సోషల్ మీడియాలో బెజవాడ దుర్గమ్మ అంతరాలయం వీడియోలు
ఇన్‌స్టాగ్రాంలోని కనకదుర్గ టెంపుల్ ఐడీలో అమ్మవారి మూలవిరాట్ వీడియోలు కనిపిస్తున్నాయి. ఆలయ ఆవరణతో పాటు, అంతరాలయం, అమ్మవారి విగ్రహం వీడియోలను ఈ ఐడీలోనే పోస్టు చేశారు.
ఆలయంలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడం నిషేధించారు. అయినా ఇంద్రకీలాద్రి అమ్మవారి అంతరాలయం వీడియోలు మొబైల్‌లో చిత్రీకరించిన కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఏకంగా అమ్మవారి మూల విరాట్ ను వీడియో తీసి పోస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇన్‌స్టాగ్రాంలోని కనకదుర్గ టెంపుల్ ఐడీలో అమ్మవారి మూలవిరాట్ వీడియోలు కనిపిస్తున్నాయి. ఆలయ ఆవరణతో పాటు, అంతరాలయం, అమ్మవారి విగ్రహం వీడియోలను ఈ ఐడీలోనే పోస్టు చేశారు.
అయితే వీఐపీలు, లేదా 500 టికెట్ తీసుకుని వచ్చినవారిలో ఎవరో ఇవి తీసి ఉంటారని భావిస్తున్నారు. వీరు మొబైల్స్ ఆలయంలోకి తీసుకురావడంతోపాటు, వీడియోలు చిత్రీకరించేందుకు ఆలయ సిబ్బంది సహకరించి ఉంటారనే అనుమానాలు వస్తున్నాయి. ఇదే విషయంపై దుర్గగుడి ఈవో అధికారులతో దర్యాప్తు చేయిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించాలని ఈ వీడియోలు తీసినవారిని గుర్తించాలని ఆదేశించారు. ఆలయంలో వీడియోలు, ఫొటోలు నిషేధించినా, ఏకంగా అంతరాలయం వీడియోలు, అమ్మవారి విగ్రహం వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇన్‍స్టాగ్రామ్‌లో దుర్గగుడి వీడియోల ప్రత్యక్షంపై ఆలయ ఈవో స్పందించారు. గతనెల 22న ఇన్‍స్టాలో శాంతకుమారి అనే భక్తురాలు వీడియోలు తీసి పోస్టు చేసినట్లుగా గుర్తించామన్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా శాంతకుమారిపై వన్‍టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. వీడియోకు, ఆలయ సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ ఘటనపై అంతరాలయ సెక్యూరిటీ సిబ్బందికి నోటీసులు ఇచ్చినట్టు విజయవాడ కనకదర్గ ఆలయ ఈవో వెల్లడించారు.