదనే ఉద్దేశంతోటే ప్రజలు వైసీపీని గెలిపించారు. మరి వైసీపీ హయాంలో కూడా ఇలాంటివే జరిగితే దీనికి స‌మాధానం ఎవరు చెబుతారు.అప్పుడు కూడా జరిగాయి కదా అని చెప్పడం పలాయన వాదం కాక ఇంకేంటి..?

రాష్ట్రంలో మిగతా చోట్ల దాడులు, గొడవలు, అరెస్ట్ లు, ఆత్మహత్యలు.. ఇతరత్రా వ్యవహారాలపై ప్రతిపక్షాల విమర్శలను ప్రజలెవరూ పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అవన్నీ కుట్రపూరితంగా చేసిన ఆరోపణలు అనుకోవచ్చు. కానీ, విశాఖలో ఎంపీ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసి డబ్బులు గుంజిన వ్యవహారంలో మాత్రం ప్రభుత్వాన్ని తప్పుపట్టొద్దు అని అంటే అంతకు మించిన అమాయకత్వం ఇంకోటి ఉండదు. పైగా ఆ వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారని బాధపడటం, విశాఖపై అపనిందలు వేస్తున్నారని ఆవేదన చెందడం కూడా అదే కోవలోకి వస్తాయి. 

Tags:    
Advertisement

Similar News