జనసేన సభ ఉంది, దొంగతనాలు జరుగుతాయని అనౌన్స్ మెంట్...సోషల్ మీడియలో వైరల్
ఈ వీడియోపై జనసైనికులు భగ్గుమంటుండగా మరికొందరు జనసైనికులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ వీడియో పై విమర్శలు - ప్రతివిమర్శలతో సోషల్ మీడియాలో యుద్దమే జరుగుతోంది.
ఈ రోజు జనసేన పార్టీ పదవ ఆవిర్భావ సభ మచిలీపట్నంలో జరుగుతోంది. ఈ సందర్భంగా జనసేన, పవన్ కళ్యాణ్ అభిమానులతో మచిలీపట్నం నిండిపోయింది. విజయవాడ నుండి మచిలీపట్నం రావడానికి పవన్ కళ్యాణ్ కు దాదాపు 6 గంటలు పట్టింది. ఈ నేపథ్యంలో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో...''మన పట్టణం లో జనసేన ఆవిర్భావ సభ జరుగుతోంది. పట్టణంలో జేబుదొంగలు, చైన్ స్నాచర్స్ సంచరించవచ్చు. సైకిల్ దొంగతనాలు, బైక్ దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తమ పర్సులు, ఆభరణాలు కాపాడుకోవాలి. అజాగ్రత్తగా ఉండకుండా, జాగ్రత్తగా ఉండాల్సిందిగా హెచ్చరించడమైనది. ప్రజా హితార్థం ఈ హెచ్చరిక జారీ చేయడమైనది '' అని ఉంది.
ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ కార్పొరేషన్ ఛైర్మన్ దేవేంద్ర రెడ్డి తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసి, ''జనసేన మీటింగ్ అంటే జేబుదొంగలకి... అదేనండీ సైనిక్స్ కి మంచి గిరాకీ అని, జనాలు జాగ్రత్త గా ఉండాలని మైకులో చాటింపేసి మరీ చెప్తున్నారంటే.. సైనిక్స్ టాలెంట్ మీద ఎంత నమ్మకమో! '' అని కామెంట్ చేశారు.
ఈ వీడియోపై జనసైనికులు భగ్గుమంటుండగా మరికొందరు జనసైనికులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ వీడియో పై విమర్శలు - ప్రతివిమర్శలతో సోషల్ మీడియాలో యుద్దమే జరుగుతోంది. అయితే ఇది మార్ఫింగ్ చేసిన వీడియో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.