శ్రీవారి లడ్డూ కల్తీ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
తిరుమల లడ్డూ కల్తీ కేసులో కీలక అడుగు పడింది.
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక అడుగు పడింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీలోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీవైష్ణవి డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో అపూర్వ చావడా, తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌లోని ఏఆర్ డెయిరీ ఎండీ డా.రాజు రాజశేఖరన్‌లను సిట్ అధికారులు తిరుపతిలో అరెస్టు చేశారు. వారిలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ, పరాగ్ ఫుడ్స్ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ప్రతినిధులు ఉన్నారు.
నిందితులను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం సంబంధించి రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక విషయాలు వెల్లడించింది. నిందితులు అధారాలు చెరిపేసేందుకు పాత ఫోన్లు ధ్వంసం చేసి కొత్తవి కొన్నారని తెలిపింది. బోలేబాబా డెయిరీ నెయ్యిని తమ పేరు మీద టీటీడీకి సరఫరా చేసినట్లు వివరించింది. నిందితులు విచారణకు సహకరించడం లేదని తెలిపింది.