జగన్ కు ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక సూచనలు
ప్రజలు, ప్రభుత్వం మధ్య ఉండాల్సింది వాలంటీర్లు కాదని, పార్టీ ఉండాలని తేల్చి చెప్పారు ఉండవల్లి. వాలంటీర్లను వైసీపీ నమ్ముకుందని, వారు కూడా రూ.10వేలు జీతం ఇస్తామన్న టీడీపీకోసం పనిచేశారని అన్నారు.
వైసీపీ పతనమైపోయింది అనుకుంటే అది టీడీపీ పొరపాటవుతుందని, ఒకవేళ తమ పని అపోయిందని వైసీపీ నేతలు అనుకున్నా అది వారి అపోహే అవుతుందని చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఓటమిపై సమీక్ష చేసుకుని తిరిగి పార్టీని నిలబెట్టాలన్నారు. ఓటమికి గల కారణాలు విశ్లేషించుకోవాలన్నారు. అసలు వైసీపీ ఎక్కడా లేకుండా పోయిందని, ఈ ఐదేళ్లలో అయినా పార్టీ నిర్మాణం జరగాలని, అధికార ప్రతినిధులను నియమించుకోవాలని, వారికి ఎలా మాట్లాడాలో నేర్పించాలని చెప్పారు ఉండవల్లి. టీడీపీ దాడులపై వైసీపీ న్యాయపోరాటం చేయాలని సూచించారు.
బూతులా..?
అసెంబ్లీలోనూ బూతులే, అసెంబ్లీ బయటా బూతులే..? అంటే జనాలు హర్షించరని చెప్పారు ఉండవల్లి. సరిహద్దు గొడవల్లాగా ఎక్కడపడితే అక్కడ బూతులు మాట్లాడటం సరికాదన్నారు. గౌరవంగా మాట్లాడుకుంటే తప్పేంటన్నారు. వాలంటీర్లను వైసీపీ నమ్ముకుందని, వారు కూడా రూ.10వేలు జీతం ఇస్తామన్న టీడీపీకోసం పనిచేశారని అన్నారు. ప్రజలు, ప్రభుత్వం మధ్య ఉండాల్సింది వాలంటీర్లు కాదని, పార్టీ ఉండాలని తేల్చి చెప్పారు ఉండవల్లి.
కేంద్రంలో కూడా మోదీ హవాకు బ్రేక్ పడటం వల్ల ఏపీకి మంచి జరిగిందని చెప్పారు ఉండవల్లి. అయితే మోదీపై ఒత్తిడి తెచ్చి ఏపీకి మంచి జరిగేలా కొత్త ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ఇక ఏపీలో వైసీపీ ఓటమికి ప్రధాన కారణం పవన్ కల్యాణ్ అని చెప్పారు ఉండవల్లి. బీజేపీతో పొత్తులో ఉంటూనే.. చంద్రబాబుని జైలులో కలసి వచ్చిన పవన్ కల్యాణ్ మద్దతిస్తున్నట్టు సొంతగా ప్రకటించారని, బీజేపీ లేకపోయినా టీడీపీతో కలసి వెళ్లాలనుకున్నారని, కేవలం వైసీపీ ఓటమికోసమే ఆయన పనిచేశారని అన్నారు. కమ్మ-కాపు కలసి పనిచేయడం ఈ ఎన్నికల్లో కూటమికి లాభంగా మారిందన్నారు ఉండవల్లి.