పవన్ ఒంటరైపోయారా?

జగన్మోహన్ రెడ్డిపై పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడితే మొదటి పేజీల్లో అచ్చేసే ఎల్లో మీడియా కూడా మద్దతుగా నాలుగు వార్తలు రాయటంలేదు. మిత్రపక్షం కాదు కదా చివరకు నమ్ముకున్న పార్టీ కూడా మద్దతుగా మాట్లాడటం లేదు.

Advertisement
Update:2023-07-13 11:23 IST

పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. మిత్రపక్షం కాదు కదా చివరకు నమ్ముకున్న పార్టీ కూడా మద్దతుగా మాట్లాడటంలేదు. జగన్మోహన్ రెడ్డిపై పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడితే మొదటి పేజీల్లో అచ్చేసే ఎల్లో మీడియా కూడా మద్దతుగా నాలుగు వార్తలు రాయటంలేదు. ఇప్పటికైనా పవన్‌కు అర్థ‌మవుతుందా చంద్రబాబునాయుడు వాడకం ఎలాగుంటుందో. ఇంతకు అసలు విషయం ఏమిటంటే వారాహియాత్రలో పవన్ మాట్లాడుతూ.. హ్యూమన్ ట్రాఫికింగ్‌కు వలంటీర్లే కారణమని ఆరోపించారు.

తన ఆరోపణల్లో ఎంత నిజముందనే విషయం పవన్‌కు బాగా తెలుసు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటంతో వలంటీర్లంతా రెచ్చిపోయారు. 2.5 లక్షల మంది వలంటీర్లు తమ శక్తివంచన లేకుండా జనాలకు సేవలందిస్తున్నారు. ఎక్కడైనా ఆరోప‌ణలు ఎదుర్కొంటున్న వలంటీర్లను వెంటనే ప్రభుత్వం విధుల్లో నుండి తీసేసి వాళ్ళపై కేసులు నమోదు చేసి యాక్షన్ తీసుకుంటోంది. ప్రభుత్వం అందిస్తున్న సుమారు 500 రకాల సేవలు వలంటీర్ల ద్వారానే జనాలకు పక్కాగా అందుతున్నాయి.

రేపటి ఎన్నికల్లో వలంటీర్లంతా కచ్చితంగా వైసీపీకి అనుకూలంగానే పనిచేస్తారని అప్పుడు తమకు ఓటమి తప్పదని చంద్రబాబు, ఎల్లో మీడియాకు భయం పెరిగిపోతోంది. అందుకనే పవన్ ద్వారా వాళ్ళపై హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేయించారని మంత్రులు మండిపోతున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే నాలుగు రోజులుగా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పవన్+చంద్రబాబును కలిపి ఏకిపారేస్తున్నారు. ఇదే సమయంలో వలంటీర్లు కూడా చంద్రబాబుతో కలిపి పవన్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. పోస్టర్లకు చెప్పుల దండలు వేసి కొడుతున్నారు. పవన్‌కు మద్దతుగా చంద్రబాబు మాట్లాడకపోగా వలంటీర్ల వ్యవస్థ‌ ఉంటుందని, వలంటీర్లను కంటిన్యూ చేస్తామన్నారు.

ఇదే సమయంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. పవన్ మాటలను తప్పుపట్టారు. వలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న‌ది నిజమే అని ఎల్లో మీడియా ఒక్క వార్త కూడా రాయలేదు. మిత్రపక్షం బీజేపీ కూడా తనకేమీ సంబంధంలేదన్నట్లుగా మౌనంగానే ఉండిపోయింది. సో, జరుగుతున్నది చూస్తుంటే పవన్ ఈ అంశంపై ఒంటరైపోయినట్లుగానే అనిపిస్తోంది. వలంటీర్ల వ్యవస్థ‌పై పవన్ ఆరోపణలు నిజమే అయితే ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా మద్దతుగా నిలవకుండా ఉంటాయా?

Tags:    
Advertisement

Similar News