జగన్ కు ప్రతిపక్ష హోదా సాధ్యం కాదు
కుండబద్దలు కొట్టిన స్పీకర్ అయ్యన్న
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. జగన్ పార్టీకి అంతమంది ఎమ్మెల్యేలు లేరు కాబట్టి ప్రతిపక్షనేత హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదా కోసం జగన్ చేస్తున్న న్యాయపోరాటంపై స్పీకర్ అయ్యన్న స్పందించారు. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం అసాధ్యమని కుండబద్దలు కొట్టేశారు. అసెంబ్లీ నియమాలు, నిబంధనలను జగన్ తెలుసుకోవాలని సూచించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి తమ నియోజకవర్గాల సమస్యలపై మాట్లాడాలని సూచించారు. స్పీకర్ గా తనకు కొన్ని పరిమితులు ఉంటాయని.. తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదన్నారు. ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్పీకర్ కామెంట్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.