అమరావతివాదులకు సుప్రీంకోర్టులో లభించని ఊరట

రాజధానిలో పేదల ఇళ్ల స్థలాల కోసం 5 శాతం భూమిని కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలోనే ఉందని అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్‌ రెడ్డి గుర్తు చేశారు.

Advertisement
Update:2023-05-15 15:58 IST

అమరావతి వాదులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పేద ప్రజల కోసం అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం జీవో విడుదల చేయగా.. దాన్ని వ్యతిరేకిస్తూ తొలుత అమరావతివాదులు హైకోర్టుకు వెళ్లారు. కానీ అక్కడ వారికి ఊరట లభించలేదు. ప్రభుత్వానికి భూములు అప్పగించిన తర్వాత వాటిని ఎలా వాడుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టమని.. అసలు రాజధాని అంటే ఏ ఒక్క వర్గానికో చెందినది కాదంటూ హైకోర్టు అమరావతివాదుల పిటిషన్లను కొట్టివేసింది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ప్ర‌క్రియ‌కు వేగంగా ప‌నులు చేప‌డుతోంది. ఈనేపథ్యంలో అమరావతివాదులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. తక్షణం ఇళ్ల స్థలాల పంపిణీపై స్టే ఇవ్వాలని కోరారు. కానీ సుప్రీంకోర్టు అందుకు అంగీకరించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో స్టే ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. దాంతో పాటు ఈ కేసు విచారణను ఇప్పటికే అమరావతి కేసును విచారిస్తున్న ధర్మాస‌నానికే బదిలీ చేస్తామని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ జరిగే లోపే ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ పూర్తి చేసే అవకాశం ఉంది.

రాజధానిలో పేదల ఇళ్ల స్థలాల కోసం 5 శాతం భూమిని కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలోనే ఉందని అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్‌ రెడ్డి గుర్తు చేశారు. అలాంటి చట్టానికి కూడా గండి కొట్టాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోవడాన్ని పేదల విజయంగా అభివర్ణించారు. క్యాపిట‌ల్ కేవలం క్యాపిటలిస్ట్‌లకు మాత్రమే సొంతం కాదని వ్యాఖ్యానించారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే మురికివాడలు తయారవుతాయంటూ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ఈ తీరును ప్రజలు గుర్తించాలన్నారు.

పేదల ఇళ్ల స్థలాల కోసం ఏర్పాటు చేసిన ఆర్‌-5 జోన్‌లో గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన దాదాపు 50వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలను ప్రభుత్వం ఇవ్వబోతోంది.

Tags:    
Advertisement

Similar News