బెంగళూరుకు జగన్ ఎందుకు వెళ్లారంటే..?

జగన్ బెంగళూరు పర్యటనపై అధికారిక సమాచారం లేకపోవడంతో దానిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

Advertisement
Update:2024-06-25 06:27 IST

చాన్నాళ్ల తర్వాత జగన్, బెంగళూరు వెళ్లడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బెంగళూరు వెళ్లారని చెబుతున్న వైసీపీ, కారణం మాత్రం చెప్పడంలేదు. అసలు అధికారికంగా జగన్ బెంగళూరు వెళ్తున్నారనే ప్రకటన కూడా పార్టీ నుంచి వెలువడలేదు. కేవలం ఓ టీవీ ఛానెల్ లో వచ్చిన వార్తను ఖండించే సందర్భంలోనే జగన్ బెంగళూరులో ఉన్నారని చెప్పుకొచ్చారు. అంతేకానీ, ఆయన ఎందుకెళ్లారు, ఎప్పుడు తిరిగొస్తారు, ఆయన వెంట ఎవరున్నారు..? అనే విషయాలను వైసీపీ బయటపెట్టలేదు.


ఈనాడు ఆసక్తికర కథనం..

జగన్ కి బెంగళూరులో ప్యాలెస్ ఉందని, అది ఇంద్రభవనంలా ఉంటుందని.. గతంలో టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసేది. రుషికొండ భవనాల వ్యవహారం బయటపడిన తర్వాత ఆ పోలిక చెప్పి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించింది. ఇప్పుడు జగన్ బెంగళూరు వెళ్లిన తర్వాత ఈనాడు ఓ ఆసక్తికర కథనం ఇవ్వడం విశేషం. పులివెందుల పర్యటనలో పెండింగ్ బిల్లుల వ్యవహారం జగన్ కి తలనొప్పిగా మారిందని, అందుకే ఆయన సొంత నియోజకవర్గ పర్యటన కుదించుకుని బెంగళూరు వెళ్లిపోయారనేది ఆ కథనం సారాంశం.

పులివెందులలో జగన్ కి అపూర్వ స్వాగతం లభించిందని వైసీపీ చెబుతోంది. లేదు లేదు, జనం జగన్ ని నిలదీసేందుకు వచ్చారని, పార్టీ ఆఫీస్ అద్దాలు కూడా పగలగొట్టారని టీడీపీ అనుకూల మీడియా వార్తలిచ్చింది. అసలక్కడ ఏం జరిగింది అనే దానిపై అధికారికంగా ఎవరూ మాట్లాడకపోవడం విశేషం. పులివెందుల పర్యటన తర్వాత జగన్ కూడా మీడియా సమావేశం నిర్వహించలేదు, నేరుగా బెంగళూరు వెళ్లిపోయారు. దీంతో వైరి వర్గం మరిన్ని కథనాలు వండి వారుస్తోంది. పులివెందుల ఏరియా డెవలప్ మెంట్ ఏజెన్సీ చేపట్టిన పనులకు సంబంధించి బిల్లుల వ్యవహారంలో తేడాలొచ్చాయని, కొంతమంది కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు తమ బిల్లుల కోసం గొడవ చేశారని, పులివెందులలో ఈ గొడవలు భరించలేక జగన్ అక్కడినుంచి వెళ్లిపోయారని అంటున్నారు. ఇందులో ఏది వాస్తవం, ఏది అవాస్తవం అని చెప్పలేం కానీ.. జగన్ అక్కడ కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఉంటే బాగుండేదనే వాదన కూడా వినపడుతోంది. పార్టీ ఆఫీస్ కూల్చివేతపై కేవలం ట్వీట్ వేసి వదిలిపెట్టకుండా, మీడియా ముందు తనదైన వాదన వినిపించి ఉంటే పార్టీ నేతలు, కార్యకర్తలకు భరోసా ఇచ్చినట్టు ఉండేదని అంటున్నారు. ఇక జగన్ బెంగళూరు పర్యటనపై కూడా అధికారిక సమాచారం లేకపోవడంతో దానిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. 

Tags:    
Advertisement

Similar News