చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీం కోర్టు ఎత్తిచూపింది

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌

Advertisement
Update:2024-10-04 19:13 IST

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిజ స్వరూపాన్ని సుప్రీం కోర్టు ఎత్తి చూపిందని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం హోదాలో చంద్రబాబు మత విశ్వాసాలను రెచ్చగొట్టాడని సుప్రీం కోర్టు అర్థం చేసుకుందని, అందుకే ఆయన ఏర్పాటు చేసిన సిట్‌ రద్దు చేసి సీబీఐ నేతృత్వంలో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేసిందన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని ధర్మాసనం హితవు చెప్పిందని గుర్తు చేశారు. రాజకీయ దుర్బుద్ధితోనే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని జగన్‌ మండిపడ్డారు. తిరుమల ప్రతిష్ఠను అపవిత్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, టీటీడీ ఈవో ప్రకటనలకు మధ్య వ్యత్యాసం ఉందని అన్నారు. చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేవన్నారు. ఆయనలో పశ్చాత్తాపం కనిపించడం లేదని తెలిపారు. దేవుడిపై భక్తి ఉంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేవుడి విషయంలో తప్పు జరిగిందని తెలిసినా ఇప్పటికీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది వాళ్లనయితే తపైనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కోర్టు వ్యాఖ్యలు, ఆదేశాలను వక్రీకరిస్తున్నారని, భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.

శ్రీవారి ప్రసాదం తయారీలో కల్తీకి ఆస్కారం లేకుండా తిరుమలలో గొప్ప వ్యవస్థ ఉందని తెలిపారు. ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి సరఫరా చేసే ట్యాంకర్లను మూడుసార్లు చెక్‌ చేస్తారని, అక్కడి తనిఖీల్లో కల్తీ బయట పడితే ట్యాంకర్లను వెనక్కి పంపిస్తారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో 14 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపితే వైసీపీ ప్రభుత్వంలో 18 సార్లు వెనక్కి పంపించామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయాలని ప్రజలు నిలదీస్తుండటంతోనే చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ లో భాగంగా తిరుమల లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. సనాతన ధర్మం అంటే ఏమిటో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కు తెలుసా అని జగన్‌ ప్రశ్నించారు. దేవుడి విషయంలో తప్పును గుడ్డిగా సమర్థించడమే సనాతనమా అని ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్న తప్పును మోస్తున్న వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తప్పు జరిగిందని కళ్లకు కనిపిస్తోందని, దాన్ని అడ్డుకోలేని వ్యక్తి ధర్మం గురించి మాట్లాడటమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి జోలికి వెళ్తే వ్యవహారం మామూలుగా ఉండదని, వారికి జరగబోయే నష్టం కూడా మామూలుగా ఉండదని హెచ్చరించారు. దేవుడి కోపం చంద్రబాబుకే పరిమితం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. తప్పు జరగనప్పుడు సిట్‌ వేయాల్సిన అవసరమే లేదన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిని స్వామివారే చూసుకుంటారని అన్నారు.

Tags:    
Advertisement

Similar News