వివేకా హత్యపై షర్మిల వాంగ్మూలం డైవర్షన్ కోసమే అయ్యన్న అరెస్ట్ - చంద్రబాబు

వివేకా హత్యపై షర్మిల వాంగ్మూలం, రుషికొండ అంశంపై కోర్టు ఆదేశాల నేపథ్యంలోనే డైవర్షన్ కోసమే అయ్యన్నను అరెస్ట్ చేశారని చంద్రబాబు మండిపడ్డారు.

Advertisement
Update:2022-11-03 16:36 IST

వివేకానందరెడ్డి హత్యపై షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని అర్ధరాత్రి తప్పుడు కేసులో అరెస్టు చేశారని టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తారుమారుపై సీఐ శంకరయ్య సీబీఐకి తొలుత వాంగ్మూలం ఇచ్చారని, ప్రభుత్వం నుంచి పదోన్నతి పొందాక వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారని .. అయ్యన్న కుటుంబంపై జలవనరుల శాఖ అధికారి మల్లిఖార్జున రావు ఇచ్చిన ఫిర్యాదు కూడా ఇలాంటిదేనన్నారు.

అయ్యన్నపాత్రుడు తాత నుంచీ ఆ కుటుంబానికి మచ్చ లేని 60 ఏళ్ల రాజకీయాల చరిత్ర ఉందని, జగన్మోహన్ రెడ్డి ది భూదోపిడీ కుటుంబ చరిత్ర అని ఆరోపించారు. ఇడుపులపాయలో వందల ఎకరాలు వైఎస్ కుటుంబం ఆక్రమించుకుందని, బంజారాహిల్స్ లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి వైఎస్ సీఎం అయ్యాక దానిని క్రమబద్దీకరించుకున్నారని పేర్కొన్నారు. మంగంపేట బెరైటీస్ గనులను అనుకుని ఉన్న పురావస్తు భూమిని వైఎస్ కుటుంబం ఆక్రమించుకుందని నటరాజన్ కమిషన్ నిర్ధారించిందని వెల్లడించారు. జగన్ మేనమామ వాగును ఆక్రమించి థియేటర్ కట్టుకున్నారని, ఇంతటి భూ దోపిడీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 0.02 సెంట్లు ఆరోపణలపై అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేయించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్యపై షర్మిల వాంగ్మూలం, రుషికొండ అంశంపై కోర్టు ఆదేశాల నేపథ్యంలోనే డైవర్షన్ కోసమే అయ్యన్న అరెస్ట్ చేశారని చంద్రబాబు మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News