రౌడీ షీట్ల పేరుతో గోప్యత హక్కును ఉల్లంఘించకూడదు : ఏపీ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. రౌడీ షీట్ల పేరిట వ్యక్తుల గోప్యతను భంగపర్చరాదని పోలీసులకు సూచించింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. రౌడీ షీట్ల పేరిట వ్యక్తుల గోప్యతను భంగపర్చరాదని పోలీసులకు సూచించింది. ఒక వ్యక్తిని అనవసరంగా పోలీస్ స్టేషన్ కు పిలిపించడం, వారి ఫొటోలు తీసుకోవడం, వారి ఇళ్ళపై నిఘా పెట్టడం, ఇళ్ళకు వెళ్ళి సమాచారం సేకరించడం వంటి చర్యలకు పాల్పడరాదని పేర్కొంది. ఇటువంటి చర్యలు 'గోప్యత హక్కును ఉల్లంఘించడమే' అని వ్యాఖ్యానించింది. "పోలీసు స్టాండింగ్ ఆర్డర్‌లకు చట్టపరమైన మద్దతు లేదు. రౌడీ షీట్‌లను తెరవడానికి, కొనసాగించడానికి వాటిని సాధనంగా లేదా సమర్థనగా ఉపయోగించలేము. అవి కేవలం పరిపాలనా మార్గదర్శకాలు. మాత్రమే అని హైకోర్టు పేర్కొంది.
తమపై రౌడీషీట్‌లు తెరవడాన్ని, కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ ఉడతు సురేష్ తదితరులు దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించడం, ఫోటోలు తీయడం, ఫోటోలు ప్రదర్శించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 సెక్షన్లను ఉల్లంఘించడమేనని కోర్టు పేర్కొంది.
ప్రభుత్వం తరపున జి.మహేశ్వర రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రజా ప్రయోజనాల కోసం పోలీసులు స్టాండింగ్ ఆర్డర్స్ మేరకు ఇలా చేస్తారని పేర్కొన్నారు. ఈసందర్భంగా 2020లో తెలంగాణ హైకోర్టు తీర్పును, బీఎస్ ప్రకాష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసును ఉదహరించారు. " నేరాలను ముందుగా గుర్తించడానికి, నిరోధించడానికి డేటా, ఇంటెలిజెన్స్ సేకరణ చాలా అవసరమని తెలిపారు. వీటిని ఒక్క కలం పోటుతో అకస్మాత్తుగా రద్దు చేయజాలమని అన్నారు. రాజ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, కొన్ని మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉంటుంది అన్నారు.
"నేరాన్ని నిరోధించడానికి ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించాల్సిన అవసరం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా చట్టబద్ధమైన నిబంధనలను రూపొందించాలని జస్టిస్ డివివిఎస్ సోమయాజులు ధర్మాసనం ఆదేశించింది. దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ఈ అంశంపై ఉన్న చట్టాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రం తక్షణమే తగిన చట్టాన్ని రూపొందిస్తుందని ఆశిస్తున్నాము. 'గోప్యత' ప్రాథమిక హక్కుగా ప్రకటించబడుతోంది" అని కోర్టు పేర్కొంది.